కాంగ్రెస్ ఎండ్రికాయల పార్టీ.. అందులోకి ఎవరైనా పోతారా ? - కొత్త ప్రభాకర్ రెడ్డి

By Sairam Indur  |  First Published Jan 24, 2024, 2:30 PM IST

కాంగ్రెస్ (congress) పార్టీ అంటే ఎండ్రికాయల పార్టీ అని, అందులోకి ఎవరైనా పోతారా అని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి (Dubbaka MLA Kotha Prabhakar Reddy) ప్రశ్నించారు. తమ నియోజకవర్గాలో అభివృద్ధి పనుల కోసమే సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth reddy) ని కలిశామని చెప్పారు. బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలపై బుదరజల్లుకోవడం మానుకోవాలని సూచించారు. 


బీఆర్ఎస్ నాయకుడు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ను ఎండ్రికాయల పార్టీతో పోల్చారు. అందులోకి ఎవరైనా వెళ్తారా అని ప్రశ్నించారు. బుధవారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఎమ్మెల్యేలు గూడెం మైపాల్ రెడ్డి, సునితా లక్ష్మారెడ్డి, మాణిక్ రావులతో కలిసి మీడియాతో సమావేశం నిర్వహించారు. బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ లో చేరుతున్నారంటూ వస్తున్న వార్తలను వీరంతా ఖండించారు. 

ఈ సందర్భంగా కొత్త ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. తాము నిన్న (మంగళవారం) తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలవడంలో తప్పేముందని ప్రశ్నించారు. తన నియోజకవర్గంలో జరగాల్సిన అభివృద్ధి కార్యక్రమాల కోసం సీఎం ను కలిశామని చెప్పారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సీఎం కాదని, తెలంగాణ రాష్ట్రానికి సీఎం అని అన్నారు. ప్రోటోకాల్ విషయంలో కూడా నిబంధనలు పాటించడం లేదనే విషయాన్ని సీఎంకు తెలియజేశామని అన్నారు. తనపై హత్యా ప్రయత్నం జరిగిన తర్వాత గన్ మెన్ లను కుదించడం పట్ల, వారి పనివేళల్లో మార్పుల పట్ల రాష్ట్ర ఇంటలిజెన్స్ ఐజీని కూడా కలిశామని అన్నారు. 

మాపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజా సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకే కలిశాం : ఎమ్మెల్యే శ్రీ pic.twitter.com/7g0lJ7UQEt

— BRS Party (@BRSparty)

Latest Videos

ఒక్క సారి కాదని, అవసరమైతే 100 సార్లు కూడా తాను సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానని కొత్త ప్రభాకర్ రెడ్డి చెప్పారు. తన నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం, నిధులు మంజూరు చేయించుకునేందుకు కలుస్తూనే ఉంటానని అన్నారు. తాను ఎంపీగా ఉన్నప్పుడు ప్రధాని నరేంద్ర మోడీని కూడా కలిశానని, అలాగే కేంద్ర మంత్రులను కూడా కలిశానని చెప్పారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ఇతర అంశాలపై వారితో చర్చించేవాడినని అన్నారు. 

తాను ఎమ్మెల్యే అయిన తరువాత కూడా మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిని కలిశానని, ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిశానని చెప్పారు. మల్లన్న సాగర్ ద్వారా నీళ్లు రావడం లేదనే విషయాన్ని వారికి తెలియజేశానని అన్నారు. గతంలో ఇరిగేషన్ మంత్రి ఒక్క మేసేజ్ చేస్తే కాలువల్లో నీళ్లు వచ్చేవని తెలిపారు. కానీ తాను ఇప్పుడున్న ఇరిగేషన్ మంత్రిని కలిసి 15 రోజులు అవుతుందని, కానీ నేటి వరకు కూడా నీళ్లు విడుదల కాలేదని అన్నారు. 

నలుగురు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిస్తే దానిని రాజకీయం చేస్తున్నారనని కొత్త ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే ఎండ్రికాయల పార్టీ అని, అందులోకి ఎవరైనా వెళ్తారా అని ప్రశ్నించారు. తాము ఎప్పుడూ బీఆర్ఎస్ పార్టీలోనే ఉంటామని స్పష్టం చేశారు. అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల పైన బురదజల్లకూడదని కోరారు. మెదక్ జిల్లా బీఆర్ఎస్ అడ్డా అని, ఖచ్చితంగా రాబోయే పార్లమెంటు ఎలక్షన్ లో తమ పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. 

click me!