నేడే యాదాద్రి ఆలయ ఉద్ఘాటన... ఆరేళ్ల తరువాత స్వయంభువుల దర్శనం..

Published : Mar 28, 2022, 08:15 AM IST
నేడే యాదాద్రి ఆలయ ఉద్ఘాటన... ఆరేళ్ల తరువాత స్వయంభువుల దర్శనం..

సారాంశం

ఆరేళ్లుగా ఎప్పుడెప్పుడా అని భక్తులు ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి నిజదర్శనం నేటినుంచి మొదలుకానుంది. యాదాద్రిగా మారి సర్వాలంకారశోభితంగా యాదగిరిగుట్ట దర్శనమివ్వనుంది. మహా సంప్రోక్షణకు సమయం దగ్గరపడింది. 

నల్గొండ : లక్ష్మీ నరసింహులు నివసించే నవ వైకుంఠ మది.  నిరంతర యజ్ఞయాగాదులలో పునీతమై.. వేదఘోష ప్రతిధ్వనించే పవిత్ర భూమి అది.  చారిత్రక ప్రాశస్త్యం.. ఆధునిక సోయగం కలగలిసిన యాదాద్రి ఆలయ ప్రాంగణం..  ఇకపై నవనవోన్మేషంగా,  శోభాయమానంగా దర్శనమివ్వనుంది. ఇక్కడి పంచ నారసింహ క్షేత్రం ఒకప్పటిలా గుహాలయం మాత్రమేకాదు.. ఇప్పుడది దేశంలోనే తొలిసారిగా పూర్తిగా కృష్ణశిలలతో నిర్మితమైన దివ్యధామం. రెండున్నర లక్షల టన్నుల కృష్ణశిలలతో.. ఇద్దరు స్థపతులు,  12 మంది ఉపస్థపతులు, ఎనిమిది వందల మంది శిల్పులు, పదిహేను వందల మంది కార్మికులు, అరవైఆరు నెలల పాటు శ్రమించి రూపుదిద్దిన మహాక్షేత్రం.  నేడు ప్రపంచాన్ని ఆకట్టుకునేలా..  తరతరాలు నిలిచేలా రూపుదిద్దుకుంది. ముఖ్యమంత్రి కెసిఆర్ దృఢసంకల్పంతో ఆవిష్కృతమైన యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయంలో స్వయంభువుల నిజ దర్శనాలకు శుభ తరుణం ఆసన్నమైంది. సుమారు ఆరేళ్ళ తరువాత మూలవరుల దర్శనాలు పున:ప్రారంభం అవుతున్నాయి.

సోమవారం ఉదయం జరిగే ఆలయ ఉద్ఘాటన మహా క్రతువుకు రంగం సిద్ధమయింది. మహా కుంభ సంప్రోక్షణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ముఖ్య అతిథిగా పాల్గొననున్న ముఖ్య మంత్రి కెసిఆర్ కు ఘనస్వాగతానికి అధికార యంత్రాంగం సిద్ధమైంది. వారంరోజులుగా బాలాఆలయంలో కొనసాగుతున్న పంచకుండాత్మక మహాయాగంలో మహా పూర్ణాహుతి నిర్వహించిన అనంతరం ప్రతిష్ఠ మూర్తులతో ఉదయం తొమ్మిదిన్నర గంటలకు చేపట్టి శోభాయాత్రతో ఉద్ఘాటన క్రతువు మొదలవుతుంది.  తొలుత  శోభాయాత్ర ప్రధానాలయ 2  మాడ వీధిలో ప్రదక్షిణ అనంతరం తొలి వీధిలోకి ప్రవేశించగానే మహాకుంభ సంప్రోక్షణ చేపడతారు.

విమాన గోపురంపై  శ్రీ సుదర్శనాళ్వారులకు జరిపే సంప్రోక్షణతో ఆరు రాజ గోపురాలపై స్వర్ణ కళాశాలకు సంప్రోక్షణ నిర్వహిస్తారు. మిథున లగ్నంలో ఏకాదశినాడు ఉదయం 11.55  గంటలకు  ఈ మహోత్సవం ఆవిష్కృతం కానుంది.  అనంతరం 12.10 గంటలకు  ప్రధాన ఆలయ ప్రవేశంతో పాటు  గర్భాలయంలోని స్వర్ణ ధ్వజస్తంభ సందర్శన ఉంటుంది. సరిగ్గా 12.20 గంటలకు  గర్భాలయంలోని మూలవరుల దర్శనం మొదలుకానుంది.

ఎన్నెన్నో వసతులు..
ఆదివారం ఉదయం, రాత్రి వేళల్లో బాలాలయంలో పంచకుండాత్మక  మహాయాగం, మూర్తి, మంత్ర హవనం, ప్రధానాలయంలో అష్టోత్తర  శతకలశాభిషేకం, పంచవయ్యాధివాసం క్రతువులను పాంచరాత్ర ఆగమ శాస్త్రానుసారం నిర్వహించామని ఆలయ ప్రధాన అర్చకులు నల్లంథిగల్  లక్ష్మీ నరసింహాచార్య వెల్లడించారు. నాలుగంతస్తుల క్యూ కాంప్లెక్స్ తోపాటు  కొండ కింద కల్యాణకట్ట, లక్ష్మీ పుష్కరిణి, అన్న ప్రసాదానికి దీక్షాపరుల మండపాన్ని ఆలయ ఈవో ఆదివారం సంప్రదాయబద్దంగా పూజలు చేసి అందుబాటులోకి తెచ్చారు.

ముఖ్యమంత్రితో తొలి పూజ…
ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకొని ప్రథమ పూజలు చేయనున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రభుత్వ ముఖ్యులు సైతం పాల్గొంటారని అధికారవర్గాల సమాచారం. 12:30 గంటల నుంచి 20 నిమిషాల పాటు ప్రధాన ఆలయంలో సీఎంకు వేదాశీర్వచనం జరుగుతుంది.  మధ్యాహ్నం మూడు గంటల తర్వాత భక్తులకు స్వయంభువుల సర్వదర్శనం మొదలవుతుంది.  మహా క్రతువు ఏర్పాట్లను  మంత్రి జగదీష్ రెడ్డి, ప్రభుత్వ విప్ సునీత పరిశీలించారు.

నేడు యాదాద్రికి సీఎం కేసీఆర్..
యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం మహా సంప్రోక్షణ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం ఉదయం కుటుంబ సమేతంగా యాదగిరిగుట్టకు చేరుకుంటారు. దర్శనాలు, పూజల అనంతరం క్షేత్ర అభివృద్ధికి కృషి చేసిన వారందరిని ఆలయం మాడవీధుల్లో ఆయన సన్మానిస్తారు.

రెండు వేల మందితో భద్రత..
ఆలయ ఉద్ఘాటన,  మహా క్రతువుకు ముఖ్యమంత్రి సహా  పలువురు మంత్రులు, ఇతర ప్రముఖులు  హాజరు అవుతున్నందున దాదాపు 2000 మంది పోలీసులతో భద్రతను నిర్వహిస్తున్నారు. రాచకొండ సీపీ మహేష్ భగవత్, భువనగిరి డిసిపి నారాయణరెడ్డి ఆదివారం ఈ ఏర్పాట్లను పర్యవేక్షించారు. ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా  రూట్మ్యాప్ రూపొందించారు. ప్రత్యేకంగా పార్కింగ్ ఏర్పాటు చేస్తున్నారు. కొండ కింద నుంచి పైకి రవాణా సౌలభ్యం కోసం  ఆర్టీసీ‘యాదాద్రి దర్శని’  బస్సులను సిద్ధం చేసింది.

యాదాద్రి అద్భుతం.. ట్విట్టర్లో ఎమ్మెల్సీ కవిత..
యాదాద్రి ఆలయ ఉద్ఘాటన ఒక అద్భుతం అని,  ధార్మిక, శిల్పకళా నైపుణ్యం కళ్లకు కట్టేలా రూపుదిద్దిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ దేనని తెరాస ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్లో పేర్కొన్నారు.  ప్రపంచంలోని మహా దేవాలయాల్లో ఇది ఒకటి గా నిలుస్తుందని అన్నారు.
 

PREV
click me!

Recommended Stories

Harish Rao Aarogyasri Speech:ఆరోగ్యశ్రీ బిల్లులపై పై హరీష్ రావు కీలక కామెంట్స్ | Asianet News Telugu
అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఉగ్రరూపం: Revanth Reddy Powerful Speech in Assembly: | Asianet Telugu