రేపటి నుంచి యాదాద్రి, భద్రాద్రిల్లో దర్శనాలకు అనుమతి : ఈ మార్గదర్శకాలు పాటించాల్సిందే

By Siva Kodati  |  First Published Jun 7, 2020, 6:13 PM IST

తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల్లో రేపటి నుంచి దర్శనాలు ప్రారంభం కానున్నాయి


కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌తో దాదాపు రెండు నెలల నుంచి దేవాలయాలు భక్తులు లేక వెలవెలబోయాయి. అర్చకులే ధూప దీప నైవేద్యాలను సమర్పించారు.

ఈ నేపథ్యంలో ఆలయాలు తెరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సడలింపులు ఇవ్వడంతో తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయం, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల్లో రేపటి నుంచి దర్శనాలు ప్రారంభం కానున్నాయి.

Latest Videos

undefined

Also Read:భక్తుల కోసం అన్ని జాగ్రత్తలతో రెడీ..

అయితే కరోనా నిబంధనల ప్రకారం.. ఆలయాల్లో తీర్థాలు, శఠగోపాలు ఉండవని అధికారులు స్పష్టం చేశారు. భక్తులంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. కొంతకాలం పాటు యాత్రికులకు ఎలాంటి వసతి సదుపాయం కల్పించడం లేదని అధికారులు వెల్లడించారు.

దీనిపై భద్రాచల ఆలయ ఈవో మాట్లాడుతూ... ఉదయం 6.30 గంటల నుంచి 11.30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు సీతారాముల దర్శనానికి అనుమతిస్తామని పేర్కొన్నారు. ఎంతమంది భక్తులు వచ్చినా దర్శనం చేయిస్తామని, అయితే థర్మల్ స్క్రీనింగ్ తప్పనిసరని ఆయన స్పష్టం చేశారు.

Also Read:రెండు రోజుల్లో తెరుచుకోనున్న ఆలయాలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

యాదాద్రి ఆలయ ఈవో గీత మాట్లాడుతూ... తొలిరోజు ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, స్థానికులను దర్శనానికి అనుమతిస్తామని చెప్పారు. దర్శనానికి వచ్చే స్థానికులు తప్పనిసరిగా ఆధార్ తీసుకురావాలని, మంగళవారం నుంచి భక్తులందరినీ స్వామి వారి దర్శనానికి అనుమతిస్తామని గీత స్పష్టం చేశారు. కొండపైకి ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ద్విచక్ర వాహనాలకు అనుమతిస్తామని, కార్లకు ప్రవేశం లేదని ఆమె వెల్లడించారు. 
 

click me!