తన ఇద్దరు చిన్నారుల్ని చంపి, తానూ ఆత్మహత్య చేసుకుంది ఓ ఇల్లాలు. భర్తతో గొడవల కారణంగానే ఈ దారుణానికి ఒడిగట్టిందని తెలుస్తోంది.
హైదరాబాద్ : ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను చంపి, తాను ఆత్మహత్య చేసుకున్న సంఘటన బాలనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం చోటుచేసుకుంది. సిఐ కె. భాస్కర్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. నాగర్ కర్నూలు జిల్లాకు చెందిన మహేష్, అనిత (22) దంపతులకు వర్షిణి (22నెలలు), శ్రీహాన్ ( 9 నెలలు) సంతానం. వారు గత నాలుగేళ్లుగా బాల నగర్ డివిజన్ గౌతమ్ నగర్ లో నివాసం ఉంటున్నారు. మహేష్ వృత్తిరీత్యా డ్రైవర్.
గత కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంగళవారం మహేష్ డ్యూటీకి వెళ్లి, తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపులు మూసి ఉన్నాయి. పలుమార్లు పిలిచినా అనిత తలుపులు తీయలేదు. దీంతో అనుమానం వచ్చిన మహేష్ కిటికీలోంచి చూడగా అనిత ఉరివేసుకొని కనిపించటంతో పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు తలుపులు తెరిచి చూడగా అనిత ఉరి వేసుకుని ఉంది.
ఇద్దరు పిల్లలు మృతి చెంది ఉన్నారు. పిల్లలని చంపి, అనిత ఆత్మహత్య చేసుకుందని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ భాస్కర్ తెలిపారు.
భార్యను చెల్లి అని పిలవమన్నాడని కసితో పెట్రోల్ పోసి హత్య.. తండ్రి, కొడుకు, గర్భస్థ శిశువు మృతి...
ఇదిలా ఉండగా, వైసీపీ నాయకుల వేధింపులు తాళలేక ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆంధ్రప్రదేశ్ లోని విశాఖలో చోటు చేసుకుంది. మృతదేహాన్ని కూడా చూడకుండా భర్తను, బంధువులను పోలీసులు అడ్డుకున్నారు. విశాఖ జిల్లా పెందుర్తి మండలంలో జరిగిన ఈ ఉదంతం సంచలనం సృష్టించింది. ముదపాక పంచాయతీ గోవిందపురం గ్రామానికి చెందిన సారిపల్లి భీమేశ్వరరావు, సోమేశ్వరరావు, కడియాల అచ్చమ్మ (36) తోబుట్టువులు. సోదరులు ఇద్దరు గ్రామంలోని రెండు సెంట్ల స్థలాన్ని అచ్చియ్యమ్మకు బహుమానంగా ఇచ్చారు. కొన్నాళ్లుగా ఆ స్థలానికి సంబంధించి వీరికి, స్థానిక వైసీపీ నాయకులకు మధ్య వివాదం నడుస్తోంది.
వైసీపీ నాయకుల వేధింపులు భరించలేక సోమేశ్వరరావు పురుగుల మందు తాగి ఈ ఏడాది సెప్టెంబర్ 9న చనిపోయాడు. అచ్చియ్యమ్మకు చెందిన రెండు సెంట్లను వుడా లేఅవుట్లో ఖాళీ స్థలంగా గుర్తించామని, 15 రోజుల్లో దాన్ని ఖాళీ చేయాలని ముదపాక పంచాయతీ కార్యదర్శి కె.నాగప్రభు ఈ నెల 2న నోటీసులు జారీ చేశారు. అప్పటి నుంచి అచ్చియ్యమ్మ తీవ్ర మనోవేదనకు లోనయ్యింది. సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఎంతకూ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల వెతికారు. వారి నివాసానికి సమీపంలోని వ్యవసాయ బావిలో ఆమె మృతదేహాన్ని గుర్తించారు.
ఈ మేరకు సమాచారం అందుకున్న పెందుర్తి సిఐ గొలగాని అప్పారావు, ఎస్సై రాంబాబు, సిబ్బంది అర్ధరాత్రి ఒంటి గంటకు గోవిందపురం చేరుకున్నారు. బావిలో నీరు అధికంగా ఉండటంతో మోటార్లతో మంగళవారం ఉదయం 6:30 గంటలకు అగ్నిమాపక సిబ్బంది సహకారంతో అచ్చియ్యమ్మ మృతదేహాన్ని బయటకు తీయించారు.