
తెలంగాణకు సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టి మొదటగా మోసం చేసింది దళితులనే అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. హైదరాబాదులో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహ పనుల పరిశీలన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణ వస్తే దళితుడినే సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్.. గెలిచాక మాట తప్పారని విమర్శించారు. ఈ విషయంపై ప్రజలు నిలదీస్తుంటే.. చర్చను పక్కకి మళ్లిచేందుకు ఒక్కో దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమిని పంపిణీ చేస్తామని మాయ మాటలు చెప్పారని అన్నారు. అయితే ఆ మూడు ఎకరాలు ఇవ్వడం మర్చిపోయి.. వారి పేరు మీద ఉన్న అసైన్డ్ భూములను కూడా సీఎం లాక్కున్నారని ఆరోపించారు. దీనిపై ప్రజలు ప్రశ్నిస్తుంటే.. మళ్లీ ఆ చర్చను పక్కదారి పట్టించేందుకు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పక్కాగా అమలు చేస్తామని చెప్పి.. ఇప్పుడు దానిని కూడా గాలికొదిలేశారని విమర్శించారు.
హుజూరాబాద్ ఎలక్షన్స్ కు ముందు దళితబంధు పథకం పేరుతో దళితులందరికీ 10 లక్షల చొప్పున ఇస్తానని సీఎం మళ్లీ మాయ మాటలు చెప్పారని బండి సంజయ్ అన్నారు. సీఎం మాటలను ఎవరూ నమ్మలేదని, అందుకే హుజూరాబాద్ ప్రజలు కర్రకాల్చి వాత పెట్టారని ఎద్దేవా చేశారని అన్నారు. అయినప్పటికీ నవంబర్ 4వ తేదీ నుంచి దళిత బంధు పథకం అమలు చేసి తీరుతానని ప్రగల్భాలు పలికారని, కానీ ఆ హామీకి ఇప్పటికీ అతీ గతీ లేదని దుయ్యబట్టారు. అవకాశావాదానికి పరాకాష్ట కేసీఆర్ అని అన్నారు. ఆయనను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గుపడతని ఘాటుగా విమర్శించారు.
2016 ఏప్రిల్ 14వ తేదీన అంబేద్కర్ జయంతి రోజు దేశంలో ఎక్కడా లేని విధంగా 125 అడుగులతో అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున ఏర్పాటు చేస్తానని సీఎం ప్రకటించారని బండి సంజయ్ గుర్తు చేశారు. ఏడాది తరువాత దానిని ఆవిష్కరిస్తానని చెప్పిన సీఎం ఇప్పటి వరకు దాని ఊసే తీయలేదని అన్నారు. అప్పటి నుంచి అంబేద్కర్ జయంతి, వర్దంతి కార్యక్రమాలకు కూడా సీఎం వెళ్లలేదని చెప్పారు. అంబేద్కర్ విగ్రహం ఏమైందంటూ తాము ప్రశ్నిస్తే, దళిత, ప్రజా సంఘాల నాయకులు పదేపదే ఒత్తిడి తీసుకురావడంతో 4 ఏళ్ల తరువాత అంటే 2020 సెప్టెంబర్ 17న విగ్రహం కోసం రూ.146 కోట్ల నిధులు విడుదల చేశారని బండి సంజయ్ చెప్పారు. అయినా నేటికీ విగ్రహ పనులు పూర్తికాలేదని అన్నారు. ఈ పనులు అసలు పూర్తవుతాయో లేదో కూడా ఎవరికి తెలియని పరిస్థితి నెలకొందని తెలిపారు.
125 అడుగుల విగ్రహం అని సీఎం కేసీఆర్ చెప్పారని, కానీ ఇక్కడ 45 అడుగులకు మించి విగ్రహం కనిపించడం లేదని ఆయన బండి సంజయ్ విమర్శిచారు. ఏడాదిలో ప్రగతి భవన్ ను సీఎం నిర్మించుకున్నారని అన్నారు. బాగున్న సెక్రటేరియట్ ను కూల్చేసి ప్రజల సొమ్ము రూ.800 ఖర్చు చేస్తూ కొత్త సెక్రటేరియట్ ను కడుతూ పనులు ఎప్పటికప్పుడు సీఎం ఆరా తీస్తున్నారని తెలిపారు. కానీ ఆరేళ్లయినా అంబేద్కర్ విగ్రహ పనులు ఎందుకు పూర్తికాలేదని ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ కు రాజ్యాంగ నిర్మాత పట్ల ఉన్న ప్రేమ ఇంతేనా అని అన్నారు. దళితులంటే సీఎంకు ఎందుకింత చులకన అని ప్రశ్నించారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మార్చాలని సీఎం చెబుతున్నారంటే ఆయన ఎంత వివాదాస్పదుడో అర్థమవుతోందని అన్నారు. రాజ్యాగంలో సీఎం ఒక్క పేజీ కూడా సీఎం మార్చలేరని తెలిపారు. ఇప్పటికైనా అంబేద్కర్ విగ్రహాన్ని త్వరగా పూర్తి చేసి, దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అన్నారు. లేకపోతే బీజేపీ తరుఫున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.