
జోగిపేట: పెళ్ళి చేసుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించాలనుకున్నాడు. తల్లిదండ్రులు చూసిన అమ్మాయిని పెళ్లి చేసుకోడానికి సిద్దమయి నిశ్చితార్థానికి కూడా ఏర్పాట్లు చేసుకున్నాడు. ఇంతలో ఏమయ్యిందో తెలీదుగానీ సరిగ్గా నిశ్చితార్థం రోజే విద్యుత్ స్తంబానికి ఉరేసుకుని అనుమానాస్పద రీతిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ దారుణ ఘటన సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజకవర్గ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసులు, బాధిత కుటుంబసభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మెదక్ జిల్లా టేక్మాల్ కు చెందిన గుంజి బాలరాజు(25) సోదరుడు శంకర్ తో కలిసి సమీపంలోని సోలార్ ప్లాంట్ లో పనిచేసేవాడు. బాలరాజు డ్రైవర్ గా విధులు నిర్వహించేవాడు. అయితే బాలరాజుకు పెళ్లిచేయాలని నిర్ణయించిన తల్లిదండ్రులు ఓ అమ్మాయిని ఖాయం చేసారు. నిన్న(సోమవారం) వీరి నిశ్చితార్థానికి ముహూర్తం ఖరారుచేసి ఏర్పాట్లన్ని పూర్తిచేసారు.
ఆదివారం అర్ధరాత్రి వరకు విధుల్లోనే వున్న బాలరాజు సోమవారం ఇంటికి చేరుకోలేదు. దీంతో కంగారుపడిపోయిన కుటుంబసభ్యులు సోలార్ ప్లాంట్ వద్దకు వెళ్లగా అతడు కనిపించలేదు. దీంతో చుట్టపక్కల ప్రాంతాల్లో వెతకడం ప్రారంభించారు. ఇదే సమయంలో వారికి పిడుగులాంటి సమాచారం అందింది. సంగారెడ్డి జిల్లా అందోల్ మండల పరిధిలోని దానంపల్లిలో విద్యుత్ స్తంభానికి ఉరివేయబడిన స్థితిలో బాలరాజు మృతదేహం లభించింది.
మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికుల సాయంతో బాలరాజు మృతదేహాన్న కిందకు దించారు. మృతుడు బాలరాజు సోదరుడు శంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
బాలరాజు కుటుంబసభ్యులు అతడు పనిచేసే సోలార్ ప్లాంట్ లో ఓ అధికారిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వారం రోజుల క్రితమే బాలరాజుకు సదరు అధికారితో గొడవ జరిగిందని... ఇది మనసులో పెట్టుకుని కక్షగట్టిన అతడు హత్యచేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసాడని ఆరోపిస్తున్నారు. ముందు హత్య చేసిన తర్వాతే మృతదేహాన్ని కరెంట్ పోల్ కు ఉరేసినట్లు అనుమానిస్తున్నారు. ఇది ముమ్మాటికీ హత్యేనని... ఆత్మహత్య కాదని బాలరాజు కుటుంబసభ్యులు అంటున్నారు. అయినా అంతెత్తు విద్యుత్ స్తంభాన్ని ఎక్కి ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటారా అని అడుగుతున్నారు.
ఇలా నిశ్చితార్థం రోజే బాలరాజు మృతిచెందడంలో బంధువుల సందడితో కోలాహలంగా వుండాల్సిన ఇంట చావుబాజా మోగింది. అందంగా ముస్తాబై వేదిక ఎక్కాల్సిన వాడు పాడె ఎక్కి స్మశానానికి వెళ్లాల్సి వస్తోందంటూ అతడి తల్లిదండ్రుల ఏడుస్తుంటూ ఓదార్చడం ఎవరితరం కావడంలేదు. బాలరాజును హతమార్చిన నిందితులను వెంటనే పట్టుకుని శిక్షించాలని బాలరాజు కుటుంబసభ్యులు పోలీసులను కోరుతున్నారు.