తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధించాలని షర్మిల డిమాండ్.. ఆస్పత్రిలో యూత్ కాంగ్రెస్ నాయకుడికి పరామర్శ..

By Sumanth Kanukula  |  First Published Feb 22, 2023, 5:39 PM IST

తెలంగాణలోని అధికార బీఆర్ఎస్‌‌పై వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ బతికే ఉందా? అని ప్రశ్నించారు. 


తెలంగాణలోని అధికార బీఆర్ఎస్‌‌పై వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుపడ్డారు. తెలంగాణలో లా అండ్ ఆర్డర్ బతికే ఉందా? అని ప్రశ్నించారు. ఇటీవల హన్మకొండలో దాడికి గురై సికింద్రాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్‌ను వైఎస్ షర్మిల బుధవారం పరామర్శించారు. అతని ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. పవన్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. అనంతరం వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. పవన్‌పై బీఆర్ఎస్ గూండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. ఈ ఘటనపై పార్టీలకు అతీతంగా చలించి.. పవన్‌ను పరామర్శించడం జరిగిందని అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని నీతులు చెప్పే కేసీఆర్.. ముందుగా బీఆర్ఎస్ శ్రేణులకు ప్రజాస్వామ్య పాఠాలు నేర్పాలని అన్నారు. 

యూత్ కాంగ్రెస్ నాయకుడు తోట పవన్‌పై విచక్షణారహితంగా దాడి చేయడం క్రూరమైన చర్య అని మండిపడ్డారు. హృదయాల్లో మానవత్వం లేని బీఆర్‌ఎస్ గూండాలు అడవి జంతువుల కంటే హీనంగా రాష్ట్రంపై పెత్తనం చెలాయిస్తున్నారని అన్నారు. పవన్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్‌ దాడి చేయించారని ఆరోపించారు.  ప్రతిపక్షంలో ఉండి అన్యాయాలను ప్రశ్నించడమే పవన్ చేసిన తప్పా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ లీడర్లు మనుషులా? మృగాలా? అని ప్రశ్నించారు. పవన్ కోలుకోడానికి ఆరు నెలలు పడుతుందని డాక్టర్లు అంటున్నారని.. ఆ తల్లి శాపం కేసీఆర్‌కు తగులుతుందని అన్నారు. 

Latest Videos

Also Read: హిజ్రాలకు క్షమాపణ చెప్పిన వైఎస్ షర్మిల.. వారిని కించపరిచే ఉద్దేశం లేదని వివరణ..

ఇచ్చిన హామీలు నెరవేర్చే దమ్ము లేక, పరిపాలన చేతకాక, ప్రతిపక్షాల ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేక.. బీఆర్ఎస్ నాయకులు రౌడీల్లా దాడులకు ఎగబడుతున్నారని విమర్శించారు. పాదయాత్ర చేస్తున్న తమపైనా దాడులు చేస్తున్నారని.. అయినా ఓపికతో భరించామని చెప్పారు. పోలీసులు బీఆర్ఎస్ పార్టీలో చేరినట్లుగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని.. ఈ దారుణానికి పాల్పడిన వారిపై పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. 

రాష్ట్రంలో  లా అండ్ ఆర్డర్ గాడి తప్పిందని.. వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని వైఎస్ షర్మిల డిమాండ్ చేశారు. ఇదే విషయంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ గవర్నర్‌ను కూడా కలవబోతుందని చెప్పారు. 

click me!