హుస్నాబాద్ బీజేపీలో త్రిముఖ పోరు!.. బరిలోకి దిగేది ఎవరు?

By Mahesh KFirst Published Jul 30, 2023, 8:32 PM IST
Highlights

వామపక్షాల ప్రభావం కాస్తో కూస్తో ఇంకా ఉన్న నియోజకవర్గాల్లో హుస్నాబాద్ ఒకటి. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ బీజేపీ గురించి పెద్దగా చర్చ ఏమీ లేదు. కానీ, ఈ సారి బీజేపీ పార్టీ నుంచి ముగ్గురు నేతలు టికెట్ కోసం ఆశిస్తున్నారు. 
 

హైదరాబాద్: మన రాష్ట్రంలో హుస్నాబాద్ ఒక విలక్షణమైన నియోజకవర్గం. ఇక్కడ చారిత్రక పరిస్థితులతోపాటు రాజకీయ, భౌగోళిక అంశాలు ప్రత్యేకమైనవి. ప్రస్తుతం అధికార బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సతీష్ వొడితెల (కెప్టెన్ లక్ష్మీకాంత రావు వారసుడు) ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతకు ముందు కాంగ్రెస్ నుంచి అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి ప్రాతినిధ్యం వహించారు. లెఫ్ట్ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహించిన కొన్ని నియోజకవర్గాల్లో హుస్నాబాద్ ఒకటి(సీపీఐ నుంచి చాడ వెంకట్‌రెడ్డి హుస్నాబాద్‌కు గతంలో ప్రాతినిధ్యం వహించారు). గత ఎన్నికల వరకు ఇక్కడ బీజేపీ అభ్యర్థి గురించి చర్చ లేదు. కానీ, ఈ సారి బీజేపీ అభ్యర్థి గురించి ఇక్కడ ముగ్గురు నేతలు పోటీ పడుతుండటం గమనార్హం.

హుస్నాబాద్ బీజేపీలో త్రిముఖ పోరు నడుస్తున్నది. ఇద్దరు బీజేపీ నేతలు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ కోసం బలంగా ఆశిస్తున్నారు. కాగా, మరొక నేత ప్రస్తుతం బీజేపీ వెలుపలే ఉన్నా.. త్వరలోనే పార్టీలో చేరి టికెట్ పొందాలనే ప్లాన్‌లో ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ ముగ్గురూ టికెట్ కోసం పోటీలో ఉన్నారు.

Latest Videos

కుటుంబ ప్రాబల్యం, కేసీఆర్‌తో ఆ కుటుంబానికి గల సాన్నిహిత్యం దృష్ట్యా వొడితెల సతీష్ కుమార్‌కే బీఆర్ఎస్ టికెట్ ఖాయం అని చెబుతున్నారు. కాంగ్రెస్ నుంచి అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డికి టికెట్ కన్ఫామ్ అనీ తెలుస్తున్నది. అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి కంటే ముందు హుస్నాబాద్ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా బొమ్మ వెంకటేశ్వర్లు ఉన్నారు. కానీ, ఆయన కుమారుడు బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి పార్టీ మారారు. బీజేపీలో చేరారు. దీంతో అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డికి పెద్దగా అడ్డులేదనే చర్చ ఉన్నది. ఇక సీపీఐ నుంచి మళ్లీ చాడ వెంకట్ రెడ్డి ఇక్కడి నుంచి బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. బరిలో బలంగా నిలబడొచ్చు లేదంటే వెనకడుగు వేసే అంచనాలూ ఉన్నాయి.

Also Read: బీజేపీతో బీఆర్ఎస్‌కు పొత్తు.. అందుకే మణిపూర్‌పై కేసీఆర్ మౌనం: కేఏ పాల్

మిగితా పార్టీల గురించి కొంత స్పష్టత ఉన్నప్పటికీ బీజేపీలో మాత్రం ముగ్గురు నేతల మధ్య పోటీ ఉన్నది. జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి, కర్ణకంటి మంజుల రెడ్డి, బొమ్మ శ్రీరామ్ చక్రవర్తిలు ఈ స్థానం నుంచి టికెట్ కోసం ఆశిస్తున్నారు. నియోజకవర్గంలో ఎక్కువగా పర్యటిస్తూ ఆపదలకు బాధిత కుటుంబాలకు బియ్యం పంచడం, యూత్‌ను ఎంగేజ్ చేసుకోవడం వంటి కార్యక్రమాలు జన్నపురెడ్డి సురేందర్ రెడ్డి విరివిగా చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర నేతలతో ఎక్కువగా టచ్‌లోకి వెళ్లుతున్నారు. కర్ణకంటి మంజుల రెడ్డి కూడా ఒక స్వచ్ఛంద సామాజిక కార్యకర్తగా పేరు సంపాదించుకునే పనిలో ఉన్నారు. పలు కార్యక్రమాల్లో పాల్గొని బాధితులకు సహాయ సహకారాలూ అందించారు. యూత్‌ను తన పట్టులో ఉంచుకోవడానికి హుస్నాబాద్‌లో పలుమార్లు క్రికెట్ టోర్నమెంట్లు కూడా నిర్వహించారు. త్వరలోనే ఆమె బీజేపీలోకి చేరి టికెట్ పొందాలనే ప్రణాళికలో ఉన్నట్టు చర్చిస్తున్నారు. బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి కూడా టికెట్ పొందే ప్రయత్నాల్లో ఉన్నారు. అయితే, ఈ ముగ్గురిలో ఎవరికి టికెట్ దక్కుతుందనేది ఇప్పటికైతే సస్పెన్సే. బీజేపీ ఎవరిని ఎంపిక చేసుకుంటుందనేది తెలుసుకోవడానికి మరికొంత వేచి ఉండాల్సిందే.

click me!