ఓ కన్నతల్లి దీనగాద ఒకటి కరీంనగర్ జిల్లాలో వెలుగుచూసింది. ఇద్దరు కొడుకులు వున్నా ఆ తల్లి ఆలనాపాలనా చూసుకునేవారు లేకుండాపోయారు.
కరీంనగర్ : కనిపెంచిన కన్న తల్లితో చాలా దారుణంగా ప్రవర్తించారు కసాయి కొడుకులు. అమ్మపై ప్రేమ లేదు సరికదా కనీసం వృద్దురాలు అన్న జాలి కూడా వారికి లేకుండా పోయింది. ఇద్దరు కొడుకులు తల్లి ఆశ్రయం ఇచ్చేందుకు ఇష్టపడకపోవడంతో ఆమె రోడ్డునపడింది. పాపం... కొడుకుల నిర్వాకంతో ఆ తల్లి ఎముకలు కొరికే చలిలో వణికిపోతూ నరకయాతన అనుభవించింది. ఇదిచూసి ఆ గ్రామస్తులు చలించిపోయారు కానీ ఆ కొడుకుల మనసు మాత్రం కరగలేదు. ఈ హృదయవిదారక ఘటన కరీంనగర్ జిల్లాలో వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళితే... శంకరపట్నం మండలం తాడికల్ గ్రామానికి చెందిన లచ్చమ్మకు వయసు మీదపడటంతో కొడుకులపై ఆదారపడాల్సి వస్తోంది. ఇద్దరు కొడుకులు వంతులవారిగా తల్లిని చూసుకుంటున్నారు. కొంతకాలంగా పెద్ద కొడుకు వద్ద వున్న ఆ తల్లి చిన్న కుమారుడి ఇంటికి వెళ్లే సమయం వచ్చింది. కానీ ఎంతకూ తమ్ముడు తల్లిని తీసుకువెళ్లేందుకు రాలేదు. దీంతో పెద్దకొడుకు తల్లిపై కనీస జాలి చూపకుండా తమ్ముడి ఇంటిముందు తల్లిని వదిలేసి వెళ్లిపోయాడు.
ఇలా పెద్దకొడుకు ఆ తల్లిని వదిలించుకుని చేతులు దులుపుకుంటే చిన్నకొడుకు అంతకంటే దారుణంగా వ్యవహరించాడు. తల్లిని తన ఇంట్లోకి తీసుకెళ్లడంగా తమ కుటుంబానికే చెందిన ఓ పాతకాలం ఇంట్లో వదిలివెళ్లాడు. ఇలా ఇద్దరు కొడుకులు వున్నా ఆ తల్లి వృద్దాప్యంలో అనాధగా మారింది.
Also Read Hyderabad Crime Report: విస్తుగొలిపే నిజాలు.. సైబర్ నేరాల్లో హైదరాబాద్ టాప్..
తినడానికి తిండిలేక, చూసుకునేవారు లేక ఆ తల్లి ఒంటరిగా కుమిలిపోయింది. అంతేకాదు ఈ తీవ్రమైన చలికి గజగజా వణికిపోతూ బిక్కుబిక్కుమంటూ ఒంటరిగా వుంది. ఆమె దీన స్థితిని చూసి చలించిపోయిన గ్రామస్తులు కొడుకులకు సర్దిచెప్పే ప్రయత్నం చేసారు. కానీ వాళ్లుమాత్రం తల్లి ఎలా చచ్చినా తమకు సంబంధం లేదనేలా మాట్లాడారు. అంతేకాదు ఆ తల్లిపై జాలి చూపించిన వారితో గొడవకు సిద్దమయ్యారు. ఇలా నవమాసాలు కడుపున మోసి ప్రాణంపోసిన తల్లికి బ్రతికుండగానే నరకం చూపించారు కసాయి కొడుకులు.
చివరకు గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వగా వాళ్లు కూడా లచ్చవ్వ కొడుకులను నచ్చజెప్పే ప్రయత్నం చేసారు. అయినప్పటికీ ఆ కొడుకుల రాతిగుండెలు కరగలేదు. ఈ వృద్దురాలి హృదయవిదారక దీన గాద చూసినవారు ఏ తల్లీకీ ఇలాంటి బాధ రాకూడదని అంటున్నారు. ప్రాణంపోసి, పెంచి పెద్దచేసి ప్రయోజకులుగా తీర్చిదిద్దిన తల్లి వృద్దాప్యంలో వుంటే ఆలనాపాలనా చూసుకోని కసాయి కొడుకులకు కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుతున్నారు.
వీడియో