
కరోనా మహమ్మారి దేశాన్ని అతలాకుతలం చేసేస్తోంటే.. దాని నుంచి ఎలా బయటపడాలా అని అందరూ ఎదురుచూస్తున్నారు. మరోవైపు ఈ మహమ్మారి పేరు చెప్పి.. కొందరు తమ వ్యక్తిగత కక్షలు తీర్చుకుంటున్నారు. తాజాగా ఇలాంటి సంఘటనే ఒకటి వెలుగులోకి వచ్చింది.
కరోనా పాజిటివ్ వచ్చిన ఓ మహిళ.. తన మాజీ భర్త ఇంటికి వెళ్లి.. నానా హంగామా చేసిందట. ఆస్తిరాయకుంటే.. నీ ముఖం పై దగ్గుతా.. నాకు అసలే కరోనా సోకింది. తర్వాత నీ ఇష్టం అని బెదిరించిందట. ఆమె బెదిరింపులకు భయపడిపోయిన సదరు వ్యక్తి ఏం చేయాలో పాలుపోక పోలీసులను ఆశ్రయించాడు. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
జూబ్లీహిల్స్ లోని నందగిరిహిల్స్ లో నివసించే సంజీవరెడ్డి(70) ఓ మహిళ(38)ను పెళ్లాడాడు. వీరికి ఒక కుమారుడు(17) కూడా ఉన్నారు. సంజీవరెడ్డి ప్రశాసన్ నగర్ లో గతంలో సంజీవ రెడ్డి తన భార్య పేరిట ఓ ఇల్లు కొన్నాడు. అయితే.. ఆ తర్వాత ఆమె భర్తను వదిలేసి మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది.
తండ్రి కుమారులు మాత్రం నందగిరిహిల్స్ లో నివసిస్తున్నారు. కాగా..గతంలో తన పేరిట కొన్న ఇంటిని దక్కించుకునేందుకు అతని మాజీ భార్య ప్లాన్ వేసింది. గత నెల 31 వ తేదీన మాజీ భర్త ఇంట్లోకి ప్రవేశించి.. తన పేరిట కొన్న ఇంటి పత్రాలను ఇవ్వాలని డిమాండ్ చేసింది.
అతను అంగీకరించకపోవడంతో.. తాను కరోనా పాజిటివ్ అని.. ముఖం పై దగ్గుతానని బెదిరించడం గమనార్హం. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.