యాదగిరి గుట్ట: పార్కింగ్ ఫీజు .. గంటకు రూ. 500 , వెనక్కి తగ్గిన ఆలయ కమిటీ.. కానీ..?

Siva Kodati |  
Published : May 04, 2022, 04:50 PM IST
యాదగిరి గుట్ట: పార్కింగ్ ఫీజు .. గంటకు రూ. 500 , వెనక్కి తగ్గిన ఆలయ కమిటీ.. కానీ..?

సారాంశం

యాదగిరి గుట్టపై పార్కింగ్ ఫీజు వసూలు వ్యవహారం దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. గంటకు రూ.500 పార్కింగ్ ఫీజు వసూలు చేయాలన్న నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో యాదాద్రి ఆలయ కమిటీ వెనక్కి తగ్గింది. 

యాదగిరి గుట్టపై పార్కింగ్ ఫీజుపై (parking fee) యాదాద్రి ఆలయ కమిటీ వెనక్కి తగ్గింది. అదనపు గంటకు రూ. 100 రుసుము ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. ఫోర్ వీలర్ల పార్కింగ్ ఫీజు రూ.500 మాత్రం యథాతధంగా కొనసాగిస్తున్నట్లు తెలిపింది. కొండపైకి వెళ్లేందుకు ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలని సూచించింది. 

కాగా.. యాదగిరి గుట్టపై ప్రతి గంటకు రూ.500 వసూలు చేయాలని ఇటీవల అధికారులు నిర్ణయించిన సంగతి తెలిసిందే. అలాగే గంట దాటితే అదనంగా మరో రూ.100ను వసూలు చేస్తామని తెలిపారు. మే 1 నుంచే పార్కింగ్ వసూలు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఉద్యోగులు, మీడియాకి మాత్రమే ఉచిత పార్కింగ్ వసతి వుంది. అలాగే ప్రజా ప్రతినిధులు , జడ్జిలకు ప్రోటోకాల్ ప్రకారం వాహనాలకు అనుమతి ఇస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై అన్ని వైపుల నుంచి విమర్శలు రావడంతో ఆలయ కమిటీ వెనక్కి తగ్గింది. 

మరోవైపు.. యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి వారి (yadadri lakshmi narasimha swamy temple) దర్శనాలు భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. ఆరేళ్ల తర్వాత పునఃప్రారంభమైన యాదాద్రికి భక్తుల తాకిడి పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వారంతాల్లో రద్దీ మరింత ఎక్కువగా ఉండొచ్చని భావిస్తున్నారు. భక్తుల రవాణాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేకంగా బస్సులు ఏర్పాటు చేస్తున్నామని ఆర్టీసీ ఛైర్మన్ బాజీరెడ్డి గోవర్ధన్ (bajireddy govardhan) తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని బస్సులను ఎర్పాటు చేస్తామని స్పష్టం చేశారు. 

కాగా.. యాదాద్రి ఆలయం పునః ప్రారంభోత్సవ వేడుక ఇటీవల వైభవంగా జరిగింది. యాదాద్రి ఆలయంలో మహాకుంభ సంప్రోక్షణ కన్నుల పండుగగా సాగింది. ప్రధానాలయం గోపురాలపై ఉన్న కలశాలకు కుంభాభిషేకం, సంప్రోక్షణ వైభవంగా జరిగింది. రాజగోపురాల‌పై ఉన్న క‌ల‌శాల‌కు ఏకకాలంలో 92 మంది రుత్వికులతో కుంభాభిషేకం, సంప్రోక్ష‌ణ నిర్వ‌హించారు. వేదమంత్రోచ్ఛరణ నడుమ సంప్రోక్షణ క్రతువు వైభవోపేతంగా జరిగింది. దివ్య విమాన గోపురంపై శ్రీ సుద‌ర్శ‌న చ‌క్రానికి సీఎం కేసీఆర్ (kcr) ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించి, ప‌విత్ర జ‌లాల‌తో అభిషేకం నిర్వ‌హించారు. సీఎం కేసీఆర్‌కు కంక‌ణ‌ధార‌ణ చేసిన వేదపండితులు ఆశీర్వ‌చ‌నం అందించారు. అదే సమయంలో ఆలయంలోని ఇతర గోపురాలకు శాసనసభ స్పీకర్, మండలి చైర్మన్, మంత్రులు ఆధ్వర్యంలో సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. 

మ‌హాకుంభ సంప్రోక్ష‌ణ మ‌హోత్స‌వం త‌ర్వాత ప్ర‌ధానాల‌య ప్ర‌వేశ కార్య‌క్ర‌మం నిర్వ‌హించారు. తొలుత ఉపాల‌యాల్లోని ప్ర‌తిష్ఠామూర్తుల‌కు మ‌హాప్రాణ‌న్యాసం చేశారు. తొలి ఆరాధ‌న సంప్రోక్ష‌ణ త‌ర్వాత గ‌ర్భాల‌యంలో స్వ‌యంభువుల ద‌ర్శ‌నం ప్రారంభం అయింది. లక్ష్మీ నర్సింహుడికి సీఎం కేసీఆర్ దంపతులు  తొలి పూజ చేశారు. 
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!
Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !