వ్యవసాయానికి 24 గంటల పాటు ఎక్కడా కూడ విద్యుత్ సరఫరా చేయడం లేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.
హైదరాబాద్: తెలంగాణలో ఎక్కడా కూడ వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ సరఫరా చేయడం లేదని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. ఈ విషయాన్ని తాను నిరూపించేందుకు సిద్దంగా ఉన్నానని ఆయన చెప్పారు.
గురువారంనాడు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నల్గొండలో మీడియాతో మాట్లాడారు. నల్గొండ మండలంలోని అప్పాజీపేట సబ్ స్టేషన్ కు వస్తే వ్యవసాయానికి 24 గంటలపాటు విద్యుత్ సరఫరా చేయడం లేదని తాను నిరూపిస్తానని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. హరీష్ రావు వస్తారా, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి వస్తారో రావాలని ఆయన సవాల్ చేశారు.
వచ్చే మూడు మాసాల తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని ఆయన ధీమాను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులుండవన్నారు. అయితే ఈ ఒక్క నెల రోజులైనా ఇతర రాష్ట్రాల నుండి విద్యుత్ కొనుగోలు చేసి రైతుల పంటలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. వ్యవసాయానికి ఆరు నుండి ఏడు గంటల కంటే విద్యుత్ ను సరఫరా చేయడం లేదని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు.విద్యుత్ విషయంలో కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేసే బదులు రైతుల పంటలను కాపాడే విషయమై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సూచించారు.
తెలంగాణలో 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేస్తున్న రాష్ట్రం తెలంగాణ అని బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారాన్ని కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ విషయంలో బీఆర్ఎస్ ప్రకటనలకు ఆచరణకు పొంతన లేదని విమర్శలు చేస్తున్నారన్నారు. ఈ ఏడాది చివరలో తెలంగాణ అసెంబ్లీ కి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా అంశంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మాటల యుద్ధం సాగుతుంది. సమయం వచ్చినప్పుడల్లా అమెరికా టూర్ లో ఉచిత విద్యుత్ విషయమై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలను ప్రస్తావిస్తున్నారు. మరో వైపు బీఆర్ఎస్ నేతలకు కాంగ్రెస్ కౌంటరిస్తుంది.