తెలంగాణలో 2023 ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి రానుందని బీజేపీ తెలంగాణ ఇంచార్జీ తరుణ్ చుగ్ చెప్పారు.. కేసీఆర్ పాలనతో ప్రజలు విసిగిపోయారన్నారు.
హైదరాబాద్:వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ తెలంగాణ ఇంచార్జీ తరుణ్ చుగ్ ధీమాను వ్యక్తం చేశారు.శుక్రవారంనాడు ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు.2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 లోక్ సభ ఎన్నికల్లో కూడా తెలంగాణ ప్రజలు టిఆర్ఎస్ ను తిరస్కరిస్తారని ఆయన ధీమాను వ్యక్తం చేశారు.తెలంగాణలో మోడీ సారథ్యంలో బిజెపి డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుందని ఆయన విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
తెలంగాణలో బిజెపి వేగంగా పుంజుకుంటుందని చెప్పారు.కేసీఆర్ పాలనలో తెలంగాణ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారన్నారు. కెసిఆర్ కుటుంబం అనుసరిస్తున్న విధానాలతో తెలంగాణ ప్రజలు విసిగిపోయారని ఆయన చెప్పారు. కేసిఆర్ పాలనలో ప్రజలు దోపిడీకి గురి అవుతున్నారన్నారు.
దక్షిణాది రాష్ట్రాల్లో పట్టును పెంచుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగా రెండు రోజుల పాటు హైద్రాబాద్ సమీపంలోని షామీర్ పేటలో విస్తారక్ ల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో బీజేపీ కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో 90 అసెంబ్లీ సీట్లను దక్కించుకోవాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఈ విషయమై ఆ పార్టీ అగ్రనేత బీఎల్ సంతోష్ పార్టీ నేతలకు దిశా నిర్ధేశం చేశారు. 90 అసెంబ్లీ స్థానాల్లో విజయం కోసం ఏడాది పాటు కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఏడాది పాటు నిర్వహించాల్సిన కార్యక్రమాలపై పార్టీ నేతలకు పార్టీ జాతీయ నాయకత్వం దిశా నిర్ధేశం చేశారు.
also read:కేసీఆర్ హటావో తెలంగాణ బచావో నినాదంతో ఎన్నికలకు :బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్
దక్షిణాదిలోని అధిక ఎంపీ స్థానాల్లో విజయం సాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై కూడా ఈ సమావేశంలో చర్చించారు. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత రాష్ట్రాల నుండి 96 మంది విస్తారక్ లు ఈ సమావేశంలో పాల్గొన్నారు.