జూబ్లీహిల్స్: పొత్తుతో విష్ణు చిత్తవుతారా?

By narsimha lode  |  First Published Oct 2, 2018, 3:55 PM IST

మహాకూటమిలోని పార్టీల మధ్య ఇంకా సర్ధుబాట్లు పూర్తి కాలేదు. గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారాన్ని ప్రారంభించారు


హైదరాబాద్:మహాకూటమిలోని పార్టీల మధ్య ఇంకా సర్ధుబాట్లు పూర్తి కాలేదు. గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ అభ్యర్థి ప్రచారాన్ని ప్రారంభించారు. కానీ, పొత్తు ఫైనల్ కాకపోవడంతో మహాకూటమిలోని పార్టీల మధ్య గందరగోళ వాతావరణం నెలకొంది.

గ్రేటర్ హైద్రాబాద్  పరిధిలోని జూబ్లీహిల్స్  నియోజకవర్గం పరిధిలో బీసీలు, మైనార్టీలు,  ఇతర రాష్ట్రాలకు చెందిన  ఓటర్లు అధికంగా ఉంటారు.  ఈ నియోజకవర్గంలో ఓటర్ల నాడి మాత్రం అంతుపట్టకుండా ఉంటుంది.

Latest Videos

ఓ పార్టీకి చెందిన అభ్యర్థి విజయం సాధిస్తారని  విశ్లేషకులు భావిస్తే ఓటర్లు మరో రకంగా తీర్పు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి. 2009‌లో ఈ స్థానం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున  పి. విష్ణువర్థన్ రెడ్డి, టీడీపీ నుండి ప్రస్తుత టీఆర్ఎస్ ఎమ్మెల్సీ మహ్మద్ సలీం (అప్పుడు సలీం టీడీపీలో ఉండేవాడు) పోటీ చేశాడు. కానీ,  ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్థన్ రెడ్డి విజయం సాధించారు.

2014లో జూబ్లీహిల్స్ స్థానం నుండి టీడీపీ, బీజేపీ అభ్యర్థిగా మాగంటి గోపినాథ్ పోటీ చేశారు.  కాంగ్రెస్ అభ్యర్థిగా విష్ణువర్థన్ రెడ్డి పోటీ చేశారు. ఎంఐఎం నుండి నవీన్ యాదవ్ లు పోటీ చేశారు. అయితే ఈ స్థానం నుండి మాగంటి గోపినాథ్ విజయం సాధించారు. ఏడాదిన్నర క్రితం గోపినాథ్  టీడీపీ నుండి టీఆర్ఎస్‌లో చేరారు.

ఈ ఏడాది సెప్టెంబర్ 6వ తేదీన అసెంబ్లీని రద్దు చేసిన తర్వాత కేసీఆర్ ప్రకటించిన 105 మంది అభ్యర్థుల జాబితాలో గోపినాథ్‌కు కూడ చోటు దక్కింది. దీంతో గోపినాథ్ ఈ దఫా టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాడు.  ఇప్పటికే ఆయన ప్రచారాన్ని ప్రారంభించాడు. నాలుగున్నర ఏళ్ల కాలంలో తాను చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ  ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు.

జూబ్లీహిల్స్ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ మంత్రి పీజేఆర్ తనయుడు విష్ణువర్థన్ రెడ్డి  బరిలో దిగనున్నారు. పార్టీ నాయకత్వం నుండి విష్ణుకు గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు ప్రచారంలో ఉంది.

దీంతో విష్ణు ఇప్పటికే ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ స్థానం తమకు కావాలని టీడీపీ పట్టుబడుతోంది. మహా కూటమి పార్టీల మధ్య పొత్తులు ఫైనల్ అయితే  ఈ విషయమై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.గత ఎన్నికల్లో ఈ స్థానం నుండి తాము విజయం సాధించిన విషయాన్ని టీడీపీ ప్రస్తావిస్తోంది.

గ్రేటర్ పరిధిలోని ఎక్కువ సీట్లను టీడీపీ డిమాండ్ చేస్తోంది. ఈ తరుణంలో ఇప్పటికే కాంగ్రెస్ తరపున విష్ణువర్థన్ రెడ్డి  ప్రచారం నిర్వహిస్తున్నారు.  ఈ పరిణామాలు కూడ ఈ రెండు పార్టీల క్యాడర్‌లో గందరగోళానికి తావిస్తున్నాయి.

ఈ స్థానంలో  ఇతర రాష్ట్రాలకు చెందిన ఓటర్లు కూడ ఎక్కువగానే ఉంటారు. అంతేకాదు సెటిలర్ల ప్రభావం కూడ అధికంగానే ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ తరుణంలో ఈ స్థానాన్ని తమకు ఇవ్వాలని టీడీపీ కోరుతోంది. ప్రదీప్ చౌదరి, ఆనూషారామ్‌లతో పాటు మరికొందరు  ఈ స్థానం నుండి టీడీపీ అభ్యర్ధిగా బరిలోకి దిగాలని భావిస్తున్నారు.

click me!