కరీంనగర్ టిఆర్ఎస్ కు భారీ షాక్

First Published Feb 18, 2018, 5:33 PM IST
Highlights
  • లోకల్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ వేధిస్తున్నట్లు ఆరోపణలు
  • ఎమ్మెల్యే వేధింపులు ఆపకపోతే ఆయన ఇంటిముందే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరిక
  • కలకలం రేపిన మహిళా కార్పొరేటర్ రాజీనామా వ్యవహారం
  • గతంలో ఇదే తరహాలో 30వ డివిజన్ మహిలా కార్పొరేటర్ జయశ్రీ కి అవమానాలు

కరీంనగర్ లో అధికార టిఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. కీరంనగర్ కార్పొరేషన్ లో గత కొంతకాలంగా అధికార పార్టీలో కుమ్ములాటలు కొనసాగుతున్నాయి. గతంలో స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కు ఒక కార్పొరేటర్ కు మధ్య పెద్ద వార్ నడిచింది. ఎమ్మెల్యే తీరు కారణంగా 30వ వార్డు మహిళా కార్పొరేటర్ చొప్పరి జయశ్రీ కంటతడి పెట్టుకుంది. తనపై ఎమ్మెల్యే పగపట్టారని, తన డివిజన్ లో అభివృద్ధి జరగకుండా అడ్డు తగులుతున్నాడని మండిపడ్డారు. ఆ ఘటన మరవకముందే మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అదే ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తీరు కారణంగా మరో కార్పొరేటర్ కూడా రాజీనామా బాటు పట్టారు. ఆ వివరాలు చదవండి.

కరీంనగర్ కార్పొరేషన్ లో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన 12వ డివిజన్ కార్పొరేటర్ మెండి శ్రీలత తన పదవికి రాజీనామా చేశారు. కార్పొరేటర్ పదవితో పాటు టీఆర్ఎస్ పార్టీకి కూడా రాజీనామా చేశారు. ఆమె భర్త చంద్రశేఖర్ కూడా పార్టీకి రాజీనామా చేశారు. ఈ సందర్బంగా ఆదివారం కరీంనగర్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీలత మాట్లాడుతూ సంచలన విషయాలు వెల్లడించారు. స్థానిక ఎమ్మెల్యే ... ఎమ్మెల్యే గంగుల కమలాకర్ తమను చిన్నచూపు చూడటం, అభివృద్దికి నిధులు కేటాయించకపోవడం వల్లే రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. అంతేగాక ఓ భూమి వివాదంలో తన భర్త చంద్రశేఖర్‌ను ఎమ్మెల్యే కమలాకర్ పోలీసు కేసుల్లో ఇరికించారని ఆమె ఆరోపించారు. ఎమ్మెల్యే వేధింపులు ఆపకపోతే ఆయన ఇంటిముందు ఆత్మహత్య చేసుకుంటానని శ్రీలత హెచ్చరించారు.

వరుసగా ఇద్దరు మహిళా కార్పొరేటర్లు మీడియా ముందుకొచ్చి బహిరంగంగానే స్థానిక ఎమ్మెల్యే గంగుల మీద ఆరోపణలు గుప్పించడంతో టిఆర్ఎస్ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఎమ్మెల్యే పదే పదే అధికార పార్టీ నేతలను టార్గెట్ చేయడం పట్ల పార్టీలో రకరకాల చర్చలు సాగుతున్నాయి. ఈ అంశం పార్టీ అధిష్టానం దృష్టికి వచ్చినట్లు తెలుస్తోంది. మరి ఈ వివాదాన్ని ఎలా పరిష్కరిస్తారన్నది తేలాల్సి ఉంది.

గతంలో జయశ్రీ.. ఇప్పుడు శ్రీలత..

గతంలోనూ కరీంనగర్ కార్పొరేషన్ లో శ్రీలత అనే 30వ డివిజన కార్పొరేటర్ రాజీనామా చేశారు. అప్పుడు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది ఆమెకు. ఆమె మీద పోటీ చేసి ఓడిపోయిన కార్పొరేటర్ ను గంగుల కమలాకర్ చేరదీసి తనను పట్టించుకోకుండా అవమానించారని ఆరోపించారు. తన డివిజన్ ను ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ దత్తత తీసుకుని 5 కోట్ల రూపాయలను మంజూరు చేసినా.. ఆ పనులు జరగకుండా ఎమ్మెల్యే అడ్డుకున్నారని ఆరోపించింది. అందుకే తాను రాజీనామా చేసినట్లు ప్రకటించింది. గెలిచిన నాటినుంచి ఇదే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేసింది. ఎట్టకేలకు ఆ వివాదాన్ని అధికార పార్టీ పెద్దలు జోక్యం చేసుకుని సద్దుమణిగేలా చేశారు. అయితే తాజాగా మరో వివాదం రేగడంతో అధికార పార్టీ ఇరకాటంలోకి నెట్టబడిందని చెబుతున్నారు.

click me!