
జగిత్యాల : తెలంగాణోళ్లకు పండగొచ్చినా... పబ్బమొచ్చినా గుర్తొచ్చేది మాంసమే. శుభకార్యమైనా, అశుభకార్యమైనా ఏటకూరతో దావత్ తప్పనిసరి. తెలంగాణ సంస్కృతిలో ఈ ఏటకూరు, కల్లు భాగమయ్యింది. తెలంగాణ ప్రజలు మటన్ ను ఎంతగా ఇష్టపడతారో సూపర్ హిట్ మూవీ 'బలగం' లో చక్కగా చూపించారు. అయితే కేవలం మటన్ ముక్క కోసం బావ బామ్మర్దుల మధ్య గొడవ జరగడం... ఇదే సినిమాలో కీలక మలుపుగా చూపించడం తెలంగాణ సంస్కృతి తెలియనివారికి సిల్లీగా అనిపించివుంటుంది. కానీ సినిమాలో కాదు నిజజీవితంలోనూ ఇలాంటి ఘటనలు జరగుతుంటాయి. ఇలా తాజాగా మటన్ ముక్కల కోసం గొడవ జరిగి ఓ పెళ్లి రద్దయిన వింత ఘటన కరీంనగర్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే... జగిత్యాల జిల్లా మెట్ పల్లికి చెందిన యువకుడికి నిజామాబాద్ జిల్లాకు చెందిన యువతితో పెళ్లి నిశ్చయమయ్యింది. ఇరు కుటుంబాల పెద్దలు కట్నకానుకలు మాట్లాడుకుని పెళ్లి చేసేందుకు సిద్దమయ్యారు. ఈ క్రమంలోనే గత నెల నవంబర్ లో వధూవరులకు నిశ్చితార్థం చేసారు. ఈ ఆనందంలో అమ్మాయి కుటుంబం మేక మాంసంతో పసందైన దావత్ ఏర్పాటుచేసారు.
ఓవైపు నిశ్చితార్థ వేడుక జరుగుతుండగా మరోవైపు ఏటకూరతో ఏర్పాటుచేసిన విందును అతిథులకు వడ్డించారు. ఇలా మగపెళ్ళివారికి సకల మర్యాదనలతో విందు వడ్డిస్తుండగానే ఊహించని గొడవ మొదలయ్యింది. అబ్బాయి తరపువారిలో ఎవరో నల్లి బొక్క కావాలని అడిగితే వడ్డించేవారు వేయలేదట. ఇది తమను అవమానించడమేనని భావించిన మగపెళ్ళివారు అమ్మాయి కుటుంబసభ్యులతో వాగ్వాదానికి దిగారు. ఇదికాస్త మరింత ముదిరి ఇరు కుటుంబాల మధ్య గొడవకు దారితీసింది.
Also Read ఓ తల్లి దీన గాధ... వీళ్లసలు కొడుకులేనా..! (హృదయవిదారక వీడియో)
ఇలా హాయిగా జరగాల్సిన ఎంగేజ్మెంట్ ఫంక్షన్ మటన్ ముక్కల కోసం గొడవజరిగి గందరగోళంగా మారింది. ఈ గొడవ కాస్తా పోలీస్ స్టేషన్ కు చేరింది. ఇరువర్గాలకు పోలీసులు సర్దిచెప్పడంతో శాంతిచారు. కానీ పెళ్లిని మాత్రం రద్దు చేసుకున్నారు.