రికార్డు స్థాయిలో ఒక్కరోజే కోటికి పైగా ఆదాయం.. యాదాద్రి ఆలయ చరిత్రలోనే మొదటిసారి..

By SumaBala BukkaFirst Published Nov 14, 2022, 7:56 AM IST
Highlights

తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధిచెందిన యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం శతాబ్దాల చరిత్రలో మొదటిసారిగా ఒక్కరోజులోనే కోటికి పైగా ఆదాయం వచ్చింది. 

యాదగిరిగుట్ట :  యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామికి ఒక్కరోజులోనే రికార్డు స్థాయి ఆదాయం వచ్చింది. పవిత్ర కార్తీక మాసం, ఆదివారం సెలవుదినం కావడంతో ఇవాళ ఒక్కరోజే రూ.1.09,82,000 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో గీత తెలిపారు. ఇప్పటివరకు యాదాద్రి చరిత్రలో రూ. కోటికి మించి ఆదాయం రాలేదు. యాదాద్రిని దివ్యక్షేత్రంగా అభివృద్ధి చేసిన తర్వాత భక్తుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ క్రమంలో ఆదివారం రూ. కోటికి పైగా రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది.

వివిధ సేవలు, కౌంటర్ విభాగాల ద్వారా  ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ప్రసాదాల విక్రయం ద్వారా రూ.37,36,000 వీఐపీ దర్శనం టిక్కెట్లకు రూ.22,62,000, వ్రతాల ద్వారా రూ. 13,44,000, కొండపైకి వాహనాల ప్రవేశం టికెట్ల ద్వారా రూ.10,50,000, బ్రేక్ దర్శనం టిక్కెట్ల ద్వారా రూ. 6,95,000 సహా వివిధ సేవల ద్వారా ఈ ఆదాయం సమకూరిందని వెల్లడించారు.

తెలంగాణలో కొత్తగా 1000 మత్స్య సహకార సంఘాలు: మంత్రి హరీశ్ రావు

కాగా, ఆదివారం తెల్లవారుజాము నుండే, యాదాద్రి క్షేత్రం వేలాది మంది భక్తులతో కిక్కిరిసిపోయింది. సుమారు 40,000 మందికిపైగా భక్తులు శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన అనేక రకాల 'ఆర్జిత సేవ'లలో పాల్గొన్నారు. నవంబర్ 9న యాదాద్రి ఆలయానికి 13 రోజుల హుండీ వసూళ్లలో రూ.1.20 కోట్లు వచ్చాయి. ఐదు రోజుల వ్యవధిలో, ఆదాయం నమ్మశక్యం కాని రీతిలో రూ.1.20 కోట్లకు చేరుకుంది.

ఇదిలా ఉండగా, యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి విమాన గోపురానికి బంగారు తాపడం చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సెప్టెంబర్ 30న ఒక కిలో  16 తులాల బంగారాన్ని విరాళంగా అందజేశారు. ఆ రోజు ఉదయం 11 గంటల 45 నిమిషాలకు ముఖ్యమంత్రి వాహనంలో యాదాద్రి కి చేరుకున్నారు.  ఆయన వాహనశ్రేణితో గిరిప్రదర్శన అనంతరం రాష్ట్రపతి సూట్లో కొద్దిసేపు గడిపారు. వివరాల్లోకి వెళితే.. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆయన కుటుంబసభ్యులు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. 

ఈ క్రమంలోనే శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి విమాన గోపురానికి బంగారు తాపడం చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఒక కిలో 16 తులాల బంగారాన్ని విరాళంగా అందజేశారు. ఆలయ కార్య నిర్వహణాధికారి ఎన్ గీతకు దీనికి సంబంధించిన చెక్కును అందజేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సతీమణి శోభ, మనుమడు హిమాన్షుతో కలిసి మధ్యాహ్నం 12 గంటలకు యాదాద్రి ఆలయం చేరుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రికి ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. 

click me!