
తెలంగాణలో ఎలాగైనా బలపడేందుకు ఊవ్విళూరుతున్న బిజెపిని సిఎం కెసిఆర్ మెసలనిస్తలేడా? కెసిఆర్ వ్యూహాత్మక చర్యలకు బిజెపి పెద్దలు బిత్తరపోతున్నారా? కెసిఆర్ చాణఖ్యం తెలంగాణ బిజెపికి ముందు నుయ్యి వెనుక గొయ్యి పరిస్థితిని తీసుకొచ్చిందా? అంటే రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానం వినబడుతున్నది.
అంగట్లో అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని ఉన్నది అనే సామెత తెలంగాణ బిజెపికి అతికినట్లు సరిపోతదేమో. తెలంగాణలో బలపడేందుకు పుష్కలంగా అవకాశాలున్నా ఆ పార్టీ ఇంకా ముందడుగు వేయలేకపోతున్నది. కొత్తగా కళాశాలలో చేరిన వారిని ర్యాగింగ్ చేసినట్లు బిజెపిలో ఎవరైనా నాయకుడు చేరితే వాళ్లను కూడా ర్యాగింగ్ చేస్తారన్న అపప్రధ రాష్ట్ర నాయకత్వంపై ఉంది. ఎంతసేపు ఆ నాలుగు స్థంభాల చుట్టే రాజకీయం తిప్పుతారు అని పార్టీ నేతలు కూడా చర్చించుకుంటారు.
ఇక తెలంగాణలో బిజెపి నాయకత్వానికి అసలు సమస్య సిఎం కెసిఆర్ తీరే. కెసిఆర్ వైఖరి కారణంగా ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో బిజెపి పడిపోయింది. రాష్ట్ర సర్కారు వైఫల్యాలను ఎత్తిచూపుతూ కదనరంగంలోకి దూకాలా? లేక కెసిఆర్ తో దోస్తాన్ చేయాలా అన్నది తేల్చుకోలేకపోతున్నారు. వారు తేల్చుకోలేకపోతున్నారు అనే కంటే కెసిఆర్ వాళ్లను తేల్చుకోకుండా త్రిశంకు స్వర్గంలోకి నెడుతున్నారు అని చెప్పవచ్చు. ఎందుకంటే కెసిఆర్ స్ట్రాటజీ బిజెపి నేతలకు అస్సలు అంతు చిక్కడంలేదు.
ఏదైనా సర్కారు వైఫల్యాన్ని ఎండగట్టేలా యాక్షన్ ప్లాన్ రెడీ చేసుకుందామా అంటే అంతలోనే మోడీని ఆకాశానికెత్తుతూ సిఎం ప్రకటనలు గుప్పస్తారు. లేదంటే బిజెపిలో కీలక నేతలకు సన్మానాలు బహుమతులు లాంటివి ఇస్తూ ఉంటారు. దీంతో తెలంగాణ బిజెపి నేతలు అయోమయంలో పడిపోతున్నారు. సరేలే దోస్తాన్ చేద్దామా అనుకుంటే అంతలోనే బజెపిపై కెసిఆర్ కత్తులు దూస్తారు. సరే మరి తాడో పేడో తేల్చుకుందామా అనుకుంటుండగానే మళ్లీ కెసిఆర్ వైపు నుంచి తియ్యటి సందేశం వినిపిస్తది. దీంతో ముందుకు కదలలేక వెనుకకు పోలేక రాష్ర్ట బిజెపి శ్రేణులు సతమతమవుతున్నాయి.
తెలంగాణలో ఉన్న పార్టీల్లో టిఆర్ఎస్ అధికారంలో ఉంది. కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంలో తన పాత్ర తాను పోశిస్తున్నది. కొందరు నాయకులు కెసిఆర్ తో లోపాయికారి స్నేహం చేస్తున్నప్పటికీ కాంగ్రెస్ గట్టిగానే ఫైట్ చేస్తున్నది. ఇక టిడిపి కాంగ్రెస్ కంటే గట్టిగా సర్కారును ఎండగడుతున్నది. రేవంత్ రెడ్డి ప్రతిపక్ష నేత పాత్ర పోశిస్తున్నాడు. ఇక లెఫ్ట్ పార్టీలు సైతం ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతున్నాయి. తుదకు జెఎసి సైతం సర్కారు వైఫల్యాలను గట్టిగా ఎండగడుతున్నది. కానీ బిజెపి ఏం చేస్తుందో ఎవరికీ అంతుచిక్కని స్థితిలో ఉంది. విపక్షాలతో గొంతు కలపలేక, అధికారపక్షంతో అంటకాగలేక డోలాయమాన స్థితిలో ఉంది బిజెపి.
ఇప్పటి వరకు జిఎస్టీ విషయంలో ఎన్డీఎ భాగస్వామ్య పక్షాల కంటే ముందే కెసిఆర్ ఆమోదం తెలిపిండు. తుదకు బిజెపి పాలిత రాష్ట్రాల కంటే ముందే బిల్ పాస్ చేపించిర్రు.
నోట్ల రద్దు విషయంలో కొందరు రాష్ట్ర మంత్రులు సన్నాయి నొక్కులు నొక్కినా కెసిఆర్ మాత్రం బాహటంగా స్వాగతించారు.
రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో భేషరతు మద్ధతు ఇచ్చిండు కెసిఆర్. అంతేకాకుండా రాష్ట్రపతి కోవింద్ కు భారీ స్వాగతం, అద్భుతమైన సన్మానం చేసి ఫిదా చేసిర్రు.
వెంకయ్యనాయుడుకు ఘనంగా పౌర సన్మానం ఏర్పాటు చేసిర్రు.
గతంలో మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావుకు, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయకు పౌర సన్మానం చేసిర్రు.
ఇవన్నీ బిజెపితో సయోధ్య కుదిరేలా చేసినవి కాగా... కయ్యానికి కాలు దువ్వినవి కూడా ఉన్నాయి.
బిజెపి జాతీయ అధ్యక్షుడైన అమిత్ షాను పరుషమైన భాషలో విరుచుకుపడ్డారు కెసిఆర్. అమిత్ షా పప్పులు ఉడకవు జాగ్రత్త అని హెచ్చరించాడు. నేనే తెలంగాణ బాద్ షా అని హెచ్చరించారు.
మరోవైపు బిజెపికి ప్రత్యర్థి అయిన ఎంఐఎంతో అత్యంత సన్నితంగా మెలుగుతున్నది టిఆర్ఎస్ పార్టీ.
తన సర్వేల్లో బిజెపికి ఇప్పుడున్న సీట్లు కూడా రావని ఒక్క వస్తే అదే మహా భాగ్యం అని బరాబర్ చెప్పుతున్నడు.
బిజెపికి తెలంగాణలో స్థానం లేదని పలుమార్లు ఢంకా భజాయించి చెప్పారు కెసిఆర్.
ఈ నేపథ్యంలో రాష్ట్ర బిజెపి నేతలకు ఏం చేయాలో దిక్కుతోచడంలేదని పార్టీ నేతల్లో చర్చ జరుగుతున్నది.
రాష్ట్ర బిజెపి అవస్థలు గుర్తించిన కేంద్ర నాయకత్వం డైరెక్ట్ గా రంగంలోకి దిగింది. తెలంగాణలో బిజెపి బలపడేంకు రాష్ట్ర నాయకత్వంతో సంబంధం లేకుండా పార్టీ అగ్ర నాయకత్వమే సీరియస్ గా దృష్టి సారించినట్లు వార్తలొస్తున్నాయి. బిజెపి అధ్యక్షుడు అమిత్ షా స్వయంగా తెలంగాణ రాజకీయాలను పర్యవేక్షిస్తున్నట్లు చెబుతున్నారు. 2019 ఎన్నికలకు స్థానిక నాయకత్వంతో సంబంధం లేకుండానే అమిత్ షా గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నట్లు వార్తలొస్తున్నాయి. తెలంగాణలో బలపడేందుకు అమిత్ షా స్కెచ్ వేశాడన్న వాసనతోనే సిఎం కెసిఆర్ చెడామడా విమర్శలు గుప్పించాడని చెబుతున్నారు.
మొత్తానికి తెలంగాణ బిజెపికి జాతీయ నాయకత్వం అండదండలు లేకపోతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే చాన్స్ ఉందంటున్నారు. మరి తెలంగాణ బిజెపిని గాడిలో ఎలా పెడతారో? అమిత్ షా ఏం మ్యాజిక్ చేస్తారో అని జాతీయ నాయకత్వం వైపు దీనంగా ఎదురుచూస్తున్నారు రాష్ట్ర బిజెపి నేతలు.