గజ్వేల్‌ను విడిచి ఎటూ పోను: సీఎం కేసీఆర్.. కామారెడ్డి పరిస్థితి?

By Mahesh K  |  First Published Oct 20, 2023, 7:51 PM IST

సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను గజ్వేల్‌ను విడిచి ఎటూ వెళ్లిపోడని, తన ఇల్లూ ముంగిలి ఇక్కడే ఉన్నాయని, పైగా హైదరాబాద్‌కు చాలా దగ్గర అని కేసీఆర్ అన్నారు. గజ్వేల్ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడుతూ ఆయన సెంటిమెంట్ కామెంట్లు చేశారు. కామారెడ్డి నుంచి పోటీ చేయడానికి ఒక కారణం ఉన్నదని వివరించారు.
 


హైదరాబాద్: సీఎం కేసీఆర్ ఈ రోజు గజ్వేల్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో మాట్లాడారు. మేడ్చల్ జిల్లా అంతాయిపల్లి తూంకుంటలోని కన్వెన్షన్ హాల్‌లో అత్యవసరంగా సమావేశమై కీలక వ్యాఖ్యలు చేశారు. గజ్వేల్‌ వాసులతో సెంటిమెంట్ కామెంట్లు చేశారు. ఈ ఎన్నికల్లో గజ్వేల్, కామారెడ్డి రెండు చోట్లా పోటీ చేస్తున్న కేసీఆర్ గజ్వేల్ పై ప్రత్యేకంగా మమకారాన్ని చూపించుకునేలా ఈ సమావేశంలో మాట్లాడటం గమనార్హం.

గజ్వేల్ తనను రెండు సార్లు కడపులో పెట్టుకుని గెలిపించిందని, గజ్వేల్ రుణం ఇంకా తీరలేదని కేసీఆర్ అన్నారు. ఇప్పుడున్న అభివృద్ధితోనే సంతృప్తి చెందవద్దని, ఇంకా అభివృద్ధి చేస్తానని, గజ్వేల్‌ను రాష్ట్రానికే తలమానికంగా మారుస్తానని వివరించారు. వచ్చేది మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, గెలిచిన తర్వాత ఇదే కన్వెన్షన్ హాల్‌లో మరోసారి సమావేశం అవుదామని ధీమా వ్యక్తం చేశారు. గెలిచిన తర్వాత ప్రతి నెలలో ఒక రోజు గజ్వేల్ నియోజకవర్గంలో ఉండి ఇక్కడి ప్రజలతో గడుపుతూ అభివృద్ధి పనులను సమీక్షిస్తానని కేసీఆర్ చెప్పారు. 

Latest Videos

undefined

ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ 95 నుంచి 105 సీట్లు గెలుచుకోవడం ఖాయం అని కేసీఆర్ వివరించారు. గజ్వేల్‌లో గెలుపు లాంఛనమే అయినా.. ఎంత మెజార్టీ అనేది మీ దయ అంటూ కార్యకర్తలను ఉద్దేశించి తెలిపారు. కొండ పోచమ్మ సాగర్, మల్లన్నసాగర్ ప్రాజెక్టు కింద భూమి కోల్పోయిన నిర్వాసితుల సమస్యలను పరిష్కరిస్తానని సీఎం హామీ ఇచ్చారు. 

ఈ సారి సీఎం కేసీఆర్ రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిదే. ఇదే తరుణంలో గజ్వేల్ నియోజకవర్గంలో నేతల మధ్య ముసలం మొదలైనట్టు సమాచారం. దీంతో వెంటనే సీఎం కేసీఆర్ అత్యవసరంగా సమావేశమైనట్టు తెలిసింది. ఇదే సందర్భంలో తాను గజ్వేల్‌ను వీడబోనని హామీ ఇచ్చారు.

Also Read: అమ్మ ఒడిలో రూ. 743 కోట్ల స్కాం.. ఎన్నికల తర్వాత ఈ స్కాంపైనే దర్యాప్తు: జనసేన తీవ్ర ఆరోపణలు

కామారెడ్డిలో పోటీ చేస్తున్నావేంటని తనను అడిగారని, అక్కడ పోటీ చేయడానికి ఒక కారణం ఉన్నదని సీఎం కేసీఆర్ అన్నారు. ఆ కారణం ఏమిటో వివరించలేదు. అయితే.. తాను గజ్వేల్‌ను విడిచిపెట్టబోనని స్పష్టం చేశారు. తన ఇల్లు, ముంగిలి ఇక్కడే ఉన్నదని, హైదరాబాద్‌కు దగ్గర కూడా ఇదేనని వివరించారు. అలాంటిది తాను గజ్వేల్ ఎందుకు విడిచిపెట్టి వెళ్లిపోతానని అన్నారు.

దీంతో గజ్వేల్ వాసులకు సీఎం కేసీఆర్ భరోసానైతే ఇచ్చారు. కానీ, కామారెడ్డి స్థానంలో పోటీ గురించి ప్రశ్నలు వస్తున్నాయి. సీఎం కేసీఆర్ ఈ రెండు స్థానాల్లో గెలిస్తే మాత్రం కామారెడ్డి సీటుకు రాజీనామా చేస్తారనే అభిప్రాయాలు తాజా వ్యాఖ్యలతో వెలువడుతున్నాయి.

click me!