ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అధికార బీఆర్ఎస పార్టీ నాయకుల పాత్ర ఉంటుందని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. ఈ వ్యవహారంపై ఆయన డీజీపికి ఫిర్యాదు చేశారు.
Phone Tapping Case: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ కేసు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నది. ఇందులో ఉన్నత అధికారులు సహా పలువురు రాజకీయ నాయకుల పాత్ర ఉన్నట్టుగా కూడా ఆరోపణలు వస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి టార్గెట్‌గానూ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు ఆరోపణలు రావడంతో అధికార కాంగ్రెస్ పార్టీ ఈ వ్యవహారంపై సీరియస్‌గా ఉన్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకుడు రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ నాయకుల పాత్ర ఉంటుందని రఘునందన్ రావు ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ నాయకుల పాత్ర లేకుండా ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సాధ్యం కాదని పేర్కొన్నారు. రాష్ట్ర డీజీపీకి ఈ వ్యవహారంపై బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నిష్ఫక్షపాతంగా విచారణ జరపాలని విజ్ఞప్తి చేశారు. మునుగోడు బైపోల్ సమయంలోనూ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఆయన ఆరోపించారు. అధికార పార్టీలో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గడ్డం వివేక్‌లు కూడా దీనిపై డీజీపీకి ఫిర్యాదు చేయాలని కోరారు. అధికార నాయకుల ప్రమేయం లేకుండా ట్యాపింగ్ ఎలా సాధ్యపడుతుందని ప్రశ్నించారు.