
మాజీ సీఎం కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలిసారి నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో కరెంట్ కోతలు మొదలయ్యాయని అన్నారు. ఏకంగా అసెంబ్లీకి కూడా జెనరేటర్ తెచ్చిన మహానుభావులు వీళ్లు అని తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇప్పుడు ఇవే మాటలు మరోసారి చర్చకు వచ్చాయి. ఏకంగా మంత్రి సీతక్క పాల్గొని మాట్లాడుతున్న మీటింగ్‌లో కరెంట్ కట్ అయింది. సుమారు 20 నిమిషాల పాటు ఆ సమావేశం కరెంట్ లేకుండానే సాగింది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ ఆడిటోరియంలో ఆదివారం ఓ కార్యక్రమం నిర్వహించారు. ఉద్యమకారుల ఆకాంక్షల వేదిక అనే కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల వైపు నుంచి ప్రభుత్వానికి కొన్ని ప్రతిపాదనలు చేశారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో ఎఫ్ఐఆర్ నమోదు కాని ఉద్యమకారులు కూడా చాలా మంది ఉన్నారని వారు చెప్పారు. అలాంటి వారిని కూడా ఉద్యమకారులుగా గుర్తించాలని కోరారు.
Also Read : Madhya Pradesh: కమల్ నాథ్ బీజేపీకి వెళ్లడం లేదా? కాంగ్రెస్ పార్టీ ఏమంటున్నది?
ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క మాట్లాడుతుండగా కరెంట్ పోయింది. దీంతో సభ ఒక్కసారిగా గందరగోళంలో పడింది. ఆమె అక్కడే ఏర్పాటు చేసిన తక్కువపాటి కాంతిలో ప్రసంగాన్ని కొనసాగించారు. సుమారు పావు గంట సేపు కరెంట్ రాలేదు. దీంతో మంత్రి అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. చివరిలో కరెంట్ వచ్చింది. అందరూ చప్పట్లు కొట్టారు.
ఉద్యమకారుల తరఫున తన వద్దకు వచ్చిన ప్రతిపాదనలను సీఎం రేవంత్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లుతానని మంత్రి సీతక్క ఈ కార్యక్రమంలో హామీ ఇచ్చారు.