ఇతర రాష్ట్రాల కంటే తక్కువ పరీక్షలెందుకు?: సీఎస్‌పై హైకోర్టు ప్రశ్నల వర్షం

By narsimha lodeFirst Published Jul 28, 2020, 2:27 PM IST
Highlights

తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయడం లేదని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది.

హైదరాబాద్: తమ ఆదేశాలను ఎందుకు అమలు చేయడం లేదని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది.

కరోనా హెల్త్ బులిటెన్, పరిస్థితులపై తెలంగాణ హైకోర్టు మంగళవారం నాడు విచారించింది. తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, జీహెచ్ఎంసీ కమిషనర్, వైద్యాధికారులు హైకోర్టుకు ఇవాళ హాజరయ్యారు.

తెలంగాణ సీఎస్ సోమేష్ కుమార్ పై ప్రశ్నల వర్షం కురిపించింది హైకోర్టు. ఈ ప్రశ్నలపై సీఎస్ సోమేష్ కుమార్ సమాధానం చెప్పారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై హైకోర్టుకు సీఎస్ వివరించారు. 

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో తక్కువ పరీక్షలు ఎందుకు నిర్వహిస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది.మారుమూల జిల్లాల్లో కరోనాతో చాలా మంది చనిపోతున్న విషయాన్ని కోర్టు ప్రస్తావించింది.

ప్రభుత్వాసుపత్రుల్లో సౌకర్యాలతో పాటు ఆక్సిజన్ అందక ఎనిమిది మంది మృతి చెందిన విషయాన్ని కోర్టు ఈ సందర్భంగా గుర్తు చేసింది. హెల్త్ బులెటిన్లలో తప్పుడు సమాచారం ఇస్తున్నారని వార్తలు వస్తున్నాయని కూడ హైకోర్టు తెలిపింది.గాంధీ ఆసుపత్రిలో కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారా లేదా అని కూడ హైకోర్టు ప్రశ్నించింది. 

also read:కరోనా బులిటెన్‌పై అసంతృప్తి: హైకోర్టు ముందు హాజరైన సీఎస్, వైద్యాధికారులు

రాష్ట్రంలో కరోనా పరీక్షలను క్రమంగా పెంచుకొంటూ పోతున్నామని సీఎస్ సోమేష్ కుమార్ హైకోర్టుకు తెలిపారు. ప్రతి బెడ్ కు ఆక్సిజన్ అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన వివరించారు. కేంద్రం మార్గదర్శకాలు ఎప్పటికప్పుడు మారిపోతున్నాయని ఆయన హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 

హైకోర్టు ఆదేశాలను అత్యంత ప్రాధాన్యతగా పరిగణించి అమలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ ఆదేశాలు అమలు చేసేందుకు ఎంత సమయం కావాలని కోర్టు సీఎస్ ను ప్రశ్నించింది. కరోనా నియంత్రణకు అధికార యంత్రాంగం శక్తివంచన లేకుండా పనిచేస్తోందని... ఈ విషయాన్ని అర్ధం చేసుకోవాలని ఆయన కోర్టును కోరారు.

రాష్ట్రంలో 2 లక్షల ర్యాపిడ్ కిట్ల వాడకంలో ఉన్నాయి. మరో 4 లక్షల కిట్లు ఆర్డర్ చేసినట్టుగా  సీఎస్ చెప్పారు. రాజస్థాన్ లో ర్యాపిడ్ కిట్ల వాడకం ఇప్పటికే ఆపేసిన విషయాన్ని హైకోర్టు సీఎస్ కు తెలిపింది. ర్యాపిడ్ కిట్ల వాడకంపై నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలని సీఎస్ కు సూచించింది హైకోర్టు.

ఎంఆర్ఐ, సిటీ స్కాన్  చార్జీలపై ప్రైవేట్ ఆసుపత్రులతో చర్చిస్తున్నామని సీఎస్ హైకోర్టుకు తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రుల ఆగడాలపై ఇప్పటికే 726 ఫిర్యాదులు అందినట్టుగా సీఎస్ చెప్పారు. వీటిపై ఏం చర్యలు తీసుకొన్నారని  హైకోర్టు ప్రశ్నించింది. ఈ కేసు విచారణను ఆగష్టు 13వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.
 

click me!