
నిత్యం ప్రేమ పేరుతో వెంటపడుతున్న ఓ ఆకతాయి వేధింపులు తట్టుకోలేక ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ విషాద సంఘటన హైదరాబాద్ శివారులో చోటుచేసుకుంది.
పోలీసులు మృతురాలి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం పోల్కంపల్లి గ్రామానికి చెందిన రుక్మిణి భీ ఫార్మసీ చదువుతోంది. సమీపంలోని కళాశాలకు వెళ్లే సమయంలో అదే గ్రామానికి చెందిన పవన్ ఆమె వెంటపడుతూ వేధించేవాడు. ప్రేమ పేరుతో ఆమెను వేధిస్తూ నిత్యం నరకం చూపించేవాడు. తనకు ఇష్టం లేదన్నా వినకుండా వెంటపడేవాడు.
ఈ మధ్య కాలంలో అతడి వేధింపులు మరీ ఎక్కువయ్యాయి. అయితే ఈ విషయాన్ని ఇంట్లో చెబితే తననే చదువు మానేయిస్తారని భయపడిన యువతి ఆ పని చేయలేదు. అలాగని ఆ ఆకతాయి వేధింపులనూ ఇక భరించలేకపోయింది. దీంతో రుక్మిణి దారుణమైన నిర్ణయం తీసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్యాన్ కు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
ఈ ఆత్మహత్యపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.