
తెలంగాణ ఆర్టీసీ మరోసారి చార్జీలను పెంచింది. మొదట పల్లె వెలుగు బస్సుల్లో రౌండ్ ఫిగర్ అని, ఆ తర్వాత సేఫ్టీ సెస్ అని చార్జీలు పెంచారు. తాజాగా ప్యాసింజర్ సెస్ పేరుతో తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులపై భారాన్ని మోపింది. ఎక్స్‌ప్రెస్, డీలక్స్, సూపర్‌లగ్జరీ, రాజధాని, గరుడ, గరుడ ప్లస్ బస్సుల్లో ప్రతి ప్రయాణికుడి నుంచి సాధారణ చార్జీలతో పాటు అదనంగా ప్యాసింజర్ సెస్ రూ.5-10 వరకు వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఎక్స్‌ప్రెస్, డీలక్స్ బస్సుల్లో రూ. 5 చొప్పున.. సూపర్ లగ్జరీ, రాజధాని, గరుడ బస్సుల్లో రూ. 10 వరకు టికెట్ రేట్లు పెంచారు.
పెంచిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని తెలంగాణ ఆర్టీసీ వెల్లడించింది. ఆర్టీసీ చార్జీలు పెంచడంపై ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక, ఇటీవల బస్సు పాస్ ధరలను పెంచుతూ ఆర్టీసీ నిర్ణయం తీసుకన్న సంగతి తెలిసిందే. ఆర్డినరీ పాస్ ఛార్జీ రూ.950 నుంచి రూ.1150కి, మెట్రో ఎక్స్‌ప్రెస్ రూ.1,070 నుంచి రూ.1,300కు, మెట్రో డీలక్స్ రూ.1,185 నుంచి రూ.1,450కి, మెట్రో లగ్జరీ రూ.2 వేల నుంచి రూ.2,400కు, పుష్పక్ పాస్ రూ.2,500 నుంచి రూ.3 వేలకు పెరిగింది.
ఎన్‌జీఓ బస్‌పాస్‌లకు సంబంధించి.. ఆర్డినరీ పాస్ ఛార్జీ రూ.320 నుంచి రూ.400కు, మెట్రో ఎక్స్‌ప్రెస్ రూ.450 నుంచి రూ.550కి, మెట్రో డీలక్స్ రూ.575 నుంచి రూ.700కు పెంచింది. పెరిగిన ధరలు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. అయితే స్టూడెంట్ పాసుల ఛార్జీలకు మాత్రం మినహాయింపును ఇచ్చింది. విద్యా సంవత్సరం ముగుస్తున్న నేపథ్యంలో విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలను పెంచలేదా? లేక వచ్చే విద్యా సంవత్సరంలో పెంచుతుందా? అనే విషయం తెలియాల్సి ఉంది.