వైఎస్ షర్మిలకు షాక్, గుట్టురట్టు: దీక్షాస్థలి వద్ద అడ్డాకూలీల ఆందోళన

By AN TeluguFirst Published Sep 21, 2021, 12:11 PM IST
Highlights

తమను తీసుకొచ్చిన వారు డబ్బు ఇవ్వట్లేదని దీక్షా స్థలి వద్దే ఆందోళన చేపట్టారు. దీక్షలో కూర్చుంటే రూ.400 ఇస్తామని చెప్పి తీసుకొచ్చారని కూలీలు చెబుతున్నారు. 

హైదరాబాద్ : మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడలో అడ్డాకూలీలు ఆందోళనకు దిగారు. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల చేపట్టనున్న దీక్షకు తమను తీసుకొచ్చి, డబ్బులు ఇవ్వట్లేదని అడ్డాకూలీలు నిరసన తెలిపారు. తమను తీసుకొచ్చిన వారు డబ్బు ఇవ్వట్లేదని దీక్షా స్థలి వద్దే ఆందోళన చేపట్టారు. దీక్షలో కూర్చుంటే రూ.400 ఇస్తామని చెప్పి తీసుకొచ్చారని కూలీలు చెబుతున్నారు. మరోవైపు ఇవాళ పీర్జాదిగూడలో షర్మిల చేపట్టబోయే నిరసన దీక్షకు పోలీసులు అనుమతి నిరాకరించారు. 

కాగా, హైద్రాబాద్ లోని బోడుప్పల్ లో వైఎస్ఆర్‌టీపీ తెలంగాణ చీఫ్ వైఎస్ షర్మిల దీక్షకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఉద్దేశ్యపూర్వకంగానే ఈ దీక్షకు పోలీసులు అనుమతికి నిరాకరించారని ఆరోపిస్తూ దీక్షాస్థలం వద్దే వైఎస్ఆర్‌టీటీపీ కార్యకర్తలు మంగళవారం నాడు ఆందోళనకు దిగారు.

ప్రతి మంగళవారం నాడు నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఆత్మహత్యకు పాల్పడిన నిరుద్యోగ కుటుంబాలను పరామర్శించి వైఎస్ షర్మిల దీక్ష నిర్వహిస్తున్నారు. ఈ దీక్ష కార్యక్రమంలో భాగంగా ఇవాళ బోడుప్పల్ లో దీక్షకు వైఎస్ఆర్‌టీపీ నిర్ణయం తీసుకొంది. అయితే బోడుప్పల్ లో షర్మిల దీక్షకు అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో దీక్షా చేయాల్సిన స్థలంలోనే ఆ పార్టీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

స్థానిక ఎమ్మెల్యే ఈ దీక్షకు అనుమతి ఇవ్వకుండా అడ్డుపడుతున్నారని వైఎస్ఆర్‌టీపీ నేతలు ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ సర్కార్ మాత్రం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదని ఆ పార్టీ నేతలు ఆరోపించారు.

ఇదిలా ఉండగా, తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సెంటిమెంటును వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పాటించనున్నారు. అక్టోబర్ 20వ తేదీన తన ప్రజా ప్రస్థాన యాత్రను ప్రారంభిస్తానని ఆమె సోమవారం మీడియా సమావేశంలో చెప్పారు. తన పాదయాత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి చూపిన దారిలో చేవెళ్ల నుంచి ప్రారంభమై, అక్కడే ముగుస్తుందని ఆమె చెప్పారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో దగా పడిన తెలంగాణ ప్రజలకు గుండె ధైర్యం కల్పించడానికే తాను పాదయాత్ర చేస్తున్నట్లు ఆమె తెలిపారు. గ్రేటర్ హైదరాబాదు ప్రాంతం తప్ప 90 నియోజకవర్గాల్లో ప్రతి పల్లెను, గడపనూ తాకుతూ ఏడాది పాటు తన పాదయాత్ర సాగుతుందని ఆమె చెప్పారు. 

YS Sharmila Praja Prasthana Yatra: వైఎస్ సింటిమెంట్ తోనే

పాదయాత్ర సమయంలో రోడ్డు పక్కనే తన ఆవాసం ఏర్పాటు చేసుకుంటానని, ప్రజలతో మమేకమవుతానని ఆయన చెప్పారు. ప్రజల కష్టాలనూ కన్నీళ్లనూ తెలుసుకునేందుకు సమయం కేటాయిస్తానని షర్మిల చెప్పారు. పాదయాత్రలో భాగంగా బహిరంగ సభలు నిర్వహిస్తామని షర్మిల చెప్పారు. 

ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనపై వైఎస్ షర్మిల తీవ్రంగా ధ్వజమెత్తారు. 3 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసి 36 లక్షల మందికి ఎగ్గొట్టారని, దీంతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, 16 లక్షల మంది రైతులు దీనస్థితిలో ఉన్నారని ఆమె అన్నారు. 

కేసీఆర్ పాలనలో దళితులపై 800 శాతం, మహిళలపై 300 శాతం దాడులు పెరిగాయని ఆమె ఆరోపించారు. నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆమె విమర్సించారు. 
 

click me!