అసలు ఏమిటీ హైడ్రా? ఎందుకోసం ఏర్పాటుచేసారు? నెల రోజుల్లోనే ఇంత చేసిందా..!

By Arun Kumar PFirst Published Aug 26, 2024, 4:59 PM IST
Highlights

హైదరాబాద్ నగరంలో అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతోంది తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక విభాగం హైడ్రా. సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖుల్లోనే కాదు కొందరు సామాన్యుల్లో భయం పుట్టిస్తోంది. ఇంతకూ ఏమిటీ హైడ్రా..? 

HYDRA : హైడ్రా ... ప్రస్తుతం తెలంగాణలో తెగ వినిపిస్తున్న పేరిది. మెట్రో సిటీ హైదరాబాద్ లో నివాసముంటున్న పలువురు సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు  ఈ పేరెత్తితేనే చిర్రెత్తిపోతున్నారు. అంతేకాదు తెలిసో తెలియకో, అక్రమమో సక్రమమో...ఎలాగోలా సొంతింటి కలను సాకారం చేసుకున్న కొందరు సామాన్యుల గుండెల్లో కూడా దడ పుట్టిస్తోంది హైడ్రా. ఇలా సంపన్నుల నుండి సామాన్యుల వరకు ఎవ్వరినీ వదిలిపెట్టడంలేదు... అక్రమ నిర్మాణం అని తెలిస్తే చాలు ఇంటిపైకి బుల్డోజర్లు వెళ్లిపోతున్నాయి. ఇళ్లు, ఫార్మ్ హౌస్, వ్యాపారం సముదాయాలే కాదు చివరకు తాత్కాలిక రేకుల షెడ్డులు... దేన్ని వదిలిపెట్టడంలేదు. తాజాగా సినీ హీరో అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత ఈ హైడ్రా పేరు మరింతగా మారుమోగుతోంది. 

అసలు ఏమిటీ హైడ్రా : 

Latest Videos

నిజాం పాలనలో హైదరాబాద్ నగరంలో వేలాది గొలుసుకట్టు చెరువులు, సుందరమైన పార్కులు వుండేవి. నగరంతో  పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో లక్షల ఎకరాల భూమి నిజాంల ఆధీనంలో వుండేది. నిజాంల పాలన అంతమయ్యాక ఈ చెరువులు, పార్కులు కాలక్రమేనా కనుమరుగవుతూ వచ్చాయి. నిజాంల భూముల్లో కూడా కొన్ని ప్రభుత్వ ఆధీనంలోకి వెళ్లగా, కొన్ని ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించుకున్నారు.  

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ తో పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతర్వాత కూడా హైదరాబాద్ లో భూముల ఆక్రమణ కొనసాగిందని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. నిజాంల కాలంనాటి చెరువులను పూడ్చేసి, పార్కులు, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించుకున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యంగా చెరువులు, కాలువల కబ్జా కారణంగానే అద్భుతమైన డ్రైనేజి వ్యవస్థ కలిగిన హైదరాబాద్ లో చినుకు పడితే భయపడే పరిస్థితి దాపురించిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

చెరువులను తలపిస్తున్న రోడ్లు, ఇళ్లలోకి చేరిన వరదనీరు, నగరవాసులకు వరద కష్టాలు... వర్షాకాలం వచ్చిందంటే మెట్రో సిటీ హైదరాబాద్ గురించి వినిపించే వార్తలు. ఈ పరిస్థితిని పూర్తిగా తొలగించి హైదరాబాద్ బ్రాండ్ ను కాపాడే ఉద్దేశంతో రేవంత్ సర్కార్ తీసుకున్న సాహసోపేత నిర్ణయమే హైడ్రా. 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల్లోంచి పుట్టిందే ఈ HYDRA (హైదరాబాద్  డిజాస్టర్ ఆండ్ అసెట్స్ మానిటరింగ్ ఆండ్ ప్రొటెక్షన్). వరదలు, లోతట్టు ప్రాంతాల మునక, రోడ్లు జలమయంఅనే పదాలు  భవిష్యత్ లో హైదరాబాద్ నగరంలో వినిపించకూడదనే ప్రత్యేకంగా హైడ్రాను ఏర్పాటుచేసారు. అసలు నగరంలో వరద పరస్థితులకు కారణమేంటని ఆరాతీస్తే చెరువుల కబ్జాలు, నాలాల,రోడ్ల ఆక్రమణల విషయాలు బైటపడ్డాయి. దీంతో ఏమాత్రం ఉపేక్షించకుండా ఈ నిర్మాణాల కూల్చివేతకు సిద్దమైంది రేవంత్ సర్కార్... ఇందుకోసమే ప్రత్యేకంగా హైడ్రా అనే విభాగాన్నే ఏర్పాటుచేసింది.   

ఔటర్ రింగ్ రోడ్డు లోపల అంటే హైదరాబాద్ తో పాటు చుట్టపక్కల ప్రాంతాల్లో చెరువులు, పార్కులు, ప్రభుత్వ స్థలాల ఆక్రమణలను అడ్డుకోవడమే హైడ్రా పని. గత నెల జూలైలో ఏర్పాటైన హైడ్రా కేవలం నెల రోజుల్లోనే భారీ అక్రమాలను తొలగించింది. మంచి ట్రాక్ రికార్డ్ కలిగిన సీనియర్ ఐపిఎస్ ఏవీ రంగనాథ్ ను ఈ  కమీషనర్ గా నియమించారంటే రేవంత్ సర్కార్ ఈ హైడ్రా విషయంలో ఎంత సీరియస్ గా వుందో అర్థమవుతుంది.

ముఖ్యమంత్రి నమ్మకాన్ని వమ్ముచేయకుండా రంగనాథ్ నేతృత్వంలోని హైడ్రా ఏమాత్రం నిర్మోహమాటం లేకుండా కూల్చివేతలు చేపట్టింది... రాజకీయ, సినీ, వ్యాపార ప్రముఖులనే కాదు చివరకు కాంగ్రెస్ పార్టీ నాయకులను సైతం వదిలిపెట్టడం లేదు. రాజకీయాలను అతీతంగా హైదరాబాద్ బ్రాండ్ ను కాపాడేందుకు, నగర ప్రజల ఇబ్బందులను తొలగించేందుకు ఏర్పాటయిన ఈ హైడ్రాకు ప్రజలనుండి విశేషమైన మద్దతు లభిస్తోంది. 

ఇప్పటివరకు హైడ్రా ఏం చేసింది..? 

ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతున్న నేపథ్యంలో హైదరాబాద్ లో వరద సమస్యను పరిష్కరించే పనిలోపడింది హైడ్రా. ఈ క్రమంలో చెరువుల ఆక్రమణలపై  కొరడా ఝళిపించింది... తాజాగా సినీ హీరో నాగార్జున తమ్మిడికుంట చెరువును ఆక్రమించి నిర్మించారంటూ ఎన్ కన్వెన్షన్ ను నేలమట్టం చేసారు. ఈ కన్వెన్షన్ కూల్చివేత రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.  

మొత్తంగా నెల రోజుల్లో జరిపిన కూల్చివేతల వివరాలను హైడ్రా బైటపెట్టింది. ఇప్పటివరకు నగరవ్యాప్తంగా 18చోట్ల కూల్చివేతలు చేసినట్లు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఇందులో పలువురు విఐపిలతో పాటు రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు చెందిన నిర్మాణాలు వున్నాయి. నెల రోజుల్లోనే ఏకంగా 43 ఎకరాల ప్రభుత్వ స్ధలాన్ని కాపాడినట్లు హైడ్రా ప్రకటించింది. 

లోటస్ పాండ్, నందినగర్, మన్సూరాబాద్ లో ప్రభుత్వ స్థలాన్ని కాపాడినట్లు హైడ్రా తెలిపింది.  మిథాలీ నగర్ లో పార్కు స్థలాన్ని కాపాడినట్లు, బిజెఆర్ నగర్ లో నాలా కబ్జా ను తొలగించినట్లు తెలిపారు. గాజులరామారం మహాదేవ్ నగర్ లో రెండంతస్తుల భవనం కూల్చివేసినట్లు తెలిపింది. బంజారాహిల్స్, చింతల్, ప్రగతి నగర్, అమీర్ పేట్, గండిపేట, మాదాపూర్ తదితర ప్రాంతాల్లో ఆక్రమణలను తొలగించినట్లు హైడ్రా వెల్లడించింది.

ఎంఐఎం ఎమ్మెల్యే మహ్మద్ ముబీన్, ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు సోదరుడు పల్లం ఆనంద్, బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి సునీల్ రెడ్డి, బిఆర్ఎస్ నేత రత్నాకరం సాయిరాజు, కావేరీ సీడ్స్ యజమాని భాస్కరరావు, వ్యాపారవేత్త శ్రీనివాస్ వంటి ప్రముఖుల నిర్మాణాలను కూల్చివేసింది హైడ్రా. చివరకు నందగిరి హిల్స్ పార్క్ ప్రహారికి కూల్చివేత సమయంలో స్థానికులకు మద్దతుగా నిలిచిన కాంగ్రెస్ నేత, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ను సైతం విడిచిపెట్టలేదు... ఆయనపై కేసు నమోదు చేసారు.

ఇలా అధికార, ప్రతిపక్ష పార్టీలనే తేడాలేదు... సినీ, వ్యాపార ప్రముఖులనే పక్షపాతం లేదు... ధనిక పేద అనే వ్యత్యాసం లేదు... ప్రభుత్వం స్థలం కబ్జా చేసారని తేలితే  చాలు హైడ్రా తనపని తాను చేసుకుపోతోంది. హైడ్రా పనితీరుతో రేవంత్ సర్కార్ పై ప్రజల్లో నమ్మకం పెరుగుతోంది. దీంతో హైడ్రా రెట్టించిన ఉత్సాహంతో మరింత దూకుడుగా పని కానిచ్చేస్తోంది. 

ఇప్పటివరకు హైడ్రా చేపట్టిన కూల్చివేతల లిస్ట్ :


 

click me!