
హుజూరాబాద్ : కాళేశ్వరం ప్రాజెక్టులో ముఖ్యమంత్రి కేసీఆర్ రూ.లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డారని, అందులో రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లకు ముడుపులు అందాయని వైఎస్సార్ తెలంగాణపార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. గతంలోకార్పొరేటర్ గా ఉన్న బండి సంజయ్ ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాక వందల కోట్ల ఆస్తులు కూడబెట్టుకున్నారని వ్యాఖ్యానించారు. ప్రజా ప్రస్థానం పాదయాత్రలో భాగంగా శుక్రవారం సాయంత్రం కరీంనగర్ జిల్లాకు చేరుకున్న ఆమె అక్కడ సభలో మాట్లాడారు.
‘టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ పై అవినీతిపరుడని ముద్రవేసి టిఆర్ఎస్ నుంచి వెళ్లగొట్టారు. కేసీఆర్ అవినీతి గురించి ఆయనకు తెలిసినా ఎందుకు నోరు విప్పడం లేదు’ అని ప్రశ్నించారు. మతం పేరుతో చిచ్చు పెట్టి ఆ మంటల్లో చలి కాచుకోవాలని బీజేపీ చూస్తోందని అన్నారు. కెసిఆర్ తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారు. 18 లక్షల దళిత కుటుంబాలు ఉంటే 35 వేల మందికి మాత్రమే దళితబందు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. రెండు లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా నోటిఫికేషన్లు ఇవ్వక నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారు’ అని షర్మిల ఆరోపించారు.