అరెస్ట్ చేయమంటారా... కోటి రూపాయలు ఇస్తారా: మంత్రి గంగులకు సైబర్ నేరగాళ్ల బెదిరింపు

By Arun Kumar PFirst Published Aug 25, 2021, 9:39 AM IST
Highlights

సైబర్ నేరగాళ్లు మంత్రి గంగుల కమలాకర్ ను వదల్లేదు. ఈడీ పేరిట ఆయనకు నకిలీ నోటీసులు పంపించి భారీగా డబ్బులు లాగేందుకు ప్రయత్నించారు.

హైదరాబాద్: ఏకంగా మంత్రి గంగుల కమలాకర్ నే బెదిరించి డబ్బుల లాగడానికి ప్రయత్నించారు సైబర్ నేరగాళ్లు. ఫేక్ ఈడీ నోటీసులు పంపించిన కేటుగాళ్లు అరెస్ట్ చేస్తామని మంత్రిని బెదిరించారు. అరెస్ట్ చేయకుండా వుండాలంటూ కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే వారు పంపిన నోటీసు, ఫోన్ కాల్ సంభాషణపై అనుమానం వచ్చిన మంత్రి గంగుల ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) కార్యాలయాన్ని సంప్రదించగా తామేమీ నోటీసులు జారీ చేయలేదని తెలిపారు. దీంతో ఇది సైబర్ నేరగాళ్ల పనిగా తేలిపోయింది. 

ఇక మంత్రి గంగులకు తమ పేరుతో నకిలీ నోటీసులు వెళ్లడాన్ని ఈడీ సీరియస్ గా తీసుకుంది. వెంటనే ఈ వ్యవహారంపై సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలో దర్యాప్తు ప్రారంభించిన సైబర్ క్రైమ్ పోలీసులు మంత్రి నుండి వివరాలు సేకరించారు. మంత్రి గంగులను బెదిరించిన సైబర్ కేటుగాళ్ళ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

read more  కేసీఆర్‌పై అభ్యంతరకర వీడియోలు .. తీన్మార్ మల్లన్నపై టీఆర్ఎస్ ఫిర్యాదు

ఇదిలావుంటే ఇటీవల మంత్రి గంగులకు సంబంధించిన గ్రానైట్ కంపెనీలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. మంత్రికి చెందిన శ్వేత ఏజెన్సీతో పాటు మరో 8 ఏజెన్సీలకు ఈడీ నోటీసులు జారీ చేసింది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఫిర్యాదు మేరకు ఈడీ చర్యలు తీసుకుంది. 

తక్కువ పరిణామం చూపి ఎక్కువ మోతాదులో గ్రానైట్ ఎగుమతి చేసినట్లు ఈడీకి ఫిర్యాదులు అందాయి. దీంతో విదేశాలకు ఏ మేరకు ఎగుమతి చేశారో చెప్పాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. ఇక్కడి కంపెనీలు గనులశాఖ నుంచి అనుమతి పొందిన దానికంటే ఎక్కవ గ్రానైట్‌ను విదేశాలకు సరఫరా చేస్తున్నట్లు ఈడీ అనుమానిస్తోంది. 

విజిలెన్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఏపీలోని కాకినాడ, కృష్ణపట్నం, చెన్నై, విశాఖ పోర్టులకు వెళ్లి అధికారులు పరిశీలించారని తెలుస్తోంది. అయితే విదేశాలకు ఎగుమతి చేస్తున్న గ్రానైట్‌కు భారీ తేడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఈ ఏడాది మే 29న ఉన్నతాధికారులకు ఓ నివేదిన ఇచ్చారని ప్రచారం సాగుతోంది.  

click me!