ఎన్ని స్కూళ్లపై చర్యలు తీసుకొన్నారు: వివరాలివ్వాలని సర్కార్ కి తెలంగాణ హైకోర్టు ఆదేశం

By narsimha lodeFirst Published Apr 1, 2021, 8:08 AM IST
Highlights

అధిక ఫీజులు వసూలు చేస్తున్న  ఎన్ని ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకొన్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది.

హైదరాబాద్: అధిక ఫీజులు వసూలు చేస్తున్న  ఎన్ని ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకొన్నారో చెప్పాలని ప్రభుత్వాన్ని తెలంగాణ హైకోర్టు ప్రశ్నించింది.స్కూళ్లల్లో అధిక ఫీజులు వసూలుపై దాఖలైన'పిల్'పై హైకోర్టు బుధవారం నాడు విచారణ నిర్వహించింది.విద్యార్ధుల తరపున  సీనియర్ న్యాయవాది ఎల్ . రవిచందన్ వాదించారు. 

మరోవైపు సెయింట్ అండ్రూస్ ఉన్నత పాఠశాలపై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్ ను కూడ ఈ పిటిషన్ తో కలిపి హైకోర్టు ధర్మాసనం విచారించింది.50 శాతం ఫీజు తీసుకోవాలని కోర్టు ఆదేశించినా పూర్తి ఫీజు చెల్లించాలని విద్యార్ధి తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. అంతేకాదు విద్యార్థుల పరీక్షా ఫలితాలు వెల్లడించకుండా పై తరగతులకు ప్రమోట్ చేయలేదన్నారు.

ఫీజును కోర్టులో డిపాజిట్ చేస్తే  4 రోజుల్లో ఫలితాలను వెల్లడిస్తామని స్కూల్ తరపు న్యాయవాది తెలిపారు. ప్రైవేట్ పాఠశాలలు ఆన్‌లైన్ తరగతులకు  ఎక్కువ ఫీజులు వసూలు చేస్తున్నారని  కోర్టుకు మరో  కేసులో న్యాయవాది స్పందనారెడ్డి చెప్పారు.

అయితే ఈ విషయమై ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారా అని హైకోర్టు ప్రశ్నించింది. ఈ దశలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎ.సంజీవ్ కుమార్ జోక్యం చేసుకొంటూ  దీనిపై ఫీజులను పెంచరాదని ప్రభుత్వ ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ట్యూషన్ ఫీజులను మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.  

ఈ విషయంలో సెయింట్ ఆండ్రూస్ పాఠశాలపై ఎక్కువ ఫిర్యాదులు వచ్చాయన్నారు.పీజుల విషయంలో ప్రభుత్వ ఉత్తర్వులు అమలుకు జాయింట్ డైరెక్టర్లతో రెండు బృందాలను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో విచారణ నిర్వహిస్తున్నామని చేపట్టామన్నారు.

ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘించిన స్కూల్స్ కు నోటీసులు జారీ చేసినట్టుగా ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. అయితే ఎన్ని స్కూల్స్ కు నోటీసులు జారీ చేశారు, ఎన్నింటి గుర్తింపు రద్దు చేశారో వివరాలు సమర్పించాలని హైకోర్టు ధర్మాసనం ఆదేశించింది.
 

click me!