తన కొడుకును ప్రేమించిందని, తల్లి అమానుషం.. యువతిపై రాడ్ తో దాడి.. !

By AN TeluguFirst Published Aug 16, 2021, 12:52 PM IST
Highlights

ఓ తల్లి కొడుకుతో వివాహం జరిపిస్తామని, ఈ విషయంపై మాట్లాడకోవడానికి ఇంటికి రావాలని కొడుకు ప్రేమించిన యువతిని  పిలిచి దాడి చేసింది. ఈ ఘటనలో ప్రేమికురాలు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

కరీంనగర్ : కొడుకు మీద ప్రేమ ఆ తల్లిని విచక్షణ మరిచిపోయేలా చేసింది. కొడుకు ఇష్టాయిష్టాలు పట్టించుకోకుండా ఆ తల్లిదండ్రులు చేసిన పని చివరికి తల్లిని కటకటాల పాలయ్యేలా చేసింది. పరువు కోసం పాకులాడి చివరికి కన్న కొడుకుకు దూరమై... సమాజం దృష్టిలో నేరస్తులుగా మారాల్సి వచ్చింది. ఈ దారుణ ఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగు చూసింది. 

ఓ తల్లి కొడుకుతో వివాహం జరిపిస్తామని, ఈ విషయంపై మాట్లాడకోవడానికి ఇంటికి రావాలని కొడుకు ప్రేమించిన యువతిని  పిలిచి దాడి చేసింది. ఈ ఘటనలో ప్రేమికురాలు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతోంది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

స్థానికుల కథనం ప్రకారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని..  అరవింద్ నగర్ కు చెందిన సాప భరత్ చంద్ర (26), మోడీ బజార్ కు చెందిన బోగని శ్రావణి (21) నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. శ్రావణి డిగ్రీ చదువుతుండగా,  భరత్ చంద్ర సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు.  

అయితే, భరత్ చంద్ర ప్రేమ విషయం తెలిసినా.. తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. అంతేకాదు వేరే యువతితో అతనికి వివాహం జరిపేందుకు నిశ్చయించారు. ఇటీవల నిశ్చితార్థం కూడా జరిపించారు. ఈ నెల 27న వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. దీంతో, నచ్చని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక భరత్ చంద్ర శ్రావణి తో కలిసి ఈ నెల 9న ఇంట్లో ఎవరికీ చెప్పకుండా ఎటో వెళ్లిపోయారు.

ఈ ఘటనతో షాక్ అయిన తల్లిదండ్రులు భరత్ చంద్రకు  ఫోన్ చేశారు. అతను రావడానికి, వారు కుదిర్చిన పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడకపోవడంతో.. ప్రేమించిన యువతితోనే వివాహం జరిపిస్తామని నమ్మించారు. తల్లిదండ్రుల మాటలు నమ్మిన భరత్ చంద్ర, శ్రావణితో కలిసి ఇంటికి వచ్చాడు. 

అయితే, శ్రావణితో తన కుమారుడి పెళ్లి చేయడం ఇష్టం లేని తల్లి అరుణ.. ఇనుప రాడ్ తో శ్రావణి తలపై దాడి చేసింది. అనుకోని ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ శ్రావణి అరుచుకుంటూ ఇంట్లోంచి బయటకు పరిగెత్తుకొచ్చింది. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఆమెను 108 లో జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  

ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో అక్కడినుంచి కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం శ్రావణి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది.  కాగా,   శ్రావణి తల్లిదండ్రులు ఆమె చిన్నతనంలోనే చనిపోయారు. తన అన్న వదిన ల వద్ద ఆమె ఉంటుంది.

click me!