మంత్రిగా పనిచేసి గెలవలేదు: తుమ్మలపై కందాల సెటైర్లు

By narsimha lode  |  First Published Aug 31, 2023, 12:33 PM IST

మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై  పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి సెటైర్లు వేశారు.  ఓడిపోయిన తుమ్మల నాగేశ్వరరావుకు మంత్రి పదవి ఇవ్వడం  అన్యాయమా అని ప్రశ్నించారు.


హైదరాబాద్: ఐదేళ్లు మంత్రిగా పనిచేసి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో  ఒక్క సీటును కూడ గెలిపించలేకపోయారని  పాలేరు ఎమ్మెల్యే  కందాల ఉపేందర్ రెడ్డి  మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావునుద్దేశించి వ్యాఖ్యానించారు.

గురువారంనాడు హైద్రాబాద్ లో పాలేరు ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.  మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు  తాను కూడ గెలవలేదని ఆయన ఎద్దేవా చేశారు. ఐదేళ్లు మంత్రిగా ఉండి  ఏం చేశారని ఆయన  ప్రశ్నించారు.ఓడిపోయి  ఇంటి వద్ద  ఉన్న తుమ్మల నాగేశ్వరరావును  పిలిచి ఎమ్మెల్సీ, మంత్రి పదవి ఇవ్వడం కేసీఆర్ చేసిన అన్యాయమా అని  ఎమ్మెల్యే  ఉపేందర్ రెడ్డి  ప్రశ్నించారు. ఐదేళ్ల పాటు ఖమ్మం జిల్లాను  చేతిలో పెట్టడం కేసీఆర్ చేసిన అన్యాయమా అని ఆయన అడిగారు.  షర్మిల ఇప్పటివరకు తెలంగాణకు ఏం చేసిందని ఆయన ప్రశ్నించారు. రానున్న రోజుల్లో తెలంగాణకు ఏం చేస్తుందని ఆయన  అడిగారు.

Latest Videos

2018 ఎన్నికల్లో పాలేరు అసెంబ్లీ స్థానంనుండి  కాంగ్రెస్ అభ్యర్ధిగా  కందాల ఉపేందర్ రెడ్డి  పోటీ చేసి  బీఆర్ఎస్ అభ్యర్ధి  తుమ్మల నాగేశ్వరరావుపై విజయం సాధించారు.   ఆ తర్వాత  చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో  కందాల ఉపేందర్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి  బీఆర్ఎస్ లో చేరారు.  ఈ నెల  21న  కేసీఆర్ ప్రకటించిన  బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాలో  కందాల ఉపేందర్ రెడ్డికి  చోటు దక్కింది.  ఇదే స్థానం నుండి తుమ్మల నాగేశ్వరరావు  బీఆర్ఎస్ టిక్కెట్టు ఆశించారు. కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా  ఉన్న తుమ్మల నాగేశ్వరరావుకు కేసీఆర్ మొండిచేయి  చూపారు. దీంతో  తుమ్మల నాగేశ్వరరావు  తీవ్ర అసంతృప్తికి గురయ్యారు.  

బీజేపీ, కాంగ్రెస్ నుండి తుమ్మల నాగేశ్వరరావును  తమ పార్టీల్లో చేరాలని  ఆహ్వానాలు పంపారు. కాంగ్రెస్ లో చేరేందుకు  తుమ్మల నాగేశ్వరరావు మొగ్గు చూపుతున్నారనే  ప్రచారం సాగుతుంది. రెండు మూడు రోజులుగా  జిల్లా వ్యాప్తంగా పలు మండలాలకు చెందిన తుమ్మల నాగేశ్వరరావు అనుచరులు ఆయనతో సమావేశమౌతున్నారు.ప్రజా క్షేత్రంలో ఉండాలని  తుమ్మ ల నాగేశ్వరరావు సూచించారు. మరో వైపు పాలేరు నుండి పోటీ చేస్తానని  అనుచరులకు  తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేసినట్టుగా  సమాచారం. ఈ దిశగా తుమ్మల నాగేశ్వరరావు కూడ కసరత్తు చేసుకుంటున్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలపై  తుమ్మల నాగేశ్వరరావుకు మంచి పట్టుంది. సుదీర్ఘ కాలం పాటు టీడీపీలో కొనసాగిన తుమ్మల నాగేశ్వరరావు  2014 ఎన్నికల తర్వాత టీడీపీకి గుడ్ బై చెప్పారు.  కేసీఆర్ ఆహ్వానం మేరకు  బీఆర్ఎస్ లో చేరారు.  2014లో కేసీఆర్ కేబినెట్ లో రోడ్లు, భవనాల శాఖ మంత్రిగా  పనిచేశారు.  2018లో పాలేరు నుండి  బీఆర్ఎస్ అభ్యర్ధిగా  పోటీ చేసి ఓటమి పాలయ్యాడు.  అప్పటి నుండి తుమ్మల నాగేశ్వరరావుకు కష్టాలు మొదలయ్యాయి. 

also read:ఖమ్మంలో ఎత్తులకు పై ఎత్తులు: తుమ్మలకు బీఆర్ఎస్ కౌంటర్ వ్యూహం

పాలేరు టిక్కెట్టు దక్కక అసంతృప్తితో ఉన్న తుమ్మల నాగేశ్వరరావుకు సీఎం  తన దూతగా  ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావును పంపారు.  ఎన్నికల తర్వాత తుమ్మల నాగేశ్వరరావుకు  కీలక పదవిని అప్పగించనున్నట్టు హామీ ఇచ్చారు.పాలేరు టిక్కెట్టు  దక్కని  తుమ్మల నాగేశ్వరరావు నామా నాగేశ్వరరావు రాయబారంతో   తృప్తి చెందలేదు.

click me!