హైద్రాబాద్ కేపీహెచ్ బీ లో విద్యుత్ షాక్ తో మహిళ మృతి చెందింది.
హైదరాబాద్: నగరంలోని కేపీహెచ్ బీ అడ్డగుట్ట రోడ్డులో విద్యుత్ షాక్ తో 35 ఏళ్ల బాపనమ్మ అనే మహిళ మంగళవారంనాడు మృతి చెందింది. ఐదేళ్ల మరో పాప తీవ్రంగా గాయపడింది.
కేపీహెచ్ బీ అడ్డగుట్ట రోడ్డులో ఇంటి పక్కనే ఉన్న చెట్టు వద్ద టీవీ చానెల్స్ కు చెందిన కేబుల్స్ ఉన్నాయి. ఇవాళ ఉదయం ఐదేళ్ల పాప ఇంటి ముందు ఆడుకుంటూ చెట్టుకు తగిలింది. అయితే ఈ చెట్టుకు కేబుట్స్ కట్టి ఉన్నాయి. ఈ కేబుల్స్ గుండా విద్యుత్ ప్రవహించి ఐదేళ్ల చిన్నారికి గట్టిగా కేకలు వేసింది. వెంటనే చిన్నారి బంధువు బాపనమ్మ పరుగు పరుగున వచ్చి పాపను పక్కకు నెట్టివేసింది. దీంతో బాపనమ్మ విద్యుత్ షాక్ గురైంది. ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. మరో వైపు తీవ్రంగా గాయపడిన ఐదేళ్ల చిన్నారిని కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చేర్పించారు. వైద్యులు బాలికకు చికిత్స అందిస్తున్నారు.
కేబుల్స్ విషయమై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. బాపనమ్మ మృతికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
విద్యుత్ షాక్ కారణంగా పలువురు మృత్యువాత పడిన ఘటనలు గతంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది మే 9వ తేదీన ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం పెద్దకొండమర్రిలో విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతి చెందారు. నీటిసంప్ చేస్తున్న సమయంలో విద్యుత్ వైర్ సంపులో పడడంతో ఈ ప్రమాదం జరిగింది.
కడప జిల్లాలోని చెన్నూరు మండలం ఖాదర్ ఖాన్ కొట్టాలలో ఈ ఏడాది ఫిబ్రవరి 23న విద్యుత్ షాక్ లో ఇద్దరు మృతి చెందారు. రేకుల షెడ్డుపై విద్యుత్ వైర్ పడింది. ఈ విషయం గుర్తించని ఇద్దరు చిన్నారులు రేకుల షెడ్డుపైకి వెళ్లి విద్యుత్ షాక్ గురై మృతి చెందారు.
ఈ ఏడాది ఏప్రిల్ 14న అన్నమయ్య జిల్లాలో విద్యుత్ షాక్ తో నలుగురు మృతి చెందారు. గత ఏడాది నవంబర్ 22న విద్యుత్ షాక్ తొ తల్ల్లీ కొడుకు మృతి చెందాడు. ఇనుప తీగపై బట్టలు ఆరవేస్తున్న సమయంలో తల్లి విద్యుత్ షాక్ కు గురైంది. ఆమెను రక్షించేందుకు కొడుకు ప్రయత్నించాడు. ఈ ప్రమాదంలో వీరిద్దరూ మృతి చెందారు.
ఈ ఏడాది మే 11న మహబూబాబాద్ జిల్లాలో విద్యుత్ షాక్ తో యువకుడు మృతి చెందాడు. మరికొన్ని గంటల్లో పెళ్లి పీటలెక్కాల్సిన యువకుడు విద్యుత్ షాక్ తో చనిపోయాడు. బోరు రిపేర్ చేస్తున్న సమయంలో యువకుడు విద్యుత్ షాక్ కు గురయ్యాడు.