
హైదరాబాద్ : తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పేపర్ లీక్ వ్యవహారంపై స్పందిస్తూ వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాల్ విసిరారు. ఇప్పటికే టీఎస్ పిఎస్సి నిర్వహించే పోటీ పరీక్షలపై సమ్మకం కోల్పోయిన నిరుద్యోగ యువతకు భరోసా ఇస్తూ అఫిడవిట్ పై సంతకం చేయాలని సీఎంను కోరారు షర్మిల. ఇక తెలంగాణాలో ఎప్పటికీ పేపర్ లీకులు ఉండవు... ఇది కేసీఆర్ మాట అని ఒక సంతకంతో చెప్పేయండి అని కేసీఆర్ ను షర్మిల సూచించారు.
''కేసీఆర్ గారు... పదవులైనా, బతుకైనా అన్నీ తెలంగాణ కోసమే అనే మహా బిల్డప్ ఇస్తారు కదా, మరి బంగారు తెలంగాణలో బుడగల్లా పేలిపోతున్న యువత భవిత కోసం ఈ అఫిడవిట్ మీద మీ బంగారు సంతకం పెట్టండి. టీఎస్ పిఎస్సి పరీక్షలు ఈసారి ఖచ్చితంగా పటిష్టంగా, సమర్థవంతంగా, ఎటువంటి లీకులు లేకుండా పారదర్శకంగా నిర్వహిస్తామని, ఇకపై ప్రశ్నాపత్రాల లీకులు ఉండవని ఇప్పుడైనా నిరాశ నిండిన విద్యార్థులకు భరోసా ఇస్తారా లేదా? పిల్లలకోసం ఆలోచిస్తున్నవారైతే, వారి బతుకులతో ఇక మీ సర్కారు ఎటువంటి ఆటలు ఆడదనే ధైర్యం కలిగిద్దామనుకుంటున్నారంటే, వెంటనే సంతకం పెట్టండి'' అని షర్మిల డిమాండ్ చేసారు.
''80 వేల పుస్తకాలు చదివి ఏకంగా రాజ్యాంగాన్నే తిరగరాద్దామన్న మీకు ఒక సీఎం సంతకంపెట్టిన అఫిడవిట్ పవర్ ఏమిటో, అది ఇచ్చే ధైర్యం ఏమిటో కొత్తగా చెప్పక్కర్లేదు అనుకుంటా. కాబట్టి వెంటనే అఫిడవిట్ పై సంతకం పెట్టి నిరుద్యోగులు నిశ్చింతగా ప్రిపేర్ అయ్యేలా చూడండి'' అని షర్మిల కోరారు.
Read More పేపర్ల లీక్ లో కేటీఆర్ హస్తం... తీగలాగితే ప్రగతిభవన్ డొంక కదలడం ఖాయం : షర్మిల సంచలనం
''అయ్యా కేసీఆర్ సారు... ఇప్పటికైనా టీఎస్ పిఎస్సి పేపర్ లీకులపై నోరు విప్పండి. నిరుద్యోగుల గోసను గుర్తించండి. మీరు ముఖ్యమంత్రి అనే విషయాన్ని యాది తెచ్చుకోండి. బంధి పోట్ల రాష్ట్ర సమితి విస్తరణకు దేశ రాజకీయాలు ఆపి, తెలంగాణ బిడ్డలకు భరోసా ఇవ్వండి. ఈ అఫిడవిట్ పై సంతకం పెట్టి నిరుద్యోగులకు న్యాయం చేయండి'' అని కోరారు.
''టీఎస్ పిఎస్సి పేపర్ లీకులు ఐటీ శాఖ నిర్లక్ష్యమే. దీనికి కేటీఆర్ బాధ్యత వహించాలి. ఈ కుంభకోణంపై నేటికీ కేసీఆర్ స్పందించకపోవడం దుర్మార్గం. నిరుద్యోగుల బతుకులు ఆగమవుతున్నా.. మళ్లీ పేపర్లు లీక్ కావన్నా గ్యారెంటీ కూడా ఇవ్వడం లేదు. పాత బోర్డుతోనే పరీక్షలు నడిపి,నిరుద్యోగులను మోసం చేయాలని చూస్తున్నారు. నిరుద్యోగులకు భరోసా కలిగేలా, ఉద్యోగాలు భర్తీ అయ్యేలావైఎస్సార్ తెలంగాణ పార్టీ తయారు చేసిన అఫిడవిట్ పై కేసీఆర్ సంతకం పెట్టాలి. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతి ఇవ్వనందుకు క్షమాపణ చెప్పాలి'' అని షర్మిల కోరారు.