రూ.1.7 కోట్ల పరిహారం ఇప్పించండి.. హైదరాబాద్ మెట్రోపై హైకోర్టును ఆశ్రయించిన మహిళ

By Sumanth KanukulaFirst Published Sep 18, 2022, 1:14 PM IST
Highlights

హైదరాబాద్‌ మెట్రోపై ఓ మహిళ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మెట్రో పనుల సందర్భంగా జరిగిన ప్రమాదంలో తలకు గాయం కావడంతో అన్నివిధాలా నష్టపోయిన తనకు రూ.  1.7 కోట్ల పరిహారం ఇచ్చేలా ఆదేశాలివ్వాలని కోరారు. 

హైదరాబాద్‌ మెట్రోపై ఓ మహిళ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మెట్రో పనుల సందర్భంగా జరిగిన ప్రమాదంలో తలకు గాయం కావడంతో అన్నివిధాలా నష్టపోయిన తనకు రూ.  1.7 కోట్ల పరిహారం ఇచ్చేలా ఆదేశాలివ్వాలని కోరారు. రెయిన్‌ బజార్‌కు చెందిన ఉజ్మా హఫీజ్‌ పిటిషన్‌ వేశారు. వివరాలు.. 2017 మార్చి 11న తన భర్తతో కలిసి వెళ్తుండగా నాంపల్లి మెట్రో స్టేషన్‌ కారిడార్‌లో తలపై భారీ ఇనుప రాడ్డు పడిందని ఉజ్మా హఫీజ్ చెప్పారు. అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందినట్టుగా చెప్పారు.

‘‘ఈ ఘటనపై నాంపల్లి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐదు రోజుల పాటు కోమాలో ఉన్నాను. ఆ తర్వాత ఆపరేషన్ చేయించుకున్నాను. ఈ గాయం వల్ల తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఏర్పడ్డాయి’’అని పిటిషన్‌లో పేర్కొన్నారు. డిశ్చార్జ్ అయిన తర్వాత అనేక సమస్యలు వేధిస్తున్నాయని తెలిపారు. దృష్టిలోపం, మతిమరుపు వంటి సమస్యలతో బాధపడుతున్నట్టుగా చెప్పారు. తనకు వైద్యం, ఇతర ఖర్చులను ఇప్పించి ఆదుకోవాలని కోరారు. ఇదే విషయంపై హైదరాబాద్ మెట్రో రైలు లిమిటెడ్‌ను పలుమార్లు ఆశ్రయించిన ఫలితం లేదని పేర్కొన్నారు. ఈ విషయంలో వారికి బాధ్యత లేదని ఎల్ అండ్ టీ చూసుకోవాలని హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్  చెప్పిందన్నారు. ఈ క్రమంలోనే హైకోర్టును ఆశ్రయించినట్టుగా చెప్పారు. 

ఈ పిటిషన్‌పై జస్టిస్ టి వినోద్ కుమార్ ధర్మాసనం విచారణ చేపట్టింది. వాదనలు విన్న అనంతరం..  మున్సిపల్‌ శాఖ, హెచ్‌ఎంఆర్‌ఎల్‌, ఎల్‌అండ్‌టీ మెట్రో రైల్‌ లిమిటెడ్‌కు ధర్మాసం నోటీసులు జారీచేసింది. తదుపరి విచారణను అక్టోబర్ 13కు వాయిదా వేసింది.  

click me!