
హైదరాబాద్ మెట్రో సిబ్బందిపై ఓ మహిళా ప్యాసింజర్ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఆమె పొగుట్టుకున్న బ్యాగ్ ని జాగ్రత్తగా మెట్రో సిబ్బంది ఆమెకు అందజేశారు. సాధారణంగా మెట్రో స్టేషన్లలో, బస్టాండ్ , రైల్వే స్టేషన్ లాంటి చోట్ల పోయిన వస్తువులు దొరకడం చాలా కష్టం. ఎందుకంటే అలాంటి ప్రదేశాల్లో నిత్యం రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఎవరి వస్తువు ఎవరు తీస్తున్నారో కూడా ఎవరికీ తెలీదు. అయితే.. హైదరాబాద్ మెట్రో స్టేషన్ లో మాత్రం తాను పోగొట్టుకున్న వస్తువు భద్రంగా తన దగ్గరికి చేరిందని ఓ మహిళ ఆనందంతో చెబుతోంది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పోస్టు చేసింది.
ఆమె పోస్టులో ఏముందంటే.. ‘‘ నా పేరు రోషిణీ రావు. జూబ్లీహిల్స్ లో ఉంటారు. హైదరాబాద్ మెట్రో ప్రారంభం అయిన నాటి నుంచి నేను అందులోనే ప్రయాణం చేస్తున్నాను. ట్రాఫిక్ సమస్య నుంచి తప్పించుకోవడానికి నేను మెట్రోలో వెళుతుంటాను. నా వెహికల్ మెట్రో పార్కింగ్ స్టేషనల్ లో పార్క్ చేసి రోజూ ఆఫీస్ కి ఇందులో వెళతాను. అమెరికా నుంచి నా కజిన్.. తన అమెరికా ఫ్రెండ్ తో కలిసి ఇండియా చూడటానికి వచ్చింది. వాళ్లిద్దరూ నిన్న ఇండస్ట్రీయల్ ఎగ్జిబిషన్ వెళ్తుండగా.. నేను కూడా వాళ్లతో వెళ్లాల్సి వచ్చింది.’’
‘‘ ఎస్ఆర్ నగర్ లో మెట్రో ఎక్కి..గమ్యస్థానానికి చేరుకున్నాను. అక్కడికి వెళ్లాక గుర్తొచ్చింది. టికెట్ తీసుకునే సమయంలో నేను నా బ్యాగ్ కౌంటర్ దగ్గర మర్చిపోయాను. ఆ బ్యాగ్ లో రూ.12వేలు విలువచేసే రెండు పట్టుచీరలు ఉన్నాయి. దాదాపు 4గంటల తర్వాత నేను మళ్లీ ఎస్ఆర్ నగర్ మెట్రో స్టేషన్ కి వెళ్లాను. అక్కడ సిబ్బంది నన్ను చూడగానే.. బ్యాగ్ ఎక్కడ ఉందో చెప్పి.. నా బ్యాగ్ నాకు ఇచ్చేసారు’’
‘‘కనీసం నేను ఎందుకు వచ్చానో కూడా అడగకుండానే వాళ్లు నా బ్యాగ్ నాకు అందించడం చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఆ బ్యాగ్ నాదేనని మీకు ఎలా తెలుసు అని నేను వాళ్లని అడగగా...సీసీ కెమేరాలో చూసి అది మీదేనని గుర్తించామని చెప్పారు. మెట్రో టికెటింగ్ సిబ్బంది, సెక్యురిటీ సిబ్బందికి చాలా థ్యాంక్స్..’’ అంటూ ఆమె పోస్టు పెట్టారు.