
హైదరాబాద్: వివాహిత వెంటపడుతూ వేధిస్తున్న స్నేహితున్ని మందలించి ఓ యువకుడు ప్రాణాలమీదకు తెచ్చుకున్నాడు. పెళ్లయిన అమ్మాయితో ప్రేమ వద్దని చెప్పిన స్నేహితున్ని ఓ సైకో అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి చంపడానికి ప్రయత్నించాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే... హైదరాబాద్ పాతబస్తీ రియాసత్ నగర్ కు చెందిన అక్బర్ ఖాన్, మహ్మద్ ఈసా స్నేహితులు. అయితే అక్బర్ ఇటీవల ప్రేమ పేరిట పెళ్ళయిన యువతి వెంట పడుతున్నాడు. దీంతో సదరు యువతి తన భర్తకు విషయం తెలిపింది. దీంతో అక్బర్ ను మందలించి తన భార్య వెంటపడకుండా చూడాలని యువతి భర్త ఈసాను కోరాడు.
read more వివాహేతర సంబంధం : అడ్డుగా ఉన్నాడని.. కొడవలితో భర్త గొంతు కోసి హత్య చేసిన భార్య..
ఈ క్రమంలోనే వివాహిత వెంట పడవద్దని అక్బర్ ను ఈసా మందలించడానికి ప్రయత్నించాడు. అయితే స్నేహితుడి మంచిమాటలు రుచించని అక్బర్ కోపంతో ఊగిపోయాడు. తనను వద్దని చెప్పడానికి నువ్వెవరు అంటూ ఈసాపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు.
స్నేహితుడి దాడిలో తీవ్రంగా గాయపడిన ఈసాను చికిత్స నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగానే వుంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో వున్న నిందితుడు అక్బర్ కోసం గాలిస్తున్నారు.