
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు కొద్దిసేపటి క్రితం యాదాద్రికి చేరుకున్నారు. యాదాద్రిలో సీఎం కేసీఆర్ ఏరియల్ వ్యూ నిర్వహించారు. యాదాద్రి ప్రధానాలయం, పరిసరాల్లో చేసిన ఏర్పాట్లను సీఎం కేసీఆర్ పరిశీలించారు. కాసేపట్లో యాదాద్రి మహాకుంభ సంప్రోక్షణలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు. సీఎం కేసీఆర్ సమక్షంలో యాగ జలాలతో జరిగే సంప్రోక్షణలో మంత్రులతో పాటు పలువురు ప్రముఖులు కూడా పాల్గొననున్నారు. ఉదయం 11.55 గంటల శుభముహూర్తాన జరిగే మహాకుంభ సంప్రోక్షణ ముగిసిన వెంటనే స్వయంభువులు భక్తకోటికి దర్శనం ఇవ్వనున్నారు.
ప్రధాన ఆలయంలో సీఎం కేసీఆర్ దంపతులు తొలి పూజలు నిర్వహించనున్నారు. కుటుంబసమేతంగా కేసీఆర్ స్వామివారిని దర్శించుకోనున్నారు. యాదాద్రి క్షేత్రాభివృద్ధికి కృషి చేసిన వారిని సీఎం కేసీఆర్ సన్మానించనున్నారు. సీఎం కేసీఆర్ యాదాద్రి పర్యటన నేపథ్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాట్లను మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు.
వారం రోజులుగా బాలాఆలయంలో కొనసాగుతున్న పంచకుండాత్మక మహాయాగంలో మహా పూర్ణాహుతి నిర్వహించిన అనంతరం ప్రతిష్ఠ మూర్తులతో చేపట్టిన శోభాయాత్రతో ఉద్ఘాటన క్రతువు మొదలైంది. ఈ శోభాయాత్రలో సీఎం కేసీఆర్, మంత్రలు పాల్గొననున్నారు. తొలుత శోభాయాత్ర ప్రధానాలయ 2 మాడ వీధిలో ప్రదక్షిణ అనంతరం తొలి వీధిలోకి ప్రవేశించగానే మహాకుంభ సంప్రోక్షణ చేపడతారు.
విమాన గోపురంపై శ్రీ సుదర్శనాళ్వారులకు జరిపే సంప్రోక్షణతో ఆరు రాజ గోపురాలపై స్వర్ణ కళాశాలకు సంప్రోక్షణ నిర్వహిస్తారు. మిథున లగ్నంలో ఏకాదశినాడు ఉదయం 11.55 గంటలకు ఈ మహోత్సవం ఆవిష్కృతం కానుంది. అనంతరం 12.10 గంటలకు ప్రధాన ఆలయ ప్రవేశంతో పాటు గర్భాలయంలోని స్వర్ణ ధ్వజస్తంభ సందర్శన ఉంటుంది. దాదాపు 12.20 గంటలకు గర్భాలయంలోని మూలవరుల దర్శనం మొదలుకానుంది.
రెండు వేల మందితో భద్రత..
ఆలయ ఉద్ఘాటన, మహా క్రతువుకు ముఖ్యమంత్రి సహా పలువురు మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరు అవుతున్నందున దాదాపు 2000 మంది పోలీసులతో భద్రతను నిర్వహిస్తున్నారు. రాచకొండ సీపీ మహేష్ భగవత్, భువనగిరి డిసిపి నారాయణరెడ్డి ఆదివారం ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా రూట్మ్యాప్ రూపొందించారు. ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు. కొండ కింద నుంచి పైకి రవాణా సౌలభ్యం కోసం ఆర్టీసీ‘యాదాద్రి దర్శని’ బస్సులను సిద్ధం చేసింది.