నందమూరి సుహాసినికి చిక్కులు: ఓటమికి రంగంలోకి వైఎస్ జగన్

By pratap reddyFirst Published Nov 27, 2018, 8:19 AM IST
Highlights

కూకట్ పల్లిలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కు మద్దతు తెలియజేయాలని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ (వైసిపి) నిర్ణయించింది. కూకట్ పల్లిలో స్థిరపడిన రాయలసీమకు చెందినవారు సుహాసినికి వ్యతిరేకంగా పనిచేయడానికి సిద్ధపడ్డారు. 

హైదరాబాద్: కూకట్ పల్లిలో నియోజకవర్గంలో ప్రజా కూటమి అభ్యర్థి నందమూరి సుహాసిని ఓటమికి పనిచేయాల్సిందిగా వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ కార్యకర్తలకు సూచించినట్లు తెలుస్తోంది. కూకట్ పల్లిలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కు మద్దతు తెలియజేయాలని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ (వైసిపి) నిర్ణయించింది. 

కూకట్ పల్లిలో స్థిరపడిన రాయలసీమకు చెందినవారు సుహాసినికి వ్యతిరేకంగా పనిచేయడానికి సిద్ధపడ్డారు. ముఖ్యమంత్రి రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రాయలసీమ ఓటర్లు ఆమెకు వ్యతిరేకంగా పనిచేయనున్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు వెలమ సామాజిక వర్గానికి చెందినవారు కాగా, సుహాసిని కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు. 

ఈ నియోజకవర్గంలో వెలమ సామాజిక వర్గానికి చెందినవారు కేవలం 3 వేల మంది ఉండగా కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు 13వేల మంది ఉన్నారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారు 22 వేల మంది ఉన్నారు. కాపు సామాజిక వర్గానికి చెందినవారు అత్యధికంగా ఉన్నారు. వారు దాదాపు 64 వేల మంది ఉన్నారు. ముస్లిం ఓటర్లు 61 వేల మంది ఉన్నారు. 

తెలంగాణలో మహా కూటమిని ఓడించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ కరపత్రాన్ని విడుదల చేశారు. తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి రావడానికి సాయపడుతుందని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది. 

కూకట్ పల్లిలో మహా కూటమి అభ్యర్థిని ఓడదించాలని వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ నియోజకవర్గంలోని సీమాంధ్ర ప్రజలకు విజ్ఞప్తి చేసింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ చంద్రబాబును వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో కూకట్ పల్లిలో సుహాసిని విజయం అంత తేలిక కాదని భావిస్తున్నారు .అయితే, కాపు ఓటర్లు రెండుగా చీలినట్లు తెలుస్తోంది. ఓ వర్గం టీడీపిని బలపరుస్తుండగా, మరో వర్గం టీఆర్ఎస్ ను బలపరుస్తోంది. ముస్లిం ఓటర్ల ధోరణి కూడా ఇదే రకంగా ఉందని చెబుతున్నారు. 

సంబంధిత వార్తలు

కూకట్ పల్లి లో నందమూరి సుహాసిని ప్రచారం (ఫొటోస్)

ఘర్షణ: సుహాసిని ప్రచారాన్ని అడ్డుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు

click me!