
హైదరాబాద్ : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మహిళా బిల్లుపై స్పందించారు. కేంద్ర కేబినేట్ మహిళా బిల్లుకు ఆమెదం తెలపడం శుభపరిణామమని అన్నారు. పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నామన్నారు. మహిళలు జనాభాలో సగం ఉన్నారని... వారికి సమాన హక్కు పొందే రోజుకోసం ఎదురుచూస్తున్నారని అన్నారు షర్మిల.
మహిళా బిల్లు ప్రవేశపెట్టడం ఆనందించదగ్గ విషయమే అయినా.. ఎన్నికల సమయంలో ప్రవేశపెట్టడంపై అనుమానాలున్నాయన్నారు. ప్రజాశ్రేయస్సు కోసం ఆలోచించాలని, పని చేయాలని.. రాజకీయ అవకాశవాదం గురించి కాదని షర్మిల హితవు పలికారు. ఈ బిల్లును రాజకీయ అవకాశవాదంగా ఉపయోగించవద్దని బిల్లు ఆమోదంలో ఉన్న రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు సూచించారు.
అయితే, ఈ బిల్లును ప్రవేశపెట్టడానికి ఇంత సమయం మోదీ ప్రభుత్వం తీసుకోవడం బాధాకరమని అన్నారు. రాజకీయ అవకాశవాదంగా ఈ బిల్లును ఉపయోగిస్తే దాని ముఖ్య ఉద్దేశం దెబ్బతింటుందని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకోసం దశాబ్దాలుగా పోరాడుతున్నామని...దీనికి రాజకీయాలకు అతీతంగా అందరం మద్దతిద్దామని షర్మిల అన్నారు.