జలజగడంపై కేసీఆర్ మీద షర్మిల వ్యాఖ్యలు: వైఎస్ జగన్‌కు షాక్

By Siva KodatiFirst Published Jul 8, 2021, 7:42 PM IST
Highlights

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న నదీ జలాల వివాదంపై వైఎస్ షర్మిల స్పందించారు. ఇద్దరు ముఖ్యమంత్రులు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే వివాదం పరిష్కారమవుతుందన్నారు. 
 

న్యాయబద్ధంగా తెలంగాణకు దక్కాల్సిన నీటిని ఒక్క చుక్క కూడా వదులుకోమన్నారు వైఎస్ షర్మిల. వైఎస్సార్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ సభలో ఆమె మాట్లాడుతూ.. కృష్ణానదీ మీద రెండు సంవత్సరాల నుంచి ప్రాజెక్ట్‌లు కడుతూ వుంటే కేసీఆర్ ఇప్పుడే మేల్కొన్నారా అని షర్మిల మండిపడ్డారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇంటికి ఆహ్వానించి కౌగిలించుకుని భోజనాలు పెట్టారని గుర్తుచేశారు. ఇద్దరూ కలిసి ఉమ్మడి శత్రువుని ఓడించవచ్చన్నారు. రెండు నిమిషాలు కూర్చొని నీటి పంచాయతీపై మాట్లాడుకోలేరా అని షర్మిల ప్రశ్నించారు.

కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీతో ఇద్దరు ముఖ్యమంత్రులు రెండు నెలలకోసారి మీటింగ్‌లు పెడుతూనే వుంటారని ఆమె అన్నారు. కేఆర్ఎంబీ, గోదావరి వాటర్ బోర్డు సమావేశాలు కూడా జరుగుతూనే వుంటాయని అలాంటప్పుడు సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత కేంద్రానికి లేదా అని షర్మిల నిలదీశారు. సమస్యను పరిష్కరించే ప్రయత్నం కూడా చేయకుంటే చిత్తశుద్ధిని ప్రశ్నించాల్సిన అవసరం వుందన్నారు. అన్ని పార్టీలు ఒకే తాను ముక్కలు కాదా అని షర్మిల అన్నారు.

Also Read:వైఎస్‌ను తిడుతుంటే.. దద్దమ్మల్లా గాజులు తొడుక్కుని కూర్చొన్నారా: టీ. కాంగ్రెస్ నేతలపై షర్మిల ఫైర్

రాష్ట్రాలుగా విడిపోయామే తప్ప అన్నాదమ్ములుగా కలిసే వుండాలన్నది విభజన ఉద్దేశ్యమన్నారు. గోదావరి నదిపై వున్న ప్రాణహిత నుంచి పోలవరం వరకు, కృష్ణానదిపై జూరాల నుంచి పులిచింతల వరకు ఏ ప్రాజెక్ట్ విషయంలోనైనా న్యాయబద్ధంగా తెలంగాణకు దక్కాల్సిన ఒక్క చుక్క నీటి బొట్టును కూడా తాము వదులుకోమన్నారు. అలాగే ఇతర ప్రాంతాలకు చెందాల్సిన ఒక్క చుక్క నీటి బొట్టు కూడా తాము అడ్డుకోమని.. అందరికీ సమన్యాయం జరగాలన్నదే వైఎస్సార్ తెలంగాణ పార్టీ సిద్ధాంతమని షర్మిల స్పష్టం చేశారు. 
 

click me!