
బీఆర్ఎస్ నేతలపై రాష్ట్ర మహిళ కమిషన్‌కు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఫిర్యాదు చేశారు. మహబూబాబాద్‌లో తన పాదయాత్రను బీఆర్ఎస్ నేతలు అడుకున్నారని షర్మిల చెప్పారు. బీఆర్ఎస్ నేతలు తనపై అసభ్యంగా మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్, మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, సత్యవతి రాథోడ్ పేర్లను కూడా ఫిర్యాదులో చేర్చారు. అనంతరం వైఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. మహిళలకు రక్షణ కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.
షీ టీమ్స్ ఉన్న మహిళలకు రక్షణ లేకుండా పోయిందని షర్మిల ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల రక్షణ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. మహిళలపై హత్యాచారాలు, కిడ్నాప్‌లు జరుగుతున్నాయని విమర్శించారు. శంకర్‌నాయక్ భార్య భూకబ్జా కేసులో ఏ1గా ఉన్నారని షర్మిల అన్నారు. అధికారపక్ష మహిళలకు ఒక న్యాయం.. వారు ఏ అక్రమాలు అయినా చేయొచ్చా? అని ప్రశ్నించారు.
కేసీఆర్ బిడ్డ కవిత లిక్కర్ స్కామ్‌లో ఉన్నారని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్న మహిళలు మాత్రం ఇంట్లో నుంచి బయటకు అడుగుపెట్టొద్దా? అని షర్మిల ప్రశ్నించారు. రాష్ట్రంలో మహిళలపై దాడులు జరుగుతున్నప్పటికీ మహిళా కమిషన్ ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వైఎస్ షర్మిల ప్రశ్నించారు. గవర్నర్ పై కూడా నీచంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.