50వేల ఉద్యోగాలు... 4.5లక్షల యువతకు ఆత్మహత్యే పరిష్కారమా?: మంత్రి నిరంజన్ రెడ్డి (వీడియో)

By Arun Kumar PFirst Published Jul 12, 2021, 1:40 PM IST
Highlights

ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న యువకుడు మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్న ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకుంది. కొడుకు మృతితో బాధలో వున్న తల్లిదండ్రులను రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరామర్శించారు. 

వనపర్తి: ప్రభుత్వోద్యోగం కోసం ఏళ్ళుగా ప్రిపేర్ అవుతున్నా ఎంతకూ నోటిఫికేషన్ రాకపోవడంతో వనపర్తి జిల్లాకు చెందిన యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. గోపాల్ పేట మండలం తాడిపర్తిలో నిరుద్యోగి కొండల్ ఉద్యోగం రాలేదని బాధపడుతూ గురువారం సూసైడ్ నోట్ రాసి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొడుకు మృతితో బాధలో వున్న తల్లిదండ్రులను రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరామర్శించారు. 

తాడిపర్తి గ్రామానికి చేరుకున్న మంత్రి నిరుద్యోగి కొండల్ తల్లిదండ్రులు వెంకటమ్మ, రాములును పరామర్శించారు. స్వయంగా రూ.లక్ష సాయం అందజేసిన మంత్రి డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇస్తామని వారికి మంత్రి హామీ ఇచ్చారు. 

ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ... నిరుద్యోగి కొండల్ ఆత్మహత్య బాధాకరమన్నారు.  చేతికొచ్చిన పిల్లలు ఇలా ఆత్మహత్య చేసుకుని తల్లిదండ్రులకు కడుపుశోకం పెట్టొద్దని అన్నారు. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో జీవించాలని సూచించారు. 

వీడియో

''చదువు విజ్ఞానం కోసమే. ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ ఉద్యోగం ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు.  తెలంగాణ ప్రభుత్వంలో ప్రజలకు ఉపాధి అవకాశాలు పెంచాం. ఆత్మహత్యలు సమస్యలకు పరిష్కారం కాదు. ఆత్మహత్యలను రాజకీయం చేయొద్దు '' అని పేర్కొన్నారు. 

''సాగునీటి రాకతో ప్రజలు సాగు పెరిగింది. పంటల దిగుబడులతో ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఒక్క వనపర్తి నియోజకవర్గంలోనే లక్ష ఎకరాలకు సాగునీరు తీసుకురావడం జరిగింది'' అని తెలిపారు. 

''ఏడేళ్లలో లక్షా 35 వేల ఉద్యోగాలు ఇచ్చాం... మరో 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ రాబోతుంది. 50 వేల ఉద్యోగాలకు 5 లక్షల మంది పోటీ పడినా 50వేల మందికే ఉద్యోగాలు వస్తాయి. అలాగని మిగిలిన 4.5 లక్షల మందికి ఆత్మహత్యలు చేసుకోవాలని ఆలోచిస్తే సమస్య పరిష్కారం అవుతుందా?'' అని మంత్రి నిరంజన్ రెడ్డి యువతను ప్రశ్నించారు. 

 గురుకుల ఉపాధ్యాయ ఉద్యోగం కోసం ప్రిపేర్ అవుతున్న కొండల్ నోటిఫికేషన్ కోసం ఎదురుచూశాడు. అయితే ఎంతకూ ఉద్యోగ ప్రకటన రాకపోవడంతో విసుగుచెందిన అతడు సూసైడ్ లెటర్ రాసిపెట్టి ఇంట్లోనే   ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.   

 

click me!