టీఆర్ఎస్ పార్టీలో (TRS Party) కేసీఆర్‌ను (KCR) ప్రశ్నించే.. కనీసం సలహాలు ఇచ్చే నేతలే లేరంటే అతిశయోక్తి కాదు. అలా కర్త, కర్మ, క్రియ అన్నీ తానై అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు కేసీఆర్. కానీ గత కొద్ది రోజులుగా కేసీఆర్ వైఖరిలో మార్పు కనిపిస్తుంది.
తెలంగాణ (Telangana) ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన నాటి నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) పాలనలో తనదైన ముద్ర వేస్తూనే వచ్చారు. ఆయన చెప్పిందే తెలంగాణలో శాసనంగా మారిపోయింది. మంత్రులు, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు.. కేసీఆర్ తీసుకున్న నిర్ణయానికి కట్టుబడాల్సిందే. గులాబీ పార్టీలో కేసీఆర్‌ను ప్రశ్నించే.. కనీసం సలహాలు ఇచ్చే నేతలే లేరంటే అతిశయోక్తి కాదు. అలా కర్త, కర్మ, క్రియ అన్నీ తానై అటు పార్టీని, ఇటు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు కేసీఆర్. 2014 అసెంబ్లీ ఎన్నికలతో (assembly election) పోలిస్తే.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ బలం పుంజుకుంది. ఇతర పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు కూడా టీఆర్‌ఎస్‌లో చేరారు. ప్రతిపక్షాలు ఎన్ని పోరాటాలు చేసిన కేసీఆర్ స్పందించిన సందర్భాలు చాలా అరుదనే చెప్పాలి.
అయితే గత కొద్ది రోజులుగా కేసీఆర్ వైఖరిలో మార్పు కనిపిస్తుంది. గతంలో ముఖ్యమంత్రిని ఎన్నుకునే సందర్భాల్లో ఆయా పార్టీలు క్యాంపు రాజకీయాలు (camp politics) చేయడం చూసే వాళ్లము. అయితే ఇప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఓ పార్టీ.. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎంపీటీసీ, జెడ్పీటీసీలను క్యాంపులకు తరలించడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో స్థానిక ప్రజాప్రతినిధులలో 90 శాతం టీఆర్‌ఎస్ వాళ్లే. మరి అలాంటి అప్పుడు కేసీఆర్.. ఈ క్యాంపు రాజకీయాలు చేయడం విడ్డూరంగా ఉందనే టాక్ వినిపిస్తోంది.
undefined
అయితే ఇటీవల రాజకీయ చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో.. కేసీఆర్ వైఖరిలో మార్పు వచ్చిందని, అందుకే భవిష్యత్తులో ఇబ్బంది పడకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇందుకు వారు పలు అంశాలను కూడా గుర్తుచేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు ఏ ఫ్లైట్ ఎక్కితే అది ఎయిర్ ఫోర్స్ 1 అన్నట్టు.. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తాను ఎక్కడుంటే అదే సెక్రటేరియట్ అనేవారు. అలాంటిది ఇప్పుడు కేసీఆర్ ప్రగతి భవన్ గేట్లు దాటి.. ధర్నా చౌక్‌లో కూర్చొన్నారు. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్ ధర్నాకు కూర్చొవడం అంటే చిన్న విషయం కాదనే చెప్పాలి.
ఇక, కేసీఆర్ ఏదైనా నిర్ణయం తీసుకున్న తర్వాత.. మంత్రులకు, పార్టీ ప్రజా ప్రతినిధులకు తెలియజేస్తారనే టాక్ ఉంది. అంతేకాకుండా.. కేసీఆర్ పిలిస్తే తప్ప మంత్రులకు, ఎమ్మెల్యేలకు ప్రగతి భవన్‌లో అడుగుపెట్టే అవకాశం ఉండేది కాదని అంటారు. కేసీఆర్‌ను కలిసేందుకు వెళ్లిన తమకు పలు సందర్భాల్లో నిరాశే మిగిలిందని.. ప్రగతిభవన్‌లో అనుమతించలేదని టీఆర్‌ఎస్‌ను పలువురు ముఖ్య నేతలు చెప్పిన మాటలు ఇవి. ఇటీవల టీఆర్‌ఎస్ నుంచి బయటకు వచ్చిన ఈటల రాజేందర్ కూడా ఇదే విషయాన్ని మీడియా ముందు వెల్లడించారు.
కానీ ఇప్పుడు ఆ పరిస్థితుల్లో పూర్తిగా మార్పు కనిపిస్తుంది. కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్యేలకు కొంత ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా కనిపిస్తోంది. ముఖ్యంగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక విషయంలో ఆయన పార్టీ ముఖ్య నేతలతో చర్చలు జరిపారనే వార్తలు కూడా వచ్చాయి. అంతేకాకుండా ఎమ్మెల్సీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టీఆర్‌ఎస్‌ఎల్పీ మీటింగ్ ఏర్పాటు చేయడం ద్వారా తాను నేతలకు ఇంపార్టెన్స్ ఇస్తున్నారనే అంశాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు.
మరోవైపు కేటీఆర్‌లో కూడా మార్పు కనిపిస్తుంది. ఆయన గతంలో కింది స్థాయి అధికారులతో ముచ్చటించడం చాలా అరుదుగా జరిగేది. కానీ ఈ మధ్య కానిస్టేబుల్ స్థాయి వారిని కూడా కేటీఆర్ నవ్వుతూ పలకరించడం గమనించవచ్చు. అయితే మొత్తంగా కేసీఆర్ జాగ్రత్త పడటం మొదలైందనే టాక్ వినిపిస్తుంది. ఎందుకంటే ఇటీవల దుబ్బాక, హుజురాబాద్‌లో ఓటమి, హైదరాబాద్‌లో బీజేపీ నుంచి గట్టి పోటీ ఇవ్వడం.. టీఆర్‌ఎస్‌కు ఇబ్బందికర పరిస్థితులుగా మారాయి.
ఈ క్రమంలోనే బీజేపీని ఎదుర్కొవడం చాలా కష్టమైన పని కేసీఆర్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. కేవలం సంక్షేమ పథకాలు, డబ్బు మాత్రమే ఎన్నికల్లో గెలిపించలేవు అని హుజురాబాద్ ఉప ఎన్నికతో కేసీఆర్‌కు బోధపడి ఉంటుందనే చర్చ విస్తృతంగా సాగుతుంది. ఇదిలా ఉంటే సోషల్ మీడియాను సమర్ధవంతంగా వినియోగించడంలో బీజేపీ టాప్ ప్లేస్‌లో ఉంటుందని పలు సందర్భాల్లో రుజువైంది. వారి ఎన్నికల మెషినరీ కూడా చాలా సమర్ధవంతమైనది. ఈ క్రమంలోనే కేసీఆర్ చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది.
అందుకే ధాన్యం కొనుగోళ్ల విషయంలో తెలంగాణ ప్రజానీకం ముందు కేంద్రంలోని బీజేపీని దోషిగా నిలబెట్టాలని కేసీఆర్ చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన వరుసగా మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి కేంద్రం వైఖరిని ప్రశ్నించడం, ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ వద్దన్న కేసీఆర్.. ఇప్పుడు అక్కడే కూర్చొని ధర్నాలో పాల్గొనడం చేశారు. అంతేకాకుండా కేంద్రం నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా పోరాటంలో ప్రాణాల కోల్పోయిన వారి సాయం అందిస్తానని ప్రకటించడం వంటివి చేయడం ద్వారా రైతుల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార పార్టీ ఇన్ని జాగ్రత్తలా..?
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో (local body mlc elections) టీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుపొందడం ఖాయమనే టాక్ ఉంది. ఎందుకంటే ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకునే స్థానిక ప్రజాప్రతినిధులలో 90 శాతం మంది ఆ పార్టీకి చెందినవారే. దీంతో టీఆర్‌ఎస్ అభ్యర్థుల గెలుపు నల్లేరుపై నడకే. అయితే గులాబీ పార్టీ అధిష్టానం మాత్రం ఈ ఎన్నికల పట్ల చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు గాను టీఆర్‌ఎస్ తరఫున భానుప్రసాద్, ఎల్ రమణ నామినేషన్లు దాఖలు చేశారు.
అయితే ఇక్కడ 1300కు పైగా ఉన్న స్థానిక ప్రజాప్రతినిధులు ఓటర్లుగా ఉన్నారు. వీరిలో 1,000కి పైగానే టీఆర్‌ఎస్‌కు చెందినవారే. కాంగ్రెస్, బీజేపీలు ఇక్కడ పోటీకి దూరంగానే ఉన్నాయి. అయితే కరీంనగర్ మాజీ మేయర్ రవీందర్ సింగ్, టీఆర్‌ఎస్‌కే ఒకరిద్దరు నేతలు.. పలువురు స్వతంత్ర అభ్యర్థులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు.
ఇది కాస్తా టీఆర్‌ఎస్‌కు ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఎలాంటి చాన్స్ తీసుకోవద్దని టీఆర్‌ఎస్ అధిష్టానం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మంత్రులు గంగుల కమలాకర్, కేటీఆర్, కొప్పుల ఈశ్వర్‌లు ఎన్నికల సరళని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూనే ఉన్నారు. పార్టీ ముఖ్య నాయకులకు పలు సూచనలు చేస్తున్నారు. పోటీలో నిలిచిన అభ్యర్థులను నామినేషన్ విత్ డ్రా చేయించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు.
ఇదిలా ఉంటే స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులను టీఆర్ఎస్ పార్టీ క్యాంపులకు తరలించింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సుల్లో వీరంతా వెళ్లిపోయారు. హైదరాబాద్ శివార్లలోని ఓ రిసార్ట్‌లో వీరికి క్యాంప్ ఏర్పాటు చేశారు. నాలుగు రోజుల పాటు అక్కడే ఈ క్యాంపు ఉండనుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన ఈ క్యాంపులో సుమారు 850 మంది ప్రజా ప్రతినిధులు బయలు దేరి వెళ్లారు. మిగతా 146 మందిని రెండు మూడు రోజుల్లో తరలించేందుకు రంగం సిద్దం చేశారు.
ఒక వేళ పోటీలో ఉన్న వారంతా తప్పుకున్నట్టయితే క్యాంపును 26 సాయంత్రంతో క్లోజ్ చేసి తిరిగి వారి ఇళ్లకు పంపించనున్నారు. లేనట్టయితే యథావిధిగా పోలింగ్ జరిగే నాటి వరకు క్యాంపును కొనసాగించనున్నారు. అయితే క్యాంప్‌కు తరలివెళ్లిన లీడర్లు క్యాంపులో చేరుకున్న తరువాత ఫోన్లు వినియోగించవద్దన్న కండీషన్ కూడా పెట్టినట్టు తెలుస్తోంది.