
కోరుట్ల : తనకు ఇంట్లో వాళ్ళు కారు కొనివ్వడం లేదని సీపల్లి భాను ప్రకాష్ గౌడ్ (22) అనే యువకుడు యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం కల్లూరులో శనివారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఎస్సై సతీష్ కథనం ప్రకారం కల్లూరు గ్రామానికి చెందిన సీపెల్లి అంజయ్యకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. చిన్న కుమారుడు భాను ప్రకాష్ గౌడ్ కొంత కాలంగా కారు కొనివ్వాలని కుటుంబ సభ్యులను కోరుతూ వస్తున్నాడు.
15 రోజులుగా మరింత పట్టుబట్టి ఇంట్లో వారిని అడిగితే, ఎవరూ పట్టించుకోవడం లేదనే కారణంతో శనివారం రాత్రి 9 గంటల సమయంలో గ్రామ శివారులో యాసిడ్ తాగాడు. ఆ తర్వాత మంటను తాళలేక కేకలు వేస్తూ రోడ్డు పైకి వచ్చాడు. ఇది గమనించిన స్థానికులు భానుప్రకాష్ ఇంటికి తీసుకువెళ్లారు. వెంటనే కుటుంబ సభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భాను ప్రకాశ్ మృతి చెందాడు. ఇదివరకు కూడా సెల్ ఫోన్ కొనివ్వలేదని భానుప్రకాశ్ చేయి కోసుకున్నట్లు సమాచారం. మృతుడి తండ్రి అంజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వివరించారు.
ఇదిలా ఉండగా, అభిమాన నటుడి సినిమా బాగాలేదన్న మనస్థాపంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మార్చి 13న కర్నూలులో చోటు చేసుకుంది. తాను ఎంతగానో అభిమానించే హీరో సినిమా చాలాకాలం తర్వాత విడుదలయ్యింది. కానీ, ఆ సినిమా తన అంచనాలకు తగ్గట్లుగా అనుకున్న స్థాయిలో లేకపోవడంతో తీవ్ర నిరాశకు గురయిన ఓ అభిమాని బలవన్మరణానికి పాల్పడ్డాడు.
కర్నూల్ పట్టణంలోని తిలక్ నగర్ లో నివాసముండే యువకుడు రవితేజ(24) కుటుంబసభ్యులు ఎవరూలేని సమయంలో ఇంట్లో ఉరేసుకున్నాడు. కుటుంబసభ్యులు ఇంటికి వచ్చేసరికే అతడు ప్రాణాలు కోల్పోయాడు. చేతికందివచ్చిన కొడుకు మృతితో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని యువకుడి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. అనంతరం ఆత్మహత్యపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే యువకుడి ఆత్మహత్యకు ఇటీవల విడుదలైన ఓ సినిమాయే కారణమని తెలుస్తోంది. తన అభిమాన నటుడి సినిమా బాగాలేదని రవితేజ తీవ్ర మనస్థాపానికి గురయ్యాడని... అందువల్లే అతడు ఆత్మహత్య చేసుకుని వుంటాడని అనుమానిస్తున్నారు.
ఇదిలావుంటే కన్నడ హీరో యష్ అభిమాని ఆత్మహత్య కర్ణాకటకలో కలకలం రేపింది. 25ఏళ్ల యువకుడు మరణం కుటుంబంతో పాటు యష్ ని విషాదంలో నింపింది. తాను జీవితంకి విఫలం చెందానని, కుటుంబ సభ్యుల ప్రేమను పొందలేక పోయానని ఆవేదనతో రామకృష్ణ అనే ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు.
కర్ణాటకలోని మాండ్యం జిల్లాలోని కోడిదొడ్డిలో ఈ సంఘటన చోటు చేసుకుంది. రామకృష్ణ సూసైడ్ నోట్ లో తాను హీరో యష్ కి వీరాభిమానిని అని పేర్కొన్నాడు. అలాగే మాజీ సీఎం కాంగ్రెస్ నేత సిద్దా రామయ్యకు కూడా తాను అభిమానిని అతడు వెల్లడించాడు. ఇలా తాను అభిమానించే యష్, సిద్దారామయ్య తన అంత్యక్రియలకు హాజరుకావాలని లేఖలో రామకృష్ణ పేర్కొన్నాడు. ఈ సంఘటన గురించి తెలుసుకున్న హీరో యష్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.