పుట్టినరోజునే మృతుఒడిలోకి... ఖైరతాబాద్ రైలు ప్రమాదంలో మహిళ దుర్మరణం

By Arun Kumar PFirst Published May 19, 2022, 11:11 AM IST
Highlights

పుట్టినరోజున ఆనందంగా గడపాల్సిన మహిళ ప్రమాదవశాత్తు రైలు ఢీకొనడంతో మృతిచెందింది. ఈ విషాద ఘటన హైదరాబాద్ ఖైరతాబాద్ లో చోటుచేసుకుంది. 

హైదరాబాద్‌: పుట్టినరోజునే రైలు ప్రమాదానికి గురయి ఓ మహిళ మృతిచెందిన ఘటన హైదారాబాద్ లో చోటుచేసుకుంది. సాయంత్రం బర్త్ డే పార్టీ చేసుకుందామని చెప్పి ఇంట్లోంచి బయటకు వెళ్లిన మహిళ విగతజీవిగా ఇంటికి చేరడంతో ఆ కుటుంబంలో ఆనందం ఆవిరై విషాదం నిండుకుంది. 

వివరాల్లోకి వెళితే... మహారాష్ట్ర షోలాపూర్ ప్రాంతానికి చెందిన లావణ్య ఇద్దరు కూతుళ్లు, తండ్రి, సోదరుడితో కలిసి ఉపాధి నిమిత్తం హైదరాబాద్ కు వచ్చింది. వీరంతా ఖైరతాబాద్ తుమ్మలబస్తీలో అద్దెకుంటున్నారు. లావణ్య ఖైరతాబాద్ లోనే ఓ కంపనీలో టెలీకాలర్ గా పనిచేస్తోంది. ఆమె తండ్రి, సోదరుడు కూడా పనులు చేస్తున్నారు. ఇలా ఆనందంగా సాగుతున్న వీరి జీవితంలో ఒక్కసారిగా విషాదం నెలకొంది. 

బుధవారం లావణ్య పుట్టినరోజు కావడంతో అందంగా ముస్తాబై ఫోటో తీసుకుంది. కూతుళ్లు, తండ్రి, సోదరుడు పుట్టినరోజు విషెస్ తెలుపగా సాయంత్రం ఆఫీస్ నుండి వచ్చాక భర్త్ డే పార్టీ చేసుకుందామని చెప్పంది. ఇలా ఆఫీస్ కు బయలుదేరిన లావణ్య తిరిగి ఇంటికి చేరుకోలేదు.   

ఆఫీస్ కు వెళుతూ ఖైరతాబాద్ రైల్వేస్టేషన్ వద్ద పట్టాలు దాటుతుండగా ఒక్కసారిగా ఎంఎంటీఎస్ ట్రెయిన్ వేగంగా దూసుకొచ్చింది. తప్పించుకునే క్రమంలో దాదాపు పట్టాలు దాటేసినా రైలు వేగానికి ఒక్కసారిగా ఎగిరి కిందపడింది. పట్టాలపై వుండే రాళ్లు తలకు తగలడంతో తీవ్రంగా గాయపడిన లావణ్య అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయింది.  

వెంటనే రైల్వే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని యువతి మృతదేహాన్ని పట్టాలపైనుండి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. లావణ్య కోసం ఎదురుచూస్తున్న కుటుంబసభ్యులు ఆమె మరణవార్త విని బోరున విలపించారు. పుట్టినరోజునే లావణ్య మృతిచెందడంతో తీవ్ర విషాదం  నెలకొంది.

ఇదిలావుంటే ఇలాగే వరంగల్ జిల్లా ఖానాపూర్ లో ఆనందాలు వెల్లివిరిసిన ఓ ఇంట్లో ఒక్కసారిగా విషాదం నెలకొంది. పెళ్లి ఘనంగా ఏర్పాటు చేస్తూ అవసరమైన సామాగ్రి కోసం వెళుతుండగా ట్రాక్టర్ బోల్తాపడి ఐదుగురు మృతిచెందారు. మృతుల్లో ముగ్గురు మహిళలు ఉన్నారు. మరో ముగ్గురికి తీవ్రంగా గాయపడ్డారు. 

పెళ్లి సామాన్లకు వెళ్లి తిరిగివస్తుండగా అశోక్ నగర్ చెరువుకట్టపై వెళుతుండగా ప్రమాదం జరిగింది. చెరువు కట్ట చిన్నదిగా ఉండడం, ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయే క్రమంలో ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్‌లో తొమ్మిది మంది ఉండగా ఒకరు సురక్షితంగా బయటపడ్డారు. 

మొదట క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నర్సంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.  ఈ ప్రమాదంలో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

click me!