
యాదాద్రి ఆలయ పునఃప్రారంభానికి సీఎం కార్యాలయం ప్రొటోకాల్ పాటించలేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkat Reddy) అన్నారు. స్థానిక ఎంపీగా ఉన్న తనకు ఆలయ పునః ప్రారంభానికి ఆహ్వానం అందలేదని తెలిపారు. కేవలం అధికార పార్టీ ఎమ్మెల్యేలు,ఎంపీలను మాత్రమే ఆహ్వానించిందన్నారు. దేవుడు దగ్గర కేసిఆర్ బహునీచపు రాజకీయాలు చేయడం బాధాకరమని పేర్కొన్నారు. ఈ మేరకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ట్విట్టర్‌లో ఓ పోస్టు చేశారు.
ఇదిలా ఉంటే.. యాదాద్రిలో నేత్రపర్వంగా మహాకుంభ సంప్రోక్షణ సాగుతుంది. దివ్య విమానంపై సుదర్శన చక్రానికి కేసీఆర్ సమక్షంలో సంప్రోక్షణ జరుగుతుంది. యాగజలాలతో సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. మహాకుంభ సంప్రోక్షణ ముగిసిన వెంటనే స్వయంభువులు భక్తకోటికి దర్శనం ఇవ్వనున్నారు. ప్రధాన ఆలయంలో సీఎం కేసీఆర్ దంపతులు తొలి పూజలు నిర్వహించనున్నారు. కుటుంబసమేతంగా కేసీఆర్ స్వామివారిని దర్శించుకోనున్నారు. యాదాద్రి క్షేత్రాభివృద్ధికి కృషి చేసిన వారిని సీఎం కేసీఆర్ సన్మానించనున్నారు.
అంతకు ముందు బాలాలయం నుంచి బంగారు కవచ మూర్తులు, ఉత్సవ మూర్తుల శోభాయాత్ర కన్నుల పండుగగా సాగింది. వేద మంత్రోచ్ఛారణలు, మేళతాళాల మధ్య శోభాయాత్ర సాగింది. ప్రధానాలయం చుట్టూ శోభాయాత్రగా ఉత్సవమూర్తుల ప్రదక్షిణలు జరిగాయి. శోభాయాత్రలో సీఎం కేసీఆర్, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, అర్చకులు, వేదపండితులు పాల్గొన్నారు. తూర్పు రాజగోపురం ద్వారా ప్రధానాలయంలోకి స్వామివారి శోభాయాత్ర ప్రవేశించింది.