Telangana Congress New PCC : కొత్త టీపీసీసీ చీఫ్ కోసం రాష్ట్ర నాయకులతో కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపింది. ఇప్పటివరకు ఆరుగురు రేసులో ఉండగా, ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, సామాజిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఇద్దరు బీసీ నాయకులు ఫైనల్ రేసులో నిలిచారు.
Telangana Congress New PCC : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, పార్టీని నడిపించే కొత్త నాయకుడు సహా పార్టీలో చేరిన వారి డిమాండ్ల పై రాష్ట్ర నాయకత్వం కేంద్ర కాంగ్రెస్ అధిష్టానంతో ఇటీవల వరుసగా చర్చలు జరిపింది. ఈ క్రమంలోనే పలు అంశాలను పక్కన పెట్టిన కాంగ్రెస్ అధిష్టానం.. టీపీసీసీ ఎంపిక విషయంలో ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక నిర్ణయం వెలువడుతుందని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో టాక్ నడుస్తోంది. ఈ విషయంలో రాష్ట్ర నాయకుల అభిప్రాయాలు, స్థానిక కుల సమీకరణాలు, సీనియారిటీ వంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే శుక్రవారం ఢిల్లీలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ దీపా దాస్ మున్షీ హాజరై ఈ విషయాలపై చర్చలు జరిపారు.
టీపీసీసీ రేసులో ఆరుగురు.. ఫైనల్ గా ఇద్దరే.. !
టీపీసీసీకి కొత్త నాయకుడి ఎంపిక వ్యవహారంలో కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్ర నాయకులతో చాలా సుదీర్ఘంగా చర్చలు జరిపింది. ఈ క్రమంలోనే రాష్ట్ర నాయకుల అభిప్రాయాలు, రాజకీయ నేపథ్యం, కుల సమీకరణాలు, స్థానిక అంశాలను పరిగణలోకి తీసుకుని కొత్త పీసీసీని ఎంపిక చేస్తోంది కాంగ్రెస్ అధిష్టానం. టీపీసీసీ పదవికి ప్రధానంగా ఆరుగురి పేర్లు చర్చకు వచ్చినట్టు సమాచారం. వారిలో బీసీ సామాజికవర్గం నుంచి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్, ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్, ఎస్సీ సామాజికవర్గం నుంచి ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్, ఎస్టీ సామాజికవర్గం నుంచి ఎంపీ బలరాం నాయక్, ఓసీ సామాజికవర్గం నుంచి మంత్రి శ్రీధర్‌బాబులు ఉన్నారు.
అధికారంలో ఉన్న పార్టీని నడిపించే నాయకుడు పార్టీని, ప్రభుత్వం ముందుకు నడిపించడంలో కీలకంగా వ్యవహరించాలి. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు, ప్రతిపక్ష పార్టీలకు ధీటుగా నిలబడాలి. ఇదే సమయంలో రాజకీయ నేపథ్యం, సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ పార్టీ పగ్గాలను బీసీ సామాజికవర్గ నేతలకు అప్పగించాలని అధిష్టానం నిర్ణయానికి వచ్చిందని రాజకీయ వర్గాల్లో టాక్ నడుస్తోంది. దీంతో ఫైనల్ రేసులో బీసీ సామాజిక వర్గానికి చెందిన సీనియర్ నేతలైన మహేశ్‌కుమార్ గౌడ్, మధుయాష్కీ గౌడ్‌లు నిలిచాడు. వీరిలో ఒకరికి టీపీసీసీ అధ్యక్ష పదవి కట్టబెట్టే అవకాశముంది. అయితే, ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి తదితరులు మహేష్ కుమార్ పేరును గట్టిగా సిఫార్సు చేశారని సమాచారం. ఇప్పుడు అధికారిక ప్రకటన రావాల్సివుంది.
హైకమాండ్ ఆదేశాలు..
కొత్త టీపీసీసీగా ఎవరు బాధ్యతలు చేపట్టిన వారిలో కలిసి పనిచేయాలని రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలకు కాంగ్రెస్ అధిష్టానం ఆదేశాలు ఇచ్చిందని సమాచారం. ఇదే సమయంలో బీసీ వర్గాల నాయకుడలకు పార్టీ పగ్గాలు దక్కింతే ఇతర వర్గాల వారికి కూడా అంటూ ఓసీ, ఎస్టీ, ఎస్సీ సామాజిక వర్గాలకు సైతం ప్రాధాన్యం ఇవ్వాలనీ, దీని కోసం ముగ్గురు వైస్ ప్రెసిడెంట్‌లను నియమించాలనే నిర్ణయం కూడా తీసుకున్నారని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.
మంత్రివర్గ విస్తరణపై రాని క్లారిటీ.. పార్టీలో చేరిన వారి డిమాండ్లు..
ఇటీవల ఇతర పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకుల గురించి కాంగ్రెస్ హైకమాండ్ తో రాష్ట్ర నేతలు వరుసగా చర్చలు జరిపారు. వారి డిమాండ్లను కూడా హైకమాండ్ ముందు ఉంచారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన నేతలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావ్, కాలె యాదయ్య, సంజయ్‌కుమార్, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డిలు పలు డిమాండ్లు చేయగా, వీరికి కార్పొరేషన్ పదవులు ఇవ్వాలని రాష్ట్ర నేతలు హైకమాండ్ ముందు ప్రతిపాదనలు ఉంచారు. దీంతో పాటు మంత్రి వర్గ విస్తరణ అంశం కూడా చర్చకు వచ్చింది. కానీ, కాంగ్రెస్ హైకమాండ్ దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని సమాచారం.