కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ.. బీజేపీలో చేరనున్న కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి..!

Published : Nov 19, 2022, 09:48 AM IST
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో భేటీ.. బీజేపీలో చేరనున్న కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి..!

సారాంశం

కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి పార్టీ మారుతున్నట్టుగా కొద్దిరోజులుగా ప్రచారం సాగుతున్న సంగతి  తెలిసిందే. అయితే తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో మర్రి శశిధర్ రెడ్డి భేటీ కావడం ఆ ప్రచారానికి బలం చేకూర్చింది.  

కాంగ్రెస్ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి పార్టీ మారుతున్నట్టుగా కొద్దిరోజులుగా ప్రచారం సాగుతున్న సంగతి  తెలిసిందే. పలువురు బీజేపీ నేతలు మర్రి శశిధర్ రెడ్డితో సంప్రదింపులు జరిపారని.. ఈ క్రమంలోనే ఆయన కాషాయ పార్టీలో చేరేందుకు ఢిల్లీ వెళ్లారని ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారాన్ని మర్రి శశిధర్ రెడ్డి ఖండించారు. అయితే మర్రి శశిధర్ రెడ్డి చేసిన ప్రకటనలో వాస్తవం లేదని తెలుస్తోంది. శశిధర్ రెడ్డి త్వరలో కాషాయ పార్టీలో చేరాలనే యోచనలో ఉన్నట్టుగా పరిణామాలు కనిపిస్తున్నాయి. 

మర్రి శశిధర్ రెడ్డి శుక్రవారం కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయినట్టుగా తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణతో కలిసి మర్రి శశిధర్ రెడ్డి ఢిల్లిలో అమిత్ షాను కలిసినట్టుగా సమాచారం. దాదాపు 40 నిమిషాల పాటు సమావేశం జరగగా.. తెలంగాణలో రాజకీయ పరిణామాల గురించి మర్రి శశిధర్ రెడ్డితో అమిత్ షా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. మర్రి శశిధర్‌ రెడ్డి బీజేపీలో చేరడానికి ఆసక్తి చూపడాన్ని అమిత్ షా స్వాగతించినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఈ పరిణామాలను గమనిస్తే.. మర్రి శశిధర్ రెడ్డి బీజేపీలో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.  తన మద్దతుదారులను సంప్రదించిన తర్వాత మర్రి శశిధర్ రెడ్డి.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. 

మర్రి శశిధర్ రెడ్డి గతంలో నాలుగుసార్లు సనత్ నగర్ నియోజవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్‌డీఎంఏ) మాజీ వైస్‌ చైర్మన్‌‌గా కూడ పనిచేశారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి బరిలో నిలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతిలో ఓడిపోయారు. 2018 ఎన్నికల్లో టీడీపీ-కాంగ్రెస్‌తో పొత్తులో భాగంగా సనత్ నగర్ నుంచి మర్రి శశిధర్ రెడ్డికి టికెట్ దక్కలేదు. గత రెండేళ్లుగా మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్‌లో పెద్దగా యాక్టివ్‌గా లేరు. కాంగ్రెస్ అధిష్టానం తీరుపై మర్రి శశిధర్ రెడ్డి కొంతకాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రేవంత్ రెడ్డిని టీపీసీసీ చీఫ్‌గా చేసినప్పటీ నుంచి ఆయన పలు సందర్భాల్లో తన అసంతృప్తిని బహిర్గంగానే వ్యక్తపరిచారు. రేవంత్ రెడ్డి రాష్ట్రంలో పార్టీకి నష్టం చేకూర్చేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి సీనియర్‌ నేతల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తున్నారని శశిధర్‌రెడ్డి మండిపడ్డారు.

దీంతో అప్పటి నుంచే మర్రి శశిధర్ రెడ్డి కాంగ్రెస్‌ను వీడతారనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే మర్రి శశిధర్ రెడ్డితో బీజేపీ నేతలు సంప్రదింపులు జరిపారు. ఇటీవల ఆయన బీజేపీ నేతలతో కలిసి ఢిల్లీ వెళ్లడంతో ఆయన బీజేపీలో చేరునున్నారనే ప్రచారం విస్తృతంగా సాగింది. ఈ చర్చల్లో డీకే అరుణ కీలక భూమిక పోషించినట్టుగా తెలుస్తోంది.


 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Revanth Reddy: తల్లితండ్రులకు జీవనాధారం లేకుండా చేస్తే జీతంలో 15శాతం కట్ చేస్తా| Asianet News Telugu
KTR Meets Newly Elected BRS Sarpanches in MBNR | KTR Comments on Revanth Reddy | Asianet News Telugu