భూపాల్ పల్లి కలెక్టర్ మురళి చెప్పిందాంట్లో తప్పే ముంది?

First Published Mar 26, 2017, 5:11 AM IST
Highlights

"బ్రాహ్మణ,క్షత్రియ,వైశ్యులు మాంసాహారులైనచో వారికి పంచనఖ జంతువుల్లో ముళ్లపంది,కుక్కలను చంపే వరాహము,ఉడుము,కుందేలు,తాబేలు అనే ఐదు మాత్రమే భక్షింపదగినవి."

వాల్మీకి విరచిత రామాయణం...కిష్కిందా కాండము...17వ సర్గము....36,37,38 శ్లోకాలు...

 

చెట్టు చాటు నుండి రాముడు బాణం వదలగా కొనఊపిరితో నేల కూలిన వాలి ఆయనను నువ్వు చేసిన పని ధర్మమా అని ఎన్నో ప్రశ్న లడిగాడు...వాటిలో కొన్ని ఇవి...

 

36.ఆధార్యం చర్మమే సధ్బీ రోమాణ్యస్తి చ వర్జితం

   అభక్ష్యాణి చ మాంసాని త్వద్విధైర్ధర్మ చరాభిః   

 

37.పంచ పంచనఖా భక్ష్యా బ్రహ్మ క్షత్రేణ రాఘవః

   శల్యకః శ్వానిధో గోధా శశః కూర్మశ్చ పంచమః

 

38.చర్మ చాస్థి చ మే రాజన్ న స్పృశంతి మనీషిణః

   అభక్ష్యాణి చ మాంసాని సోహం పంచనఖో హతః 

 

----వీటి అర్ధం....ఓ రఘువీరా! సత్పురుషులకు జింకచర్మం ఆసనాలకు ఉపయోగపడుతుంది కానీ నా చర్మం ఉపయోగపడదు..చమరీ మృగాల కేశాలు చామరాలుగా దైవసేవలకు ఉపయోగపడతాయి కానీ నావి ఉపయోగపడవు...ఏనుగుల ఎముకలు(దంతాలు)లోకానికి ఉపయోగపడినట్టు నావి ఉపయోగపడవు..

 

నీవంటి ధర్మాత్ములకు నా మాంసఖండములు తినుటకు అయోగ్యము... 

 

----- బ్రాహ్మణ,క్షత్రియ,వైశ్యులు మాంసాహారులైనచో వారికి పంచనఖ జంతువుల్లో ముళ్లపంది,కుక్కలను చంపే వరాహము,ఉడుము,కుందేలు,తాబేలు అనే ఐదు మాత్రమే భక్షింపదగినవి--

 

ప్రాజ్ఞులు నా చర్మాన్ని,ఎముకలను తాకనే తాకరు...నేను ఐదు గోళ్ల జంతువునైనా నా మాంసపు ముక్కలు తినుటకు పనికిరావు(తినరానివి)

 

***

 

నిజానికి తొలి మానవుడి ఆహారమే మాంసం...ఆ తర్వాత ఎప్పుడో వ్యవసాయం మొదలుపెట్టారు....

 

మన యజ్ఞయాగాదుల్లో విపరీతమైన జంతుబలి జరిగేది...జంతుబలులేనా?నరమేధాలూ ఉండేవని ఐతరేయ బ్రాహ్మణం లోని హర్శ్చంద్ర,విశ్వామిత్ర కథ ద్వారా తెలుస్తుంది...

 

అహింసను బోధించిన బౌద్ధం లోనూ భిక్షగా మాంసాన్ని స్వీకరించవచ్చు...చివరిరోజుల్లో బుద్ధుడు కుళ్లిన పంది మాంసాన్ని భిక్షగా స్వీకరించాక మహాపరినిర్వాణం చెందాడని ఒక కథనం.

 

మొత్తానికి ఏదో కాలంలో ఏవో కారణాలతో శాకాహారం పవిత్రమన్న భావన వచ్చేసింది...

 

మధ్యయుగాల్లోని హంపిలో జరిగే విజయదశమి వేడుకల్లో వేలాది జంతువులను బలి ఇచ్చేవారు...ఇక మొన్నటివరకూ జాతరలు,ద్యావరల పేర దున్నలను,మేక,పొట్టేలు,కోల్లను బలి ఇచ్చేవారు..ఇవి తగ్గుముఖం పట్టినా చాలాచోట్ల గ్రామదేవతలకు బలులిచ్చే ఆచారం నేటికీ ఉంది...

 

ఇక ఆహారం ఎవరి అలవాట్లు వారివి అని ఊరుకుండే పరిస్థితి లేదు..అన్నిటా ఒక ఆధిపత్య భావజాలమే...

 

శ్రీకాళహస్తి కథలో పూజా విధానం గురించి పాము,ఏనుగు పక్కనోళ్ల పూజ నచ్చక పోట్లాడి చనిపోయిన కథ చదువుతాము....

 

ఇప్పుడు శ్రీశైలంలో లక్షలాదిగా కన్నడిగులు వచ్చి ఉగాది జరుపుతున్నారు...ఈ పండుగ తర్వాత అమ్మవారి కుంభోత్సవాలు మొదలవుతాయి...కొన్ని దశాబ్దాల పూర్వం జంతు బలులు ఇచ్చేవారు...మరి ఇప్పుడో?సాత్విక బలులంటూ వండలాడి గుమ్మడికాయలు పగలగొట్టి కూష్మాండబలి అంటారు...బలికి ప్రతీకగా కుంకుమ,పసుపు పోస్తారు...ఒకప్పుడు బలిపశువుల తలలతో తోరణాలు కట్టే వారేమో!దానికి ప్రతీకగా వేలాది నిమ్మకాయలతో తోరణాలు కడతారు...అన్నపురాశిని కుంభంగా అర్పిస్తారు..

 

ఇక్కడ ఒక ప్రశ్న వస్తుంది...ఆ బలులిచ్చిన వారిది పూజా విధానం కాదా?వాళ్లు హిందువులు కారా?మరి ఈ బ్రాహ్మణీయ ఆధిపత్య భావజాలంతో ఒకరి సంస్కృతిని చిన్నబుచ్చడం కాదా ఇది?

 

ఆధిపత్యం వాళ్లు చూపుతున్నారా లేక వీళ్లు సంస్కృతీకరింపబడి వారిలా అవ్వాలనుకుంటున్నారా?ఎందుకంటే ఈ భావజాలానికి లోనై చౌడమ్మ,సుంకులమ్మ,జంబులమ్మ లాంటి పేర్లనూ చౌడేశ్వరి,సుంకులాపరమేశ్వరి,జంబులాపరమేశ్వరిగా మారుస్తున్నారు..అసలు పేర్లను న్యూనతగా ఎందుకు భావించాల్సి వస్తోంది?

 

ఇక కొందరు మాంసభక్షణ చేసిన కొన్ని ప్రత్యేకదినాల్లో,మాసాల్లో,పండుగలప్పుడు తినరు.మరి తినే ఆహారమూ పాపమనే భావనలు ఎందుకు వచ్చాయి? 

 

ఇంక నయా బ్రాహ్మణత్వం తీసుకున్నవారి ఆవేశం అంతా ఇంతా కాడు..గోమాత,గోమాంస భక్షణ మీద తెగ ఉపన్యాసాలిస్తారు...నిజానికి హైందవంలో నాలుగో వర్ణమైన వీరికి ఒక తరం ముందు వరకు వ్యవసాయం,పాడి ప్రధాన వృత్తి..మరి వీరి తండ్రి,తాతలు ముసలి,వట్టిపోయిన పశువులను అమ్మేవారు కాదా?వాటిని తల్లిదండ్రుల్లా చూసుకుని చనిపోయాక సమాధులు కట్టించారా?అమ్మినప్పుడు అవి ఏ కబేళ్లాకో చేరతాయనే విషయం వారికి తెలియదా?

 

ఈ కొత్త గోరక్షకులంతా నగరాల్లో ఉంటూ కన్నతల్లిదండ్రులనే పట్టించుకోరు కానీ అప్పుడప్పుడూ గోశాలలకు పోయి నాలుగు పరకలు తినిపించి వస్తుంటారు....అంతేనా ఎంతో దాతృత్వమూ చూపుతారు..గుర్తుందిగా ఆ మధ్య విజయవాడ గోశాలలో ముక్కిన రవ్వ దానమిస్తే 10 ఆవులు చనిపోయిన విషయం....ఈ సంస్కృతీ రక్షకులు మాత్రం గ్రామాలవైపు పోయి రెండు ఆవులను పెంచగలరా?అబ్బే బిజీ జీవితాలాయే!

 

***

ఇక నిన్న ఒక తెలంగాణ భూపాల్ పల్లి కలెక్టర్ మురళి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి...నిజానికి ఆయన క్షయవ్యాధి గురించి ఒక అవగాహనా కార్యక్రమం నిర్వహించాడు...కోరిన ఆహారం తీసుకోమ్మన్నాడు..నిజానికి అందులో అంతోఇంతో వివాదాస్పదం అంటే అడవిపందులను వేటాడమనడం...ఇక ఆయన నాటి గురజాడ తిండి కలిగితే కండ కలదోయ్...అన్నదే మరో రకంగా చెప్పాడు. స్వామి వివేకానంద కూడా భగవద్గీతను బోధించమన్న యువతతో ముందు ధృడత్వం సంపాదించమనలేదా....గీత కంటే ఫుట్‌బాల్ వల్ల స్వర్గానికి చేరువలో ఉంటారనలేదా....దానికి మతం రంగు పులిమి ఇంత రాద్దాంతం చేయాలా?

 

అసలాయన బ్రాహ్మణీయ భావజాలం అన్నాడే కానీ కులాన్ని కించపరచలేదు..అయినా జనాలు ఉడుక్కుంటున్నారు...ఆ భావజాలం ఆ ఒక్క కులానిదే కాదు,తమ ఆధిపత్యం,భావాలే చెల్లుబాటు కావాలనే నయా ధనవంతులు,నయా క్షత్రియులు,ఇంకా చాలా కులాలది...ఇంగ్లిష్ లో hegemony పదానికి మన దేశంలో అంతకన్నా వేరే పదం లేదు. 

 

ఇంతా చేసి పక్కనోళ్లమీద..అదీ ఒకే మతంలో ఉన్నా ఆధిపత్యం చూపి లోబరుచుకోవాలనుకుని ఇతరుల సంస్కృతిని మార్చలనుకునే భావజాలాన్ని ఏమంటారో? 

click me!