తెలంగాణలో ముందస్తు సంకేతాలు?.. కేసీఆర్ ఆలోచన అదేనా..?

Published : Mar 20, 2022, 11:24 AM IST
తెలంగాణలో ముందస్తు సంకేతాలు?.. కేసీఆర్ ఆలోచన అదేనా..?

సారాంశం

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014 జూన్‌లో సీఎంగా అధికారం చేపట్టిన కేసీఆర్.. ఐదేళ్ల పదవీకాలం పూర్తికాకముందే 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. అయితే ఇప్పుడు మరోమారు మందస్తుకు వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెగ ప్రచారం జరుపుతోంది. 

తెలంగాణలో (Telangana) అధికార టీఆర్‌ఎస్ మరోసారి ముందస్తు ఎన్నికలకు వెళ్తుందా అంటే రాజకీయ విశ్లేషకుల నుంచి అవుననే సమాధానం వినిపిస్తోంది. ముందస్తుకు వెళ్తారనే వార్తలను గులాబీ బాస్ కేసీఆర్ ఖండించినప్పటికీ.. ప్రస్తుత పరిణామాలు చూస్తే ముందస్తు సంకేతాలు కనిపిస్తున్నాయి. కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలు... వేస్తున్న అడుగులు ఆ దిశలో ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు ప్రతిపక్ష పార్టీలు కూడా కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లనున్నారని.. డిసెంబర్‌ నాటికి ఎన్నికలు వస్తాయని చెబుతున్నాయి. పార్టీ కార్యకర్తలు అలర్ట్‌గా ఉండాలని కోరుతున్నాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 2014 జూన్‌లో సీఎంగా అధికారం చేపట్టిన కేసీఆర్.. ఐదేళ్ల పదవీకాలం పూర్తికాకముందే 2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. అలా మందస్తుకు వెళ్లి మంచి ఫలితాలనే సాధించారు. తిరిగి అధికారాన్ని చేపట్టారు. అయితే ఇప్పుడు మరోమారు మందస్తుకు వెళ్లాలని కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెగ ప్రచారం జరుపుతోంది. ప్రస్తుతం టీఆర్‌ఎస్ ప్రభుత్వ పదవీకాలం.. మరో ఏడాదిన్నర ఉన్నప్పటికీ.. ముందస్తుపై ప్రచారం మాత్రం ఆగడం లేదు. కొందరు టీఆర్‌ఎస్ నేతల నోట మందస్తు మాట వినిపించడంతో ఆ ప్రచారానికి మరింత బలం చేకూరుతుంది.     

మందస్తుకు సంకేతాలు..?
సీఎం కేసీఆర్ ఇటీవల కాలంలో తీసుకుంటున్న నిర్ణయాలు.. మందస్తుకు సంకేతాలేనని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 2022-23 వార్షిక బడ్జెట్‌‌లో సంక్షేమానికి పెద్దపీట వేశారు. ముఖ్యంగా హుజురాబాద్ ఎన్నికల సమయంలో తీసుకొచ్చిన దళిత బంధు పథకంపై విపక్షాలు విమర్శలు చేయకుండా ఉండేందుకు.. బడ్జెట్‌లో దళిత బంధుకు రూ. 17,700 కోట్లు కేటాయిస్తున్నట్టుగా తెలిపారు. అంతేకాకుండా సంక్షేమ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున కేటాయింపులు చేశారు. ప్రభుత్వ పదవీ కాలం మరో ఏడాదిన్నరతో ముగియనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు ఇదే టీఆర్‌ఎస్ ప్రభుత్వ  పూర్తిస్థాయి బడ్జెట్ అని చెప్పుకోవాలి. 

80 వేలకు పైగా ఉద్యోగాల భర్తీ ప్రకటన చేయడం ద్వారా.. నిరుద్యోగుల నుంచి సానుకూలతను కూడగట్టే ప్రయత్నం చేశారు కేసీఆర్. అంతేకాకుండా 11 వేల కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరణ చేస్తానని చెప్పడం ద్వారా ఆ కుటుంబాల నుంచి టీఆర్‌ఎస్ మద్దతు ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా ఉపాధి హామీ ఫీల్డ్‌ అసిస్టెంట్లను తిరిగి విధుల్లోకి తీసుకుంటామని, సెర్ప్‌, మెప్మా, ఐకేపీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలు ఇస్తామని చెప్పారు. సొంత భూమిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణానికి రూ. 3 లక్షలు ఇవ్వనున్నట్టుగా బడ్జెట్‌లో చెప్పారు. ఈ రకంగా కేసీఆర్.. వివిధ వర్గాలకు వరాలు ఇచ్చారు. 

మరోవైపు రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై కేసీఆర్ సర్వేలు చేస్తున్నారు. ఇప్పటికే పలు అంశాలపై రాజకీయ వ్యుహాకర్త ప్రశాంత్ కిషోర్ బృందం చేసిన సర్వే రిపోర్టు‌లు కేసీఆర్‌ చేతికి అందినట్టుగా సమాచారం. అంతేకాకుండా మరిన్ని అంశాల వారీగా సర్వే నివేదికలు రావాల్సి ఉందని తెలుస్తోంది. వీటి ఆధారంగా కేసీఆర్ ప్రస్తుత రాజకీయ పరిణామాలను అంచనా వేస్తూ ముందుకు సాగుతారనే ప్రచారం సాగుతుంది. 

రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి రోజురోజుకు దిగజారగడం.. క్షేత్ర స్థాయిలో క్యాడర్ ఉన్న రాష్ట్ర స్థాయి నాయకత్వంలో విభేదాలు తమకు కలిసివచ్చే అంశమని కేసీఆర్‌ భావిస్తున్నారు. అంతేకాకుండా బీజేపీ, కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల మధ్య త్రిముఖ పోరు ఉంటే అది తమకు లాభిస్తుందనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విపక్షాలు పుంజుకోవడానికి ఏ మాత్రం సమయం ఇవ్వకుండా తమ ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింతగా వివరించి.. పార్టీ ముఖ్య నాయకులు ప్రజల్లో ఉంటూ ఈ ఏడాదే ముందస్తుకు వెళ్లాలనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. 

బీజేపీ ఫోకస్ తెలంగాణపై లేకుండా..?
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో విజయం సాధించిన బీజేపీ.. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని యోచిస్తోంది. గుజరాత్‌లో ప్రస్తుత ప్రభుత్వ పదవీకాలం వచ్చే ఏడాది ఫిబ్రవరి వరకు ఉన్నప్పటికీ ఈ ఏడాది డిసెంబర్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. 2022 నవంబర్‌లో హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలకు ఒకేసారి అసెంబ్లీ ఎన్నికలు నిర్వహిస్తారనే టాక్ వినిపిస్తోంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు 2022 జులై లేదా సెప్టెంబరులోనే ఉండవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

గుజరాత్ ఎన్నికలతో పాటు హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు కూడా ముందస్తుగా జరిగితే బీజేపీ అగ్ర నాయకత్వం ఆయా రాష్ట్రాల్లో ప్రచారాన్ని ముమ్మరం చేస్తుంది. ఆ రాష్ట్రాలతో పాటు తెలంగాణా అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరిగినట్టయితే.. బీజేపీ అగ్రనేతలు తెలంగాణపై పూర్తిగా దృష్టి సారించలేకపోవచ్చు. ముఖ్యంగా ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో అధికారాన్ని నిలబెట్టుకోవడంపై బీజేపీ అగ్రనేతలు ఎక్కువ ఆసక్తి చూపుతాయని.. టీఆర్‌ఎస్ శ్రేణులు భావిస్తున్నాయి.

ఇక, రాష్ట్రంలో కాంగ్రెస్ చాలా బలహీనంగా ఉన్నందున.. ముందస్తు ఎన్నికలకు వెళ్లడం వల్ల రాష్ట్రంలో బలమైన శక్తిగా ఎదగాలనే ఆ పార్టీ ప్రణాళికలను అడ్డుకునే అవకాశం ఉందని టీఆర్‌ఎస్ వర్గాలు భావిస్తున్నాయి. కర్ణాటకలోని బీజేపీ నాయకత్వం కూడా ముందస్తు అసెంబ్లీ ఎన్నికలకు మొగ్గు చూపవచ్చని టీఆర్‌ఎస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ఈసారి కూడా ముందస్తు అసెంబ్లీ ఎన్నికలను ఎంచుకుని.. 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి కేంద్రీకరించవచ్చని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. గత కొంతకాలంగా కేంద్రంపై మాటల యుద్దం చేస్తున్న కేసీఆర్.. దేశాన్ని బాగుచేసుకోవడం కోసం తాను జాతీయ రాజకీయాల్లోకి వెళ్తున్నట్టుగా చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే మరోసారి తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై కేసీఆర్ ఢిల్లీ వేదికగా పోరాడేందుకు పార్టీ శ్రేణులను సిద్దం చేస్తున్నారు.  యాసంగి ధాన్యం మొత్తాన్ని కేం ద్రం కొనుగోలు చేయాల్సిందేనన్న డిమాండ్‌తో ఆందోళనలకు దిగాలని నిర్ణయించారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

కేసీఆర్ చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు: Palamuru Lift Irrigation Project | Asianet News Telugu
Top 10 Law Colleges in India : ఈ హైదరాబాద్ లా కాలేజీలో చదివితే.. సుప్రీం, హైకోర్టుల్లో లాయర్ పక్కా